Ugadi Panchangam: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో పన్నెండు రాశుల వారికి ఆదాయ, వ్యయాలు, అవమానాలు, రాజపూజ్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశి జాతకులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉండనుంది. ఈ ఉగాది నుంచి ఏలినాటి శని వచ్చినప్పటికీ విశ్వావసు సంవత్సరంలో శుభాశుభ మిశ్రమ ఫలితములు వచ్చును. ఈ రాశి జాతకులకు ఈ సంవత్సరం ఆదాయం- 2, ఖర్చు -14 ఉండనుంది. ఇక అవమానం-7 ఉండగా.. రాజపూజ్యం -5 ఉంది. దీంతో ఈ సంవత్సరం మేష రాశి జాతకులు ఎక్కువ ప్రయత్నం చూసినచో భూ, గృహ నిర్మాణాలు పూర్తి కాగలవు. విద్యా, ఉద్యోగ విషయముల యందు అసంతృప్తి కలుగును. శతృపీడ తగ్గును. ధనవృద్ధి పెరుగును. భర్త/భార్య/సంతానముతో మాట పట్టింపులు కలుగును. దూరదేశ ప్రయాణములు తీర్ధయాత్రలు చేయుదురు. ఆర్థిక పరిస్థితి బాగున్నా.. అనవసర ఖర్చులు పెరుగుతాయి.
వృషభరాశి: ఈ రాశి జాతకులకు ఈ సంవత్సరం శుభ ఫలితలు ఎక్కువగా ఉన్నాయి. చేపట్టిన అన్ని పనులలో విజయం చేకూరుతుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృషభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, ఖర్చు 5 గానూ.. రాజపూజ్యం 1 అవమానం 3 గా ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. శతృపీడ, రుణ పీడలు తొలగిపోతాయి. రాజకీయ నాయకులకు నూతన పదవీ యోగం కలుగుతుంది. బంధు మిత్రులలో కీర్తి, గౌరవం పెరుగుతుంది. సంతానాభివృద్ది, ధనలాభం, అన్ని పనులలో విజయం చేకూరుతుంది. అయితే సంవత్సరం చివరలో కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. కొన్ని విషయాలలో రాజీ పడవలసి వస్తుంది.
మిథున రాశి: ఈ రాశి జాతకులు ఈ సంవత్సరం అధిక ధన వ్యయం చేయాల్సి వస్తుంది. మనోధైర్యము తగ్గి ప్రతి చిన్న విషయాలకు భయపడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సమస్యలు ఎదుర్కొంటారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, ఖర్చు 2 గానూ.. రాజపూజ్యం 4, అవమానం 3 గానూ ఉన్నాయి. ప్రభుత్వ పరమైన అనుమతులు సమయానికి రాకపోవడంతో నష్టాలు చవిచూడాల్సి రావొచ్చు. పోలీసు కేసులు, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంవత్సరం మధ్యలో కొంత రిలీప్ దొరుకుతుంది. బంధు మిత్రుల సహాయం చేత కొన్ని పనులు చేస్తారు. సంవత్సరం చివరలో ఆదాయం తగ్గిపోయి రుణ బాధలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి.
కర్కాటక రాశి: ఈ రాశి జాతకులకు ఈ సంవత్సరం అన్ని పనులలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. ధన వ్యయం అపరిమితంగా చేస్తారు. అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, ఖర్చు 2 గానూ.. రాజపూజ్యం 7, అవమానం 3 గానూ ఉన్నాయి. సంవత్సరం మొదటి దశలో అధిక ధనలాభం, కీర్తి, రాజయోగం నూతన పదవీ యోగం ఉన్నాయి. సంవత్సరం మధ్యలో మనోవ్యధ, అనాలోచిత నిర్ణయాలతో అవమానాలు ఎదుర్కోంటారు. పదవీచ్యుతులు అయ్యే అవకాశం ఉంది. సంవత్సరం చివరలో అనారోగ్య సమస్యలు పీడిస్తాయి. నమ్మిన వారి వలన మోస పోయేదరు. అనవసర ధన వ్యయం ఇంట్లో గొడవలు జరగడంతో మనశాంతి కరువవుతుంది.
సింహ రాశి: ఈ రాశి జాతకులు ఈ సంవత్సరం ఆదాయ, వ్యయాలు ( 11) సమానంగా ఉన్నాయి. ఇక రాజపూజ్యం 3, అవమానం 6 గానూ ఉన్నాయి. ఈ రాశి వారికి సంవత్సరం మొదటలో కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అనారోగ్యం బాధిస్తుంది. అనవసర ఖర్చులు చేయవలసి వస్తుంది. తర్వాత సమస్యలు ఓ కొలిక్కి వచ్చి ధనలాభం, కీర్తి పెరుగును. ఇక సంవత్సరం మధ్యలో అధిక ధన వ్యయం చేయాల్సి వస్తుంది. అప్పులు పెరిగిపోవడంతో స్థిరాస్తులు కరిగిపోతాయి. కీర్తి, ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది. సంవత్సరం చివరలో తిరిగి అన్ని విధాలా పుంజుకుని మెరుగుపడతారు. అన్ని సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ధనధాన్య వృద్ది కలుగుతుంది.
కన్య రాశి: ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, ఖర్చు 2 గానూ.. రాజపూజ్యం 6, అవమానం 6 గానూ ఉన్నాయి. విశ్వావసు నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సంవత్సరం మొదట్లో అన్ని పనులలో విజయం చేకూరుతుంది. అప్రయత్న కార్యసిద్ది, ధనలాభం కలుగును. బంధు మిత్రుల రాక చేత ఇంట్లో ఆనందంగా గడుపుతారు. సంవత్సరం మధ్యలో కొంత వ్యతిరేక పరిస్థితులు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట సమస్యలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో వ్యతిరేక పరిస్థితులు ఏర్పడును. సంవత్సరం చివరలో కొంత ఊరట లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు పుంజుకుంటాయి. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు
తులా రాశి: ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం5, రాజపూజ్యం 2, అవమానం 2 గానూ ఉన్నాయి. ఈ సంవత్సంర మొదటి దశలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మానసిక శాంతి నశిస్తుంది. విపరీతమైన ధన వ్యయం చేస్తారు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంవత్సరం మధ్యలో అన్నింట్లో విజయం కలుగుతుంది. అనుకున్న వెంటనే పనులన్నీ పూర్తి చేస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. ఆదాయం బాగుంటుంది. అప్పులు తీరిపోతాయి. సంవత్సరం చివరలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 4, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2 గా ఉన్నాయి. సంవత్సరం మొదట్లో ఈ రాశి వారికి అన్నింట్లో శుభ ఫలితాలు కలుగుతాయి. అత్యంత భోగాలు అనుభవిస్తారు. అధిక ధన వ్యయం చేస్తారు. సంవత్సరం మధ్యలో హఠాత్తుగా పరిస్థితులు మారిపోయి అన్ని విషయాలలో అపజయం ఎదురవుతుంది. రోగ భయం పెరుగుతుంది. మనోధైర్యం కోల్పోతారు. బంధు, మిత్రులతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో వ్యతిరేకత చవిచూస్తారు. ఇక సంవత్సరం చివరలో కొంత ఊరట కలుగుతుంది. బంధు మిత్రులు సహకరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది.
ధనస్సురాశి: ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5 గా ఉన్నాయి. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారు అధిక ధన వ్యయం చేస్తారు. శక్తికి మించిన అప్పులు చేస్తారు. బంధు మిత్రులతో గొడవలు అవుతాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. భార్యా, భర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. ఇక సంవత్సరం చివరలో అన్నింటా విజయం చేకూరుతుంది. ధన లాభం, రాజ దర్శనం అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు. శతృ నాశనం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో గుర్తింపు లభిస్తుంది.
మకరరాశి: ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ్యం 4, అవమానం5గా ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి సంవత్సరం మొదట్లో సకల కార్యములలో విజయం చేకూరుతుంది. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, చేయు వృత్తి, వ్యాపార ఉద్యోగాలలో కనీవినీ ఎరుగని అభివృద్ది కలుగుతుంది. ఇక సంవత్సరం మధ్యలో అధికంగా ఖర్చులు పెరిగిపోతాయి. భార్యా, భర్తల మధ్య గొడవలు జరుగుతాయి. విలువైన వస్తువులు పొగొట్టుకుంటారు. పోలీసు, కోర్టు కేసులలో వ్యతిరేక తీర్పులు వస్తాయి. ఇక సంవత్సరాంతంలో అన్ని పనులలో విజయం సాధిస్తారు. భార్య, భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పోగొట్టుకున్న ఆస్తులు తిరిగి సంపాదిస్తారు.
కుంభరాశి: ఈ రాశి జాతకులు ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొదట్లో ఆశాంతితో మానసిక అస్థిరత్వము కలిగి ఆందోళన చెందుతారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. సంవత్సరం మధ్యలో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శతృవులు తోక ముడుస్తారు. ఇక సంవత్సరం చివరలో అధిక ధన వ్యయం చేస్తారు. కొత్త అప్పులు చేస్తారు. అనవసర ప్రయాణముల వల్ల ధన నష్టములు కలుగును.
మీనరాశి: ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం5, రాజపూజ్యం 1, అవమానం5గా ఉన్నాయి. ఈ సంవత్సరం మీన రాశి వారికి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఏలినాటి శని ప్రభావం చేత అష్టకష్టాలు పడే అవకాశం ఉంది. సంవత్సరం ప్రారంభంలో కొన్ని మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కొన్నిపనులు ఆలస్యంగా నెరవేరును. సంవత్సరం మధ్యలో కొంత ఊరట కలుగును. కొత్త స్నేహితుల పరిచయంతో కొన్ని పనులు నెరవేరతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో సానుకూల ధోరణి ఏర్పడును.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్