Holi: హోలీ వచ్చేస్తోంది. ప్రతి ఒక్కరు రంగులు పూసుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఒకచోట మాత్రం స్మశాన వాటిక నుంచి బూడిదను తెచ్చి హోలీ ఆడతారు.
హిందువుల ప్రధాన పండుగలలో హోలీ ఒకటి. ఆరోజు హోళికా దహనం చేసి రంగులను చల్లుకొని, స్వీట్లు పంచుకుంటారు. ఎంతో ఆనందంగా చేసుకునే పండగలలో హోలీ ఒకటి. హోలీ రంగులలో కొంతమంది సహజమైనవి వాడితే, మరికొందరు కృత్రిమమైన రంగులు వాడుతూ ఉంటారు. అయితే ప్రపంచంలోని ఒకే ఒక్క నగరంలో మాత్రం స్మశాన వాటిక నుంచి తెచ్చిన బూడిదతో హోలీ ఆడతారు. ఆ నగరం కాశి.
కాశీలో వారంతా అక్కడున్న స్మశాన వాటికల్లోంచి బూడిదని తెచ్చుకొని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ, ఒకరికి ఒకరు రాసుకుంటూ హోలీ ఆడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మరణ భయమే ఉండదని వారి ఉద్దేశం.
కాశీలో హోలీ ఆడడం వెనక ఒక ప్రత్యేక కారణం ఉంది. కాశీలో బూడిదతో హోలీ ఆడడం అనేది మరణం కూడా ఒక వేడుకే అని చెప్పడమే. రంగులకు బదులుగా చితి దగ్గర బూడిదను తీసుకొచ్చి మనుషుల ముఖాలకు పూస్తారు. ముఖ్యంగా కాశీలోని హరిశ్చంద్ర ఘాట్లో ఈ హోలీని ఆడతారు.
కొందరు ముఖాలపై బూడిదను రాసుకుంటారు. మరి కొందరు ఆ బూడిదలోనే పడి దొర్లుతారు. బూడిదల కుప్పలు అక్కడ వేసి ఉంటాయి. దాని చుట్టూ జనసమూహం చేరి ఆ బూడిదను అంతా అంటించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఒకవైపు చితి కాలుతూ పొగలు వస్తూనే ఉండగా… మరోవైపు ఆ బూడిదతోనే హోలీ ఆడుతారు. అంటే అక్కడ సంతోషం, దుఃఖం కలిసి ఒకే చోట ఉంటాయి. ధన సంస్కారాల చేస్తున్న చోటే నవ్వుతూ తుళ్లుతూ హోలీ ఆడడం అనేది కేవలం అక్కడే చూస్తాము.
ప్రపంచంలోనే చాలా ప్రత్యేక నగరం కాశీ. ఇలా బూడిదతో ఆడే హోలీని అక్కడ మాసాన్ హోలీ అని పిలుస్తారు. కాశీ విశ్వనాథుడి భక్తులు ఆ చితాభస్మాన్ని ఒంటికి పూసుకుని హోలీ రోజున ఎంతో ఉత్సాహంగా నృత్యం చేస్తారు. హర హర మహాదేవ నినాదాలను చేస్తారు.
స్మశాన వాటిక నుంచి తెచ్చిన బూడిదను రాసుకోవడం అనేది ఒక సంప్రదాయమే కాదు, శివుని అతీంద్రీయ శక్తులలో ఒకటనే చెప్పుకుంటారు. ఇలా చేయడం వల్ల మరణ భయం మాయమైపోతుందని, ఆత్మ మోక్షం వైపు కదులుతుందని అంటారు. చితి బూడిదతో హోలీ నిర్వహించుకోవడం అనేది జనన మరణ చక్రాన్ని అంగీకరించడమేనని కూడా అంటారు.
Also Read: హోలీ రోజు వేసే అగ్నిలో ఈ వస్తువులను వేయకండి, దురదృష్టం వెంటాడుతుంది
మాసాన్ హోలీ సమయంలో ఒకపక్క మంత్రాలు, ఢమరుక శబ్దాలు, శంఖా నినాదాలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ హోలీ శివుని తాంత్రిక, అఘోర సంప్రదాయానికి ప్రత్యక్ష ఉదాహరణలా చెప్పుకుంటారు. ఇది కేవలం ఒక పండుగ కాదు. ఆధ్యాత్మిక ప్రయాణం. ఇది ఒక వ్యక్తికి మరణ భయాన్ని వదిలి జీవితాన్ని సంతోషంగా గడపాలన్న సందేశాన్ని ఇస్తుంది.