Sri Rama Navami: శ్రీరామనవమి ప్రత్యేకతలు ఏంటో తెలుసా..? నవమి రోజే రాముడు పుట్టడంలో అంతర్యం ఏంటో తెలుసా..? అసలు దేశంలో ఏ ఏ ప్రాంతంలో శ్రీరామనవమి ఏ విధంగా జరుపుకుంటారో తెలుసా..?
శ్రీరామనవమి హిందూ పండుగలలో అత్యంత ముఖ్యమైనది. చైత్ర మాస శుద్ధ నవమి నాడు శ్రీరాముడు జన్మించిన సందర్భంగా ఈ వేడుకను దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ పండుగను జరుపుకునే విధానాల్లో కొన్ని ఆసక్తికరమైన వైవిధ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రా్ల్లో శ్రీరామనవమిని కన్నుల పండుగలా జరుపుకుంటారు. ఇక భద్రాచలంలో జరిగే రామనవమి వేడుకలు ప్రతి సంవత్సరం నభూతో న భవిష్యతి అన్న రీతిలో ఉంటాయి.
భద్రాచలం (తెలంగాణ) – సీతారాముల కళ్యాణం: రెండు తెలుగు రాష్ట్రాలకు భద్రాచలం శ్రీరామనవమికి ప్రధాన కేంద్రం. ఇక్కడ నవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. భద్రాచలంలో భక్తరామదాసు( కంచర్ల గోపన్న) నిర్మించిన ఈ ఆలయంలో కళ్యాణాన్ని చూడటం భక్తులు తమ అదృష్టంగా భావిస్తారు.
అయోధ్య రామ జన్మస్థలం(ఉత్తరప్రదేశ్): రాముడి జన్మస్థలమైన అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు అద్బుతంగా జరుగుతాయి. వేడుకల గురించి వివరించడం వర్ణనాతీతం అని చెప్పవచ్చు. అయోద్యలోని కనక భవన్ ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, భజనలు జరుగుతాయి. భక్తులు పవిత్ర సరయూ నదిలో స్నానాలు ఆచరిస్తారు. రామనవమిని పురష్కరించుకుని రామజన్మభూమి ఆలయం నుండి భారీ రథయాత్రలు నిర్వహిస్తారు. కొత్తగా నిర్మించిన రామమందిరం వల్ల ఇప్పుడు ఈ వేడుకలు మరింత ప్రత్యేకంగా మారుతున్నాయి.
రామేశ్వరం (తమిళనాడు): దక్షిణ భారతాన రామేశ్వరంలో కూడా రామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. రాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతాయి కాబట్టి, ఇక్కడ వైష్ణవ, శైవ సంప్రదాయాల కలయిక కనిపిస్తుంది. భక్తులు సముద్ర స్నానాలు చేసి స్వామిని దర్శించుకుంటారు.
ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్: తూర్పు భారత దేశంలో శ్రీరామనవమిని చైత్ర నవరాత్రి ముగింపుగా జరుపుకుంటారు. జగన్నాథుని ఆలయంలో (పూరీ) రాముడిని విష్ణువు అవతారంగా పూజిస్తూ ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు.
పానకం మరియు వడపప్పు(దక్షిణాది స్పెషల్): రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి అనగానే గుర్తొచ్చేవి పానకం, వడపప్పు బెల్లం, మిరియాల పొడి, యాలకులతో చేసే ఈ పానీయం వేసవి తాపాన్ని తగ్గించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదట. ఇక నానబెట్టిన పెసరపప్పును ప్రసాదంగా స్వీకరిస్తారు. దీన్నే వడపప్పు అంటారు. పెసరపప్పు మనిషికి చలువ చేస్తుందని చెప్తుంటారు.
శ్రీరామనవమి విశిష్టత: చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఉగాది నుండి మొదలయ్యే తొమ్మిది రోజుల ఉత్సవాలు (నవరాత్రులు) నవమి రోజున పట్టాభిషేకంతో ముగుస్తాయి. రాముడు ఒక రాజుగా, కొడుకుగా, భర్తగా ఎలా ఉండాలో లోకానికి చాటిన మర్యాద పురుషోత్తముడుగా చరిత్రలో నిలిచిపోయాడు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.