
Virat Kohli : వన్డే వరల్డ్ కప్ 2023లో 711 పరుగులతో విధ్వంసం స్రష్టిస్తున్న విరాట్ కోహ్లీలో ఎవరికీ తెలియని అపరిచితుడు ఉన్నాడు. అతను కీలకమ్యాచ్ ల్లో బయటకు వస్తుంటాడు. టీ 20 వరల్డ్ కప్ 2022లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో చూశారు కదా.. అలాటప్పుడు వస్తాడన్నమాట. ఆ రోజు విరాట్ ఆడిన ఆటని ఎవరు మరిచిపోగలరు. అలాంటిదే మరొక్కసారి ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్ లో కూడా చూడాలని 140 కోట్ల భారతీయులు కోరుకుంటున్నారు. ఇంతకీ కొహ్లీలో దాగున్నఆ అపరిచితుడి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఒకసారి అతని కెరీర్ వైపు చూద్దాం.
అది 2008లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్.. 20 ఏళ్ల వయసు కుర్రాడు అంతర్జాతీయ కెరీర్ ని ప్రారంభించాడు. ఈ రోజు అతను ఇంతింతై వటుడింతై ఎదుగుతాడని అనుకోలేదు. ఆ 20 ఏళ్ల కుర్రాడు మరెవరో కాదు.. మన విరాట్ కొహ్లీ.
ఇప్పటికి 15 సంవత్సరాలు గడిచిపోయింది. కోహ్లీ వయసు ఇప్పుడు 35 సంవత్సరాలు. తన ఫిట్ నెస్ ప్రకారం చూస్తే మహా అయితే మరో మూడేళ్లు లేదా వచ్చే వరల్డ్ కప్ ఆఖరిదైనా కావచ్చు.
ఇప్పటివరకు వన్డే కెరీర్ లో 291 మ్యాచ్ లు ఆడిన కొహ్లీ 13, 794 పరుగులు చేశాడు. ఇందులో హయ్యస్ట్ స్కోరు 183. ఇందులో అయితే 50 సెంచరీలు, 71 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేలు ఆడిన మూడేళ్ల తర్వాత టెస్టుల్లో కోహ్లీకి స్థానం దొరికింది.
111 టెస్ట్ లు ఆడిన కొహ్లీ 8,676 పరుగులు చేశాడు. 29 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు చేశాడు. 115 టీ 20లు ఆడిన కొహ్లీ 4008 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 37 హాఫ్ సెంచరీలున్నాయి. మొత్తం అన్ని ఫార్మాట్లలో కలిపి 80 సెంచరీలు కోహ్లీ ఖాతాలో ఉన్నాయి. మరో 21 గానీ చేస్తే, సచిన్ 100 సెంచరీల రికార్డ్ కూడా దాటడం ఖాయంగా కనిపిస్తోంది.
కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు కొహ్లీలో పిచ్చికోపం ఉండేది. దాంతో ఎన్నో వివాదాలను కొని తెచ్చుకునే వాడు. కొందరి మీద చేయి చేసుకునే వాడు కూడా.. కోహ్లీ ప్రవర్తనపై బీసీసీఐ ఎంతో సహనం వహించింది. కోహ్లీ కెరీర్ ని వాళ్లు ముందే ఊహించారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆటగాడకి మనం పనిష్మెంట్లు ఇవ్వడం సరికాదని, అతని అగ్రిస్సివ్ ని వాళ్లు కూడా భరించారు. మరోవైపు నుంచి కౌన్సెలింగ్ ఇవ్వడం ప్రారంభించారు.
ఎందుకంటే ఆ అగ్రివ్ నెస్ ఉండబట్టే, ఛేజింగ్ లో 27 సెంచరీలు చేశాడు. అదే కసి ఉండబట్టే, తనిప్పటి వరకు ఫిట్ నెస్ తో ఉంటున్నాడు. అదే పట్టుదల ఉండబట్టే ఇప్పుడు వరల్డ్ కప్ లో 711 పరుగులు చేశాడు. అందుకని అగ్రిస్సెవ్ ని వ్యక్తిగతంగా కాకుండా, ఆటపై మాత్రమే ఉండేలా కొందరు గురువులు తనని తీర్చిదిద్దారు.
మొత్తానికి మనిషి మారాడు. మామూలు మనిషయ్యాడు. అనుష్క శర్మతో వివాహం జరిగిన తర్వాత పూర్తిగా మారిపోయాడు. కూతురు వామిక పుట్టిన తర్వాత ఇంకా మారిపోయాడు. ఎప్పుడూ యాంగ్రీ యంగ్ మెన్ గా ఉండే కోహ్లీ ముఖంలో నవ్వు కనిపించడం మొదలుపెట్టింది. అదిప్పటి వరకు అలాగే ఉంది. కానీ గ్రౌండ్ లోకి వెళ్లాక ఈసారి తప్పకుండా ఆడాలని కసిగా అనుకుంటే మాత్రం.. తనలో ఎక్కడో దాగున్న అపరిచితుడు మాత్రం ఒక్కసారి బయటకు వస్తాడు.
ఇదిగో ఇప్పుడు వరల్డ్ కప్ లో చూశారు కదా.. ఎలా వచ్చి దుమ్ముదులుపుతున్నాడో.. ఇలా రేవెట్టేసి వెళ్లిపోతాడు. ఆఖరి ఫైనల్ మ్యాచ్ లో కూడా కొహ్లీలో అపరిచితుడు అలాగే ఉండి.. ఆస్ట్రేలియాని ఉతికి ఆరబెట్టి, ఇండియాకి ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ తీసుకురావాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ కోహ్లీ.