Kartika Purnima 2024: హిందూ పూరాణాల ప్రకారం కార్తీక మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో ప్రతీ రోజు ప్రముఖమైనదే. ఈ నెలలో చేసే పూజలు, వ్రతాలకు గొప్ప ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇదిలా ఉంటే కార్తీక మాసంలో విశిష్టమైన రోజు కార్తీక పౌర్ణమి . కార్తీక పౌర్ణమిని నవంబర్ 15 న జరుపుకోనున్నాము.
కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత:
అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో భక్తులు పరమేశ్వరుడు, శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. అంతే కాకుండా వారి అనుగ్రహం కోసం దేవాలయాలను సందర్శించి దీపాలు కూడా వెలిగిస్తారు. కార్తీక మాసంలో ఉపవాసాలు ఉండి మాంసాహారానికి దూరంగా ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి 365 వత్తులతో దీపం వెలిగిస్తారు. ఇలా చేస్తే దేవతలు సంతోషిస్తారని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 15 వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటల 19 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. మరుసటి రోజు నవంబర్ 16 న శనివారం మధ్యాహ్నం 2 గంటల 58 నిమిషాలకు పూర్తవుతుంది. ఉదయం తిథి ప్రకారం నవంబర్ 15 వ తేదీ శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమిని జరుపుకోనున్నాము.
కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో 365 వత్తులను వెలిగిస్తే.. ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజు దీపాలు చూసిన వారి పాపాలు కూడా పటాపంచలు అవుతాయని చెబుతారు. నదీ తీరాల్లో దీపాలు వెలిగించే వారు అరటి దొప్పల్లో వెలిగించాలని అంటారు. ఇలాంటి అవకాశం లేని వారు తులసి చెట్టు దగ్గర అరటి దొప్పల్లో కూడా దీపం వెలిగించుకోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన చేస్తే..సుఖ సౌఖ్యాలు లభించి జీవితానంతరం ముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు.
ఏడాది కాలంలో ఏ కారణం చేతనైనా దీపాలు వెలిగించని వారు కార్తీక పౌర్ణమి రోజు 365 దీపాలు వెలిగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అందుకే చాలా మంది తప్పనిసరిగా కార్తీక పౌర్ణమి రోజు 365 దీపాలను వెలిగిస్తారు.
Also Read: కార్తీక పౌర్ణమి రోజు తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే !
కార్తీక మాసంలో చాలా మంది ఉసిరి దీపం వెలిగిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజు ఉదయం పూట నీటిలో ఉసిరి కాయలను వేసుకుని తలస్నానం చేసే పుణ్య ఫలం దక్కుతుందని నమ్ముతారు. ఉసిరి చెట్టును ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. అందుకే ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజిస్తారు. అంతే కాకుండా ఉసిరి చెట్టు క్రింద దీపాలను కూడా వెలిగిస్తారు. కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి శివుడిని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరతాయి.