
Hanuman Jayanti : తిరుమలలో వచ్చే నెల 14 నుంచి 18వ వరకు ఐదు రోజుల పాటు హనుమాన్ జయంతి ఉత్సవాలు టీటీడీ ఘనంగా నిర్వహించనుంది . తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఆకాశ గంగ వద్ద ఐదు రోజుల పాటు శ్రీ హనుమంతుని జన్మ విశేషాలు, ఆధ్యాత్మిక పరంగానే కాకుండా వైజ్ఞానిక కోణంలో కూడా ప్రముఖ పండితులతో ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల వేద విజ్ఞాన పీఠంలో అఖండ పారాయణంతో పాటు, యాగం నిర్వహించేందుకు పండితులకి ఆహ్వానించాలని టీటీడీ నిర్ణయించింది .
ధర్మగిరితో పాటు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత వర్సిటీ, ఎస్వీ ఉన్నత వేద అధ్యయనాల్లోని వేదపండితులు పాల్గొనాలని కోరారు. మే పదహారు ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు దాదాపు పద్దెనిమిది గంటలు నిరంతరాయంగా అఖండ పారాయణం నిర్వహించబోతోంది. సుందరకాండలోని మొత్తం 2872 శ్లోకాలను వేద పండితుల సామూహికంగా పటిస్తారు.భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా తిరుమలలోని ఆకాశ గంగ, అంజనాద్రి, నాద నీరాజనం వేదికలపై అన్నమాచార్య, దాససాహిత్య, హెచ్‌డీపీపీ ప్రాజెక్టు కళాకారులతో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను టీటీడీ ఆదేశించింది.
హనుమంతుడి జన్మస్థలంగా అంజనాద్రి పర్వతాన్ని నిర్ధారిస్తూ రెండేళ్ల క్రితం టీటీడీ ప్రకటించింది. దీనిపై పెద్ద వివాదమే జరిగింది. కర్ణాటక స్వాములు కొందరు టీటీడీ నిర్ణయాన్ని సవాల్ చేశారు. చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారికి టీటీడీ అదే స్థాయిలో బదులిచ్చింది అప్పటి నుంచి తిరుపతిలో హనుమాన్ జయంతి ఉత్సవాల విషయంలో టీటీడీ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఘనంగా వేడుకలను నిర్వహించడం మొదలుపెట్టింది.