E-Paper
Advertisement

Tirumala Srivari Vratham: తిరుమల శ్రీవారి ఏడు శనివారాల వ్రతం ఏయే రోజుల్లో ప్రారంభించాలో తెలుసా..?

Tirumala Srivari Vratham: తిరుమల శ్రీవారి ఏడు శనివారాల వ్రతం ఏయే రోజుల్లో ప్రారంభించాలో తెలుసా..?

Tirumala Srivari Vratham: తిరుమల శ్రీవారికి ఏడు శనివారాల వ్రతం ఎలా చేస్తారో తెలుసా..? ఎప్పుడు ప్రారంభిస్తారో తెలుసా..? ఎలా ప్రారంభించాలో తెలుసా..? అసలు ఏడు శని వారాల వ్రతం ఎందుకు చేయాలో తెలుసా..? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కలియుగవైకుంఠం తిరుమల శ్రీనివాసుడిని భక్తవల్లభుడిగా భక్తుల పాలిట కొంగుబంగారంగా పిలుస్తుంటారు. ఆపదమొక్కుల వాడిగా ఆయన ఎన్నో కోట్ల మంది భక్తులను కాపాడుతుంటాడు. అలాంటి శ్రీనివాసుని ఏడు శనివారాల వ్రతం ఎంతో విశిష్టత సొంతం చేసుకుంది. ఇప్పటికే ఎన్నో కోట్ల కుటుంబాలను గట్టెక్కించిన సప్త శనివార వ్రతం ఇంట్లో సింపుల్‌గా చేసుకోవచ్చు!

ఏడు శనివారాల వ్రతం ఏయే రోజుల్లో ప్రారంభించాలి:

ముఖ్యంగా వారం శనివారమై ఉండాలి, శనివారం ఏకాదశి అయితే మంచిది, శనివారం త్రయోదశి అయితే ఇంకా మంచిది, శనివారం పౌర్ణమి అయితే చాలా చాలా మంచిది. శనివారం మాస శివరాత్రి అయితే ఇంకా చాలా మంచిది. శనివారం పుష్యమి నక్షత్రం అయితే ఎంతో మంచిది. శనివారం అనురాధా నక్షత్రం అయితే ఇంకా అమోఘం. శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రం అయితే చెప్పాల్సిన అవసరమే లేదట. శనివారం అమావాస్య తిధి అయితే ఇక వేరే మాటే ఉండదట. శనివారం శ్రవణా నక్షత్రం అయితే మరీ మంచిదట.

ఏడు శనివారాల వ్రతం ఎవరు ఆచరించాలి:

ఏలినాటి శని జరుగుతున్న వారు (గోచారారీత్యా), అర్థాష్టమ శని జరుగుతున్న వారు (గోచారారీత్యా), అష్టమ శని జరుగుతున్న వారు (గోచారారీత్యా), శని మహర్ధశ జరుగుతున్న వారు (జాతకరీత్యా), శని అంతర్దశ జరుగుతున్న వారు (జాతకరీత్యా), జాతకరీత్యా లగ్నా అష్టమ శని ఉన్నచో ఈ వ్రతం చేయడం చాలా మంచిది. ఇక  పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఆచరిస్తే మంచిది. ఎక్కువ కాలికి దెబ్బలు తగిలినట్లయితే ఈ వ్రతం ఆచరించినచో మంచిది.

పాటించాల్సిన నియమాలు:

ఏ వయస్సు వారైనా స్త్రీలు, పురుషులు ఈ వ్రతం ఆచరించవచ్చు. మగవారు ఈ ఏడు శనివారాలు హెయిర్‌ కట్‌, గోళ్లు కత్తిరించుకోవడం చేయకూడదు. శనివారం తెల్లవారక ముందే తల స్నానం చేయాలి. 7 శని వారాలు తులసి మాల ధరించాలి. పగలు నిద్రపోవడం, మధ్యాహ్నం భోజనం చేయడం చేయకూడదు. శనివారం తిరునామం నుదుటి మీద తప్పక ఉండాలి. శనివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపు ఉదయం పూజ ప్రారంభించాలి. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల లోపు సాయంత్ర వ్రతం ప్రారంభించాలి. ఉదయం పూజకు స్వామివారికి చిమ్మిలి (నవ్వులతో) ఉండలు చేసి నైవేద్యంగా సమర్పించాలి.

సాయంత్రం వ్రతం వేళ స్వామివారికి శనగ పిండితో చేసిన లడ్డూలు 7 నైవేద్యముగా సమర్పించాలి. మగవారు 7 శనివారాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆచరించాలి. అదే స్త్రీలు అయితే ముఖ్యంగా 3 వారాలు ఆటంకాలు లేకుండా ఆచరించాలి. ఏ శనివారం అయినా వ్రతం ప్రారంభిచవచ్చు. అయితే ఉదయం నిరాహారముగా ఉండాలి. స్త్రీలకు ఆటంకం కలిగినచో ఆ వారం మినహాయించి తదుపరి వారం కొనసాగించవచ్చు. సాయంత్రం వ్రతం కాగానే ఒక అతిథిని పిలిచి అరటిఆకు లేదా విస్తారాకులో భోజనం పెట్టాలి. ఏడు శనివారాలు ఇంట్లో వ్రతం చేసిన తర్వాత 7 వ్రత పుస్తకములు ఏడు మంది స్త్రీలకు పసుపు కుంకుమ, దక్షిణతో తాంబూలంలో ఉంచి దానంగా ఇవ్వాలి.

సప్త శనివార వ్రతం పూజ విధానం:

శ్రీ వేంకటేశ్వర స్వామి ఫోటో లక్ష్మీదేవి ఫొటో ఖచ్చితముగా ఉండాలి. ఇంటిలో తూర్పు వైపు ఈశాన్య దిశలో పీట వేసి పసుపు రాసి ముగ్గులు వేసి పసుపు రంగు కండువా పీఠపై పరచి దాని మీద బియ్యం పోయాలి. బియ్యంపై రాగిచెంబు ఉంచి కొబ్బరి కాయను పెట్టి దానికి పసుపు రంగు రవిక గుడ్డను కిరీటంలా పెట్టి కలశ స్థాపన చేయాలి. కలశమునకు రెండూ వైపుల 2 దీపాలు 7 వత్తులతో చేయాలి. ఆ తర్వాత అగరబత్తి కడ్డీలు వెలిగించి సాంబ్రాణి ధూపంగా వేయాలి. ఇప్పుడ పిండి పదార్థాలను, లడ్డులు, పూలు, పండ్లు, చిమ్మిరి ఉండలు నైవేద్యముగా సమర్పించాలి.

పూజ పూర్తయ్యాక:

పూజలో వేంకటేశ్వర స్వామి మంత్రాలు, గోవిందనామాలు, అష్టోత్తర శతనామావళి, సుప్రభాతం వంటి వాటిని పఠించాలి. పూజ అనంతరం 7 శనివారాలు ఏడు మంది అతిథులను 7 కొండలు (సప్తగిరులు – అంజనాద్రి, వృషభాద్రి, శేషాద్రి, నారాయణాద్రి, గరుడాద్రి, నీలాద్రి, వేంకటాద్రి)గా భావించి భోజనముకు ఆహ్వానించాలి. ఇలా 7 శనివారాలు పూర్తయిన తర్వాత తిరుమలకు గానీ, చిన్న తిరుపతి (ద్వారకాతిరుమల) లేదా మీ దగ్గరలోని వేంకటేశ్వరస్వామి  గుడికి కానీ వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలి. పూజ సమయంలో కట్టిన ముడుపును జాగ్రత్తగా దాచి హుండీలో వేయాలి. అలాగే ఆలయ దర్శనం సమయంలో మూడు కత్తెరలు గానీ, తలనీలాలు పూర్తిగా గానీ సమర్పించడం శుభప్రదం.

పూజ రోజు ఉదయం ప్రధానంగా చేయాల్సినవి:

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, శ్రీ వేంకటేశ్వర సోత్రమ్, మంగళశాసనమ్ పారాయణం చేయాలి. శ్రీనివాస దండకం చదవాలి. గోవింద నామాలు పారాయణ చేయాలి. బ్రహ్మండ పురాణంలోని శ్రీ వేంకటేశ్వర స్తోత్రము, వేంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణ చేయాలి. చివరగా శ్రీనివాస మంగళశాసనం చదువుతూ దీపారాదన హారతి ఇవ్వాలి. ఆ తర్వాత శని ధ్యాన శ్లోకము 19 సార్లు, శని స్త్రోత్రము ఒకసారి, శని సప్తనామావళి 7 సార్లు పారాయణం చేయాలి.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: కొత్తగా పెళ్లి చేసుకుంటున్నారా..? తిరుమల శ్రీవారి కానుకల గురించి తెలుసా..?

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×