వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి అనేవి ప్రతి ఏడాది హిందువులు జరుపుకునే అతి పెద్ద పండగల్లో ఒకటి. వినాయకుడి జన్మదినోత్సవం సందర్భంగా ఈ గణేష్ చతుర్ధిని నిర్వహించుకుంటాము. వినాయకుడిని సిద్ధి వినాయకుడు, గజాననుడు, ఏకదంతుడు.. ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టాన్ని అందించే దేవుడిగా వినాయకుడిని చెప్పుకుంటారు. అలాగే అడ్డంకులు తొలగించే దేవుడిగా గణేషుడిని పూజిస్తారు. కొత్త పనులు ప్రారంభించేటప్పుడు వ్యాపారాల్లో విజయం సాధించేందుకు వినాయకుడిని మొక్కుకుంటారు.
వినాయక పండుగ 10 రోజుల పాటు వైభవంగా జరిగేది. మనదేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ఈ పండుగ వైభవంగా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది హిందువులు ఈ పండుగను భక్తితో నిర్వహించుకుంటారు.
వినాయక చవితి ఎప్పుడు?
2025లో వినాయకుడి పండుగ ఎప్పుడు వస్తుందో తెలుసుకోండి. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలోనే గణేష్ చతుర్థి వస్తుంది. హిందూ నెల అయినా భాద్రపద మాసంలో నాలుగవ రోజు ఈ వినాయక చవితి మొదలవుతుంది. అంటే 2025లో ఆగస్టు 27 బుధవారం ఈసారి వినాయక చవితి వచ్చింది. ఇక గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 6 శనివారం చేయాల్సి ఉంటుంది.
పంచాంగం ప్రకారం ఆగస్టు 26 మధ్యాహ్నం 1:54 నిమిషాలకు చతుర్ధి తిధి ప్రారంభం అవుతుంది. మరుసటి రోజు అంటే ఆగస్టు 27, 2025 సాయంత్రం 3:44 నిమిషాల వరకు ఈ తిధి ఉంటుంది. మనం సూర్యోదయం సమయాన్ని పరిగణలోకి తీసుకుంటాము, కాబట్టి ఆగస్టు 27నే వినాయక చవితిని నిర్వహించుకోవాలి.
ఛత్రపతి శివాజీ చేసిన పండుగ
మన దేశంలో నిర్వహించుకునే ముఖ్యమైన పండగల్లో గణేష్ చతుర్థి ఒకటి. 17వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యంలోనూ ఈ గణేష్ చతుర్ధిని నిర్వహించుకున్నారని చెప్పుకుంటారు. చత్రపతి శివాజీ జాతీయత, ఐక్యతను ప్రోత్సహించడానికి వినాయక చవితిని ప్రజలందరూ కలిసి చేసుకునేలా మొదలు పెట్టాడని చెప్పుకుంటారు.
ఆ తరువాత బ్రిటిష్ వారు మన దేశాన్ని ఏలుతున్న కాలంలో స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ ప్రజలను ఏకం చేయడానికి స్వాతంత్రోద్యమ కాంక్షను ప్రేరేపించడానికి వినాయక చవితిని ఉపయోగించుకున్నాడని అంటారు. సామాజికంగా ప్రజలందరూ ఒకే చోట వినాయక చవితిని నిర్వహించుకునేలా తిలక్ చేసాడని ఆ సమయంలోనే స్వాతంత్రోద్యమం గురించి వివరించేవాడని అంటారు.
హిందూ పురాణాల ప్రకారం చూస్తే పార్వతీదేవి తన శరీరానికి రాసుకున్న నలుగు పిండితోనే గణేశుడుని సృష్టించి అతనికి ప్రాణం పోసిందని చెబుతారు. ఈ పండుగ సరిహద్దులు దాటి కులమతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలను ఒకచోటకు చేర్చింది. చాలా చోట్ల వినాయక చవితికి ఎంతోమంది ముస్లిం సోదరులు కూడా వచ్చి వేడుకల్లో పాల్గొంటారు.
వినాయక చవితి రోజు ఓం గణగణపతయే నమః అనే మంత్రోచ్ఛారణ ఎంతో అద్భుతంగా వినిపిస్తుంది. గణేశుడు విగ్రహాన్ని ఎత్తైన వేదికపై ఉంచి అతనికి ఇష్టమైన నైవేద్యాలను పెట్టి వీధిలోని ప్రజలంతా ఒకచోట కూర్చుని నిర్వహించే అద్భుతమైన పండుగ గణేష్ చతుర్థి.