మన దేశంలో శక్తి పీఠాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన ఆలయాల్లో ఈ శక్తి పీఠాలు కూడా ఒకటి. కచ్చితంగా చూడాల్సిన అత్యంత శక్తివంతమైన శక్తి పీఠాలు ఆరు ఉన్నాయి. ఈ ఆరు శక్తి పీఠాలను జీవితంలో ఒక్కసారి అయినా దర్శించుకోవాలి. శివుని భార్య అయిన మాతా సతీ శరీర భాగాలే శక్తి పీఠాలుగా మారాయి. వాటిలో ఆరు అత్యంత శక్తివంతమైన శక్తిపీఠాల గురించి ఇక్కడ ఇచ్చాము.
కామాఖ్య దేవాలయం
ప్రపంచంలోని శక్తివంతమైన ఆలయాల్లో కామాఖ్య దేవి ఆలయం ఒకటి. ఇది సతీ దేవి యోని భాగమని చెబుతారు. కొంతమంది గర్భమని కూడా చెప్పుకుంటారు. అది భూమిపై పడిన ప్రదేశమే శక్తిపీఠంగా మారిందని అంటారు. ఈ ప్రదేశం స్త్రీ శక్తితో ముడిపడి ఉంటుంది. సంతానోత్పత్తిని ప్రసాదించే ఆలయంగా ఇది గుర్తింపు పొందింది. ప్రతి ఏడాది ‘అంబుబాచి మేళా’ ఇక్కడ నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ మేళాను చూడ్డానికి వస్తారు. ఈ పండుగ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి నెలసరి వస్తుందని నమ్ముతారు. ఆమెను తల్లి రూపంలో కొలుస్తారు.
వైష్ణో దేవి ఆలయం
మరొక శక్తివంతమైన శక్తిపీఠం వైష్ణో దేవి ఆలయం. మాత సతీదేవి పుర్రె శివుడి చేతి నుంచి కింద పడిపోతుంది. అదే వైష్ణో దేవి ఆలయం అని చెప్పుకుంటారు. ఈ ఆలయం శక్తి ఆరాధనకు ముఖ్యమైనది. ఆలయాన్ని చేరుకోవడానికి దాదాపు 13 కిలోమీటర్ల కొండ మీదకి ఎక్కి వెళ్లాలి. మాత వైష్ణో దేవిని పూజించడం వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అని చెబుతారు.
కాళీఘాట్ ఆలయం
కోల్ కతాలోని ఒక ప్రసిద్ధ ఆలయం కాళీఘాట్ ఆలయం. సతీదేవి కుడి పాదాల కాలివేలు ఇక్కడ పడ్డాయని చెప్పుకుంటారు. భక్తులు కాళీమాతను ఇక్కడ తమను రక్షించమని కోరుతారు. రాక్షసుల నుంచి కాపాడే శక్తి ఈ కాళీమాతకే ఉందని భక్తుల నమ్మకం.
హింగ్లాజ్ మాత ఆలయం
భారతదేశంలో లేని శక్తిపీఠం ఇది. ప్రస్తుతం పాకిస్థాన్లోని బలూచిస్తాన్లో ఈ శక్తి పీఠం ఉంది. మాత సతి తల ఇక్కడ పడిందని నమ్ముతారు. హింగ్లాజ్ మాత దేవాలయం చూసేందుకు ప్రతి ఏడాది హింగ్లా యాత్రను నిర్వహిస్తారు. పాకిస్తాన్లోని వేలాది మంది హిందువులు ఈ ప్రాంతానికి వెళ్లి పూజలు చేస్తారు.
జ్వాలా దేవి మందిరం
హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా ప్రాంతంలో జ్వాలా దేవి మందిరం ఉంది. ఇక్కడ మాత సతీదేవి నాలుక పడిందని చెప్పకుంటారు. ఆమె ఇక్కడ శాశ్వతమైన మంట రూపంలో ఉంటుంది. పాండవులు నిర్మించిన మొదటి దేవాలయాల్లో దీన్ని ఒకటిగా వివరిస్తారు. శతాబ్దాలుగా ఎలాంటి ఇంధనం అవసరం లేకుండా అక్కడ మంట మండుతూ ఉంటుందని అంటారు. ఇది అద్భుతమైన ఆలయాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది.
Also Read: ఇంట్లోకి వెళ్ళగానే మీలో ఇలాంటి అనుభూతి కలిగితే.. అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే లెక్క
ముక్తినాథ్ ఆలయం
భారతదేశంలో లేని మరొక శక్తివంతమైన శక్తిపీఠం ముక్తినాథ్ ఆలయం. నేపాల్ లోని ఈ ముక్తినాథ్ ఆలయం ఉంది. ఇక్కడ మాత సతి నుదురు పడిపోయిందని చెప్పుకుంటారు. మరికొందరు మాత సతీ దేవి తల మొత్తం ఇక్కడే పడిందని అంటారు. ముక్తినాధుని సందర్శనం చేసుకుంటే భక్తుల పాపాలు పోతాయని అంటారు. ముక్తిని పొందడానికి ఎక్కువమంది ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు.