Elon Musk : ఈ భూమిపై మారుమూల ప్రాంతాలకూ ఇంటర్నెట్ సేవలు అందించాలన్న లక్ష్యంతో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్లు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ ఇంటర్నెట్ కనెక్టివిటీలో విప్లవాత్మక పురోగతికి శ్రీకారం చుట్టిన ఈ స్టార్‌లింక్ శాటిలైట్లు మరింత విస్తరించే దిశగా మస్క్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ సంస్థ స్టార్ లింక్‌ను నడుపుతున్న ఎలన్ మస్క్‌కు ఓ ఎదురుదెబ్బ తగిలింది. తమ దేశంలో లైసెన్స్ లేకుండా ఈ స్టార్ లింక్ కార్యకలాపాల్ని కొనసాగించడాని నిలిపివేయాలని నమీబియా కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ ఆథారిటీ ఆదేశించింది.
స్పేస్ ఎక్స్‌కు చెందిన ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ అయిన స్టార్ లింక్ చాలా ఆఫ్రికన్ దేశాల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. కానీ ఇతర చోట్ల ఈ స్టార్ లింక్, రెగ్యులేటరీ ఛాలెంజెస్ను ఎదుర్కొంటోంది. స్టేట్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీల నుంచి కూడా ఈ సవాళ్లను ఎదుర్కొంటోంది.
అయితే వాస్తవానికి స్టార్ లింక్ నమీబియాలో టెలికమ్యూనికేషన్స్ సర్వీసెస్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తుకుంది. కానీ అక్కడి రెగ్యులేటర్ ఇంకా లైసెన్స్‌ను జారీ చేయలేదు. దరఖాస్తు ఇంకా రివ్యూలోనే ఉందని పేర్కొంది. అయినా కూడా స్టార్ లింక్ అక్కడ తమ కార్యకలాపాలను మొదలు పెట్టింది.
“నమీబియాలో స్టార్ లింక్ ఎటువంటి టెలికమ్యునికేషన్స్ లైసెన్స్ లేకుండా తమ కార్యకలాపాలను కొనసాగిస్తోంది” అని CRAN పేర్కొంది. దానికి స్పందించిన నమీబియా అథారిటీ వెంటనే స్టార్‌లింక్‌ను వెంటనే తమకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశాలను జారి చేసింది. స్టార్ లింక్ టెర్మినల్ ఈక్విప్మెంట్ లేదా ఆ సర్వీసెస్‌కు సంబంధించి ఎటువంటి సబ్‌స్కైబ్ చేసుకోకూడదని ప్రజలకు సూచించింది. అలానే నమీబియా అథారిటీ ఇన్వెస్టిగేటర్స్ ఇప్పటికే వినియోగదారుల నుంచి ఇల్లీగల్‌గా టెర్మినల్స్‌ను జప్తు చేశారు. క్రిమినల్ కేస్‌లను నమోదు చేశారు.
అయితే తమ కార్యకలాపాలను నిలిపివేయాలని నమీబియా అథారిటీ అదేశాలు జారీ చేయడంపై స్పేస్ ఎక్స్ వెంటనే స్పందించలేదు. కాగా, గత ఏడాది కామెరూన్ కూడా లైసెన్స్ లేని కారణంగా పోర్ట్ దగ్గర ఉన్న స్టార్ లింక్ ఈక్విప్‌మెంట్‌ను సీజ్ చేయాలని ఆదేశించింది.
పరిశోధకుల ఆందోళనలు – మరోవైపు ఈ స్టార్‌లింక్ శాటిలైట్లు విశ్వ పరిశోధనలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త తరం స్టార్ లింక్ ఉపగ్రహాలు కీలకమైన రేడియో సిగ్నళ్లను బ్లాక్ చేస్తున్నాయని, ప్రతి కొత్త ప్రయోగంతో పరిస్థితి మరింత దిగజారుతోందని నెదర్లాండ్స్‌కు చెందిన పరిశోధకులు అంటున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా పలు వాదనలు సైతం వినిపిస్తున్నాయి.
భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు!
స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు భారత్‌లో ప్రారంభమయ్యేందుకు మార్గం సుగమం అవుతున్నట్లు తెలుస్తోంది.భారత్‌లో టెలికాం నిబంధనలకు సూత్రప్రాయంగా స్టార్‌లింక్ అంగీకారం తెలిపినట్లు తెలిసింది. త్వరలోనే స్టార్‌లింక్ సంస్థ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు అనుమతులు పొందే అవకాశం ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. అయితే దేశీయ ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.