CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ బెంగళూరుకు వెళ్లనున్నారు. ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఖర్గే శ్వాస సంబంధిత సమస్యలు, జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. గుండె వేగం సడన్‌గా తగ్గిపోవడం నేపథ్యంలో వైద్యులు ఆయనకు.. పేస్‌మేకర్ ఇంప్లాంట్ సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని సమాచారం.
ఇలాంటి సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఖర్గేను పరామర్శించేందుకు బెంగళూరుకు బయలుదేరుతున్నారు. ఆయన ఆరోగ్యం గురించి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకోవడంతో పాటు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కూడా కీలక చర్చ జరగనుంది.
రేవంత్ పర్యటనకు సంబంధించి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ వ్యూహకర్తలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖర్గే నివాసంలో కానీ.. ఆస్పత్రిలో ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం.
బీసీ రిజర్వేషన్ల అంశం కేంద్ర బిందువుగా
రాష్ట్రంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం ఖర్గే – రేవంత్ భేటీ ప్రధాన ఎజెండాగా మారనుంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఈ రిజర్వేషన్ వ్యవస్థను అమలు చేస్తూ జారీ చేసిన జీఓపై సుప్రీం కోర్టు విచారణ కొనసాగుతోంది. ఈ పరిణామాలపై రేవంత్ రెడ్డి, ఖర్గేకు పూర్తి వివరాలు అందజేయనున్నారు.
కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల పట్ల కట్టుబడి ఉందని, ఈ అంశాన్ని కోర్టు ముందు బలంగా వాదించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ ఖర్గేకు నివేదిక ఇవ్వనున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక
ఇటీవల ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నికను పార్టీ ప్రాధాన్యతగా తీసుకుంది. ఈ నేపథ్యంలో, అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచార వ్యూహం వరకు అన్ని విషయాలపై రేవంత్ – ఖర్గే భేటీ కీలకంగా నిలవనుంది.
కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పూర్తి సహకారం పొందేందుకు రేవంత్ ప్రయత్నించనున్నారు. అదే సమయంలో, ఉపఎన్నికలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా రేవంత్ ప్రణాళికలు ఖర్గేకు వివరించనున్నారు.
Also Read: స్థానిక సంస్థల ఎన్నికలు.. కేసీఆర్ ప్లాన్‌తో బీఆర్‌ఎస్ నేతల్లో టెన్షన్.. ?
రేవంత్ పర్యటనతో కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంటోంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్టీ స్పష్టమైన దిశ నిర్దేశం ఇవ్వగలదని నాయకులు భావిస్తున్నారు.