ముల్లోకాల్లో ఉన్న దేవుళ్ళలో మన కంటితో చూడగలిగేది సూర్యుడిని మాత్రమే. అందుకే సూర్యుడిని ప్రత్యక్ష దైవం అని పిలుస్తారు. సూర్య ఆరాధనకు రథసప్తమి ప్రత్యేకంగా పూజ చేస్తారు. ప్రతి ఏటా మాఘమాసంలో శుద్ధ సప్తమిని రథసప్తమిగా నిర్వహించుకుంటాం. ఇదే రోజు సూర్య భగవానుడు జన్మించాడని అంటారు. రథసప్తమి రోజు మీరు సూర్య భగవానుని పూజించడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందవచ్చు.
సూర్య భగవానుడు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు భూమిపై ఉన్న జీవరాశులను కాపాడే వాడు సూర్యుడే. సూర్యుడే ఎండని ఇవ్వకపోతే పంటలు పండక ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల బారినపడి జీవరాశి అంతరించిపోయేది. సూర్య భగవానుడు కారణంగానే మనకు పంటలు పండుతున్నాయి. అందుకే సూర్యుడిని దైవంగా పూజిస్తాము.
ఏడు గుర్రాలతో కూడిన రథంపై సూర్యుడు మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. రానున్న ఆరు నెలలు ఉత్తరాయణ పుణ్యకాలంగానే చెప్పుకుంటారు. రథసప్తమి ఈ రోజే… అంటే ఫిబ్రవరి 4న ఉదయం 7:53 నుంచి మరుసటి రోజు ఉదయం 5:30 వరకు ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 4వ తేదీనే రథ సప్తమిగా జరుపుకోవాలని పెద్దలు చెబుతున్నారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు పూజా సమయం ఉంటుంది. ఆ సమయంలోనే సూర్యుడికి అర్ఘ్యం అందించి నైవేద్యాన్ని సమర్పించి పూజ చేసుకోవాలి.
రథసప్తమి రోజు మీకు కష్టాలు పోయి సుఖ సౌకర్యాలు పొందాలంటే కొన్ని రకాల దానాలు చేయాలి. బ్రాహ్మణులకు గొడుగు, జలపాత్ర, చెప్పులు, మంచినీరు, నూతన వస్త్రాలు వంటివి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ సూర్య భగవానుడి ఆశీస్సులతో మీకు ఆరోగ్యంతో పాటు ఆయుష్షు ఐశ్వర్యాలు లభిస్తాయి.
రథసప్తమి రోజు సూర్యుడికి ప్రత్యేకంగా పరమాన్నాన్ని వండాలి. వాటిని చిక్కుడు ఆకులలో వేసి సూర్యుడికి నివేదించాలి. అలాగే అరటి పండ్లు, కొబ్బరికాయను సమర్పించాలి. మంగళ హారతి పట్టాలి. సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఒక రాగి పాత్రలోనే నీటిని తీసుకోవాలి. అందులో తులసి ఆకులను వేయాలి. ఎరుపు రంగు పువ్వులను వేసి ఆ నీటిని ధారగా కిందకి వంపుతూ ఆ సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించాలి. 12 సార్లు సూర్య నమస్కారం చేయాలి. ధూపదీప దర్శనాలు చేయించి సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలి. సూర్యుడు ప్రసన్నం చెందితే అష్టైశ్వర్యాలు మీకే చెందుతాయి. కాబట్టి రథసప్తమిని వైభవంగా మనస్ఫూర్తిగా చేసేందుకు ప్రయత్నించండి.