హిందూ పండుగలో వసంత పంచమి ఎంతో ముఖ్యమైనది. ఈ పండుగను ప్రతి ఏడాది మాఘమాసంలోని శుక్లపక్ష పంచమి నాడు నిర్వహించుకుంటారు. శీతాకాలం ముగింపుకు, వేసవి ఆరంభానికి ఇది సూచికగా కూడా ఉపయోగపడుతుంది. ఈ సీజన్లోనే పొలాలు పచ్చగా పండి ఉంటాయి. ముఖ్యంగా ఆవాల మొక్కలు ఇదే సీజన్లో పసుపు రంగులు పువ్వులతో నిండిపోతాయి. సరస్వతి దేవికి కూడా పసుపు రంగు అంటే ఎంతో ఇష్టం.
వసంత పంచమి రోజే జ్ఞానానికి దేవత అయిన సరస్వతీ మాతను దేశవ్యాప్తంగా పూజిస్తారు. ఆ రోజు పసుపు బట్టలు ధరిస్తారు. దేనికి పసుపు, కుంకుమ అర్పిస్తారు. అలాగే పసుపు రంగులో ఉన్న పండ్లు, పువ్వులు, చీర, నైవేద్యాలు సమర్పిస్తారు. అమృత స్నానాలు చేసేందుకు కోట్లాదిమంది వస్తారు .
మాఘ మాసంలోని శుక్లపక్ష పంచమ తిథి ఈసారి ఆదివారం ఫిబ్రవరి 2వ తారీఖున వచ్చింది. అందుకే వసంత పంచమి అదే రోజు నిర్వహించుకుంటారు. వసంత పంచమి రోజున జ్ఞాన దేవత అయిన సరస్వతి దేవి దర్శనమిస్తుందని చెబుతారు. ఒక చేతిలో పుస్తకం, రెండో చేతిలో వీణ, మూడో చేతిలో జపమాల, నాలుగో చేతిలో అభయహస్తంతో కనిపిస్తుంది. సరస్వతి దేవిని పూజించడం ద్వారా ఆమె ఆశీర్వాదాలు కుటుంబానికి ఉంటాయని చెప్పకుంటారు.
వసంతపంచమి నాడు చేయకూడని పనులు
వసంత పంచమి నాడు కొన్ని పనులు చేయకూడదు. ఆ పనులు చేయడం ద్వారా సరస్వతి మాతకు కోపం తెప్పించిన వారవుతారు. వసంత పంచమి రోజు పొరపాటున కూడా చెట్లను, మొక్కలను నరకకండి. వసంత పంచమి నుంచే వసంతకాలం ప్రారంభమవుతుందని చెబుతారు. కాబట్టి ఈరోజు ప్రకృతికి అంకితం చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో చెట్లను, మొక్కలను నరికితే అది ప్రకృతిని అవమానించినట్లే.
ఇది సరస్వతి దేవికి కోపం తెప్పించే అంశం. అలాగే వసంత పంచమి రోజున పొరపాటున కూడా మాంసము, మద్యము సేవించకండి. ఇలా చేయడం వల్ల మేలు జరగదు. దానికి బదులుగా ఉపవాసం ఉండండి. లేదా స్వచ్ఛమైన సాత్వికమైన ఆహారం తినేందుకు ప్రయత్నించండి. ఆ రోజున మాటలు కూడా తగ్గించండి. ఎవరితోను గొడవలు పడడం, తిట్టడం పరుషమైన పదాలు వాడటం వంటివి చేయకండి.
Also Read: మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేసే పుట్టుమచ్చలు ఎక్కడుంటాయో తెలుసా..?
వసంత పంచమి రోజు ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో పూజలు నిర్వహించుకుంటే ఎంతో మంచిది. సరస్వతి దేవికి నైవేద్యంగా పసుపు రంగులో ఉన్న ఆహారాలను నివేదించండి. అలాగే పూజలో పసుపు రంగు చీరనే కట్టుకొని కూర్చోండి. పసుపు రంగు దుస్తులు వేసి అమ్మవారిని పూజిస్తే మీ కోరిన కోరికలు నెరవేరుతాయి. మీకు ఎంతో మేలు జరుగుతుంది.