Hanuman Statue: ఆలయాల్లో ఎక్కడ చూసినా హనుమాన్ విగ్రహాలు సింధూరం రంగులోనే ఉంటాయి. అంతేకాకుండా జెండాపై చేతిలో గద, మరో చేతిలో పర్వతాన్ని మోస్తున్న హనుమాన్ ఉంటాడు. ఈ జెండా కూడా ఆరెంజ్ కలర్‌లోనే ఉంటుంది. దాదాపు అన్ని ఆలయాల్లో హనుమాన్ కుంకుమ సింధూరం రంగులోనే ఉంటుంది. హనుమాన్ విగ్రహం అంతే ఆరెంజ్ కలర్‌లోనే ఉంటుంది. అందులో కొత్త విషయం ఏముంది అనుకుంటున్నారా..? అసలు హనుమాన్ విగ్రహం ఆ రంగులోనే ఉంటుందనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా..? పురాణాల్లో దీని వెనుక పెద్ద కథే ఉందట.
రామాయణం ప్రకారం హనుమంతుడి విగ్రహాలు, ఆయన కుంకుమ, జెండాలు సింధూరం రంగులోనే ఉండడం వెనుక కూడా శ్రీరామచంద్రుల వారే ఉన్నారట. ఒక రోజు సీతా దేవి నుదుటిపై ఎర్రటి సింధూరం పెట్టుకుని ఉంటుందట. సీతమ్మ దగ్గరికి వెళ్లిన హనుమంతుడు.. ఆ పొడిని నుదుటిపై ఎందుకు పూసుకున్నావు తల్లీ అని అడుగుతాడు.
రామయ్యకు సింధూరం అంటే చాలా ఇష్టమని సీతమ్మ బదులిస్తుంది. ఎల్లప్పూడూ దీన్ని ధరించడం వల్ల రామయ్య ఆనందపడతారని చెబుతుంది. అంతేకాకుండా శ్రీరాముడికి దీర్ఘాయువును ఇస్తుందని సీతమ్మ చబుతుంది. అందుకే నుదుటిపై సింధూరం ధరిస్తానని అంటుంది. ఇది విన్న హనుమంతుడు అక్కడి నుంచి మాయం అయిపోతాడు. కొంత సమయం తర్వాత ఒంటి నిండా సింధూరం పూసుకుంటాడు. బట్టలు, జుట్టుకు కూడా సింధూరం పూసుకొని రామయ్య దగ్గిరి వెళ్తాడు.
అది చూసిన రామయ్య.. సింధూరాన్ని ఒంటి నిండా ఎందుకు పూసుకున్నావు హనుమా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు సింధూరం అంటే మీకు చాలా ఇష్టమని సీతమ్మ చెప్పిందని హనుమంతుడు రాములవారితో చెప్తాడు. దీన్ని పెట్టుకుంటే మీరు ఆనందిస్తారట.. మీకు సింధూరం దీర్ఘాయువును ప్రసాధికస్తుందట. అందుకే దీన్ని ఒళ్లంతా పూసున్నానని మనుమంతుడు చెబుతాడు. ఒక్క చిటికెడు సింధూరమే మీకు ఆనందాన్ని ఇస్తే ఒళ్లంతా రాసుకుంటే ఇంకా సంతోషంగా ఉంటారు కదా..? అందుకే ఒళ్లంతా సింధూరం పూసుకున్నానని రాములవారితో హనుమంతుడు అన్నాడట.
హనుమంతుడు చెప్పిన దానికి సంతోషించిన రాములవారు ఓ వరం ఇచ్చారట. హనుమంతుడికి సింధూరం పూసి పూజించిన వారికి సంతోషకరమైన జీవితం ఉంటుందని వరం ఇచ్చారట. అంతేకాకుండా కోరికలు త్వరగా నెరవేరతాయని రామయ్య చెప్పాడట. అందుకే అన్ని ఆలయాల్లో హనుమంతుడి విగ్రహాలు, కుంకుమ సింధూరం రంగులోనే ఉంటాయి.