BigTV English

Prayagraj Kumbh Mela: ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణరథం

Prayagraj Kumbh Mela: ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణరథం

Prayagraj Kumbh Mela: తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు శ్రీవారి కళ్యాణ రథం బయల్దేరింది. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం BR నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి జెండా ఊపి ప్రయాగ్ రాజ్‌కు స్వాములోరి కళ్యాణరథాన్ని పంపారు.


ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహాకుంభమేళాను దిగ్విజయం చేసేందుకు అందరు సహకరించాలని TTD ఛైర్మన్ BR నాయుడు పిలుపునిచ్చారు. తిరుమల నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు శ్రీవారి కళ్యాణరథం బయలుదేరిన కార్యక్రమంలో ఆలయ సభ్యులతో కలసి పూజలు చేపట్టారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు యూపీలోని ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా జరగనుంది.

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కేటాయించిన రెండున్నర ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తామని నాయుడు చెప్పారు. 170 మంది సిబ్బందితో నమూనా ఆలయంలో తిరుమల తరహాలో కైంకర్యాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉత్తరాది భక్తులకు.. స్వామి వారి అర్జిత సేవలను తిలకించే భాగ్యం కల్పించనున్నట్లు TTD ఛైర్మన్ తెలిపారు.


కాగా.. శాస్త్రీయంగా.. హిందూ ధర్మంలో కుంభమేళా అనేది ఓ ముఖ్యమైన సంస్కృతిగా నిలుస్తోంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహా కుంభమేళాను నిర్వహించేందుకు పండితులు ముందుగానే ముహూర్తం నిర్ణయిస్తారు. దీని వెనుక జ్యోతిష్య శాస్త్ర ప్రక్రియతో పాటు పురాతన శాస్త్రం కూడా దాగుంది. అంతకుమించి.. సైన్స్ కూడా దీనితో లింక్ అయి ఉంది. కుంభమేళా సమయంలో.. ఖగోళంలో జరిగే మార్పులు, రాశులు, నక్షత్రాలు, గ్రహాల స్థితుల్ని.. పరిగణనలోకి తీసుకుంటారు. అవన్నీ కుదిరాకే.. మహా కుంభమేళాకు ముహూర్తాన్ని నిర్ణయిస్తారు వేద పండితులు.

ఈ జనవరి 13న ప్రారంభం కానున్న మహాకుంభమేళా.. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవం మాత్రమే కాదు. ఆధ్యాత్మిక, పురాణ, విజ్ఞాన శాస్త్రాల సంగమం కూడా. ప్రతి నాలుగేళ్లకోసారి.. 3 పవిత్ర ప్రదేశాలైన హరిద్వార్, ఉజ్జయినీ, నాసిక్‌లో అర్ధ కుంభమేళాలు నిర్వహిస్తుంటారు. ప్రతి పన్నెండేళ్లకోసారి ప్రయాగ్‌రాజ్ దగ్గర పూర్ణ కుంభమేళాని జరుపుతుంటారు. ఈ సమయంలో.. పవిత్ర నదుల్లో స్నానం చేయడం ద్వారా జీవన, మరణ చక్రాల నుంచి విముక్తి లభిస్తుందని.. కోట్లాది మంది భక్తులు నమ్ముతారు. అయితే.. మహా కుంభమేళా అనేది ఆధ్యాత్మిక సారాంశానికి మించిన ఉత్సవం. ఈ సమయంలో.. ఖగోళంలో జరిగే మార్పులు, గ్రహాల స్థితిగతులు, ముఖ్యంగా బృహస్పతి కక్ష్యలో వచ్చే మార్పు ప్రధానమైనదిగా చెబుతుంటారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2013లో చివరిసారిగా కుంభమేళా జరిగింది. అప్పుడు.. దాదాపు 20 కోట్ల మంది వచ్చారని యూపీ సర్కార్ అంచనా వేసింది. ఈసారి.. కుంభమేళాకు భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా.. 123 దేశాల నుంచి 40 కోట్ల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. కుంభమేళా నిర్వహణకు గతంలో 4700 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు.. సుమారుగా 6500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్రం, యూపీ ప్రభుత్వం కలిసి.. ఈసారి కుంభమేళాను నిర్వహిస్తున్నాయి.

Also Read: మహా కుంభమేళా – ప్రతి మూడు తరాల్లో.. ఒక తరానికే ఆ అదృష్టం, ఆ రోజు నుంచే రాజస్నానం

ఇప్పటికే.. సాధువులు కుంభమేళా ప్రాంతానికి చేరుకొని.. అఖాడాలలో ఉంటున్నారు. ఈ మహా కుంభమేళా జనవరి 13న పుష్య మాస పౌర్ణమి రోజు నుంచి ప్రారంభమై.. ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో ముగుస్తుంది. ఈ 45 రోజుల్లో.. ఆరు రోజులు ఎంతో విశిష్టమైనవిగా భక్తులు భావిస్తుంటారు. ప్రత్యేక రోజుల్లో.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. సాధారణ భక్తులతో పాటు వీఐపీలు, నాగ సాధువులు, ఇతర సాధువులు కల్పవాసీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు.. కుంభమేళాకు హాజరవుతారు.

ఈ కుంభమేళా.. హర్షవర్ధన చక్రవర్తి కాలం నుంచి మొదలైనట్లుగా చారిత్రక ఆధారాలున్నాయంటున్నారు కొందరు చరిత్రకారులు. హర్షవర్ధనుడి కాలంలో.. ఐదేళ్లకోసారి కుంభమేళా తరహాలో భారీ కార్యక్రమం నిర్వహించేవారట. అప్పుడు.. హర్షవర్ధనుడు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చి కవులు, ఆధ్యాత్మికవేత్తలకు దానాలు చేసేవారని, ఇదే కుంభమేళాకు సంబంధించిన తొలి చారిత్రక ఆధారమని చెబుతున్నారు. అయితే.. అంతకంటే ముందే గుప్తుల కాలంలో కుంభమేళా జరిగినట్లుగా ఇంకొందరు చెబుతున్నారు. మరోవైపు.. శంకరాచార్య కాలంలోనూ కుంభమేళా నిర్వహించారనే ప్రస్తావన కూడా ఉంది. పైగా.. శంకరాచార్య ఖగోళ పరిస్థితులను అనుసరించారు. ఎప్పుడైతే.. 12 ఏళ్లకోసారి నక్షత్రాల కలయిక జరుగుతుందో.. అదే సమయంలో కుంభమేళాను శంకరాచార్య జరిపించారనే వాదనలున్నాయి.

ఇంకొన్ని రోజుల్లో మొదలవబోయే కుంభమేళాకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం దగ్గర.. ఇప్పటికే ఘాట్‌ల నిర్మాణం దాదాపు పూర్తయింది. త్రివేణి సంగమ ప్రదేశంలో పుణ్యస్నానాలు చేసిన తర్వాత.. దుస్తులు మార్చుకునేందుకు వీలుగా ఫ్లోటింగ్ ఛేంజింగ్ రూమ్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ భక్తులతో పాటు వీఐపీల కోసం 12 జెట్టీలపై దూస్తులు మార్చుకునేందుకు గదులు నిర్మిస్తున్నారు. వీటితో పాటు సంగమం ఒడ్డున కూడా తాత్కాలికంగా డ్రెస్ ఛేంజింగ్ రూమ్స్‌ని ఏర్పాటు చేశారు. కుంభమేళా జరిగే ప్రాంతంలో నదిలో చదును చేసే పనులు, ఫ్లోటింగ్ బ్రిడ్జిల నిర్మాణం చివరి దశలో ఉంది. గత కుంభమేళాకు 22 ఫ్లోటింగ్ బ్రిడ్జిలు నిర్మించగా.. ఈసారి 30 నిర్మిస్తున్నారు. వీటిపై.. 5 టన్నుల బరువున్న వాహనాలు కూడా ప్రయాణించే వీలుంది.

కుంభమేళా కోసం 50 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 2700 ఏఐ ఆధారిత సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటన్నింటిని.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో లింక్ చేశారు. వీటి ద్వారా భక్తుల కదలికలు, కుంభమేళా ప్రదేశాలన్నింటిని మానిటర్ చేయనున్నారు. మొత్తం 67 వేల ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు.. వంద మీటర్ల లోతుకు వెళ్లగల అండర్ వాటర్ డ్రోన్లతోనూ నిఘా పెట్టారు. ఇప్పటికే.. సంగమానికి వెళ్లేదారిలో రోడ్లని వెడల్పు చేశారు. అయినప్పటికీ.. కుంభమేళా సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. భక్తుల రాకపోకల కోసం.. 5 నుంచి 6 వేల పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సుల్ని అందుబాటులో ఉంచనున్నారు. ఎయిర్‌పోర్ట్‌లోనూ కొత్త టెర్మినల్ ఏర్పాటు చేశారు. ఓవరాల్‌గా.. మహా కుంభమేళాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు.. అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×