Sankranti 2026: సంక్రాంతి పండగ వచ్చిందంటే మనుషుల చుట్టూ ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంటుంది. పల్లె నుంచి పట్నం వరకూ ఎక్కడ చూసినా పతంగులే కనిపిస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ కలిసి ఎంతో ఆనందంతో పతంగులు ఎగరేస్తున్నారు. ఈ డిమాండ్‌కు తగ్గట్టే మార్కెట్‌లో వెరైటీ గాలిపటాలు అందుబాటులోకి వస్తున్నాయి. దేశంలో అతిపెద్ద పతంగుల మార్కెట్‌లో హైదరాబాద్ ఒకటి. ఈ నేపథ్యంలో పతంగులు అంటే భాగ్యనగర వాసులకు ఎందుకంత క్రేజ్? దీనివెనకున్న ప్రాముఖ్యత ఏమిటి? హైదరాబాద్‌కు పతంగుల పండక్కు ఉన్న సంబంధం ఏంటి.. వంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సంక్రాంతి అంటేనే పతంగుల పండగ. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌లో రంగురంగుల గాలిపటాలు యువతను ఆకట్టుకుంటున్నాయి. నింగికి నిచ్చెన వేసినట్లు గాలిపటాలను ఎగరవేస్తూ.. సంక్రాంతి పండగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు హైదరాబాద్ ప్రజలు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మార్కెట్లో రంగురంగుల గాలిపటాలు సందడి చేస్తున్నాయి. చార్మినార్, ధూల్‌పేట్, బేగంబజార్, లాల్ దర్వాజా ప్రాంతాలు గాలిపటాల అమ్మకాలకు ఆదరణ పొందాయి. నగరంతో పాటు మిగతా జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా పెద్ద మొత్తంలో పతంగులను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.
Also Read: ఈ డౌట్ మీకెప్పుడూ రాలేదా?.. అయ్యప్ప మాలధారులను ‘స్వామి’ అని ఎందుకు పిలుస్తారు?
సంక్రాంతి పండుగ వస్తే హైదరాబాదులో పతంగులకు చాలా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా చైనా మాంజాకు యువతలో మంచి క్రేజ్ ఉంటుంది. అయితే ఈసారి చైనా మాంజాను హైదరాబాద్ మార్కెట్‌లలో బ్యాన్ చేసినట్లు షాపుల నిర్వహకులు చెబుతున్నారు. చైనా మాంజాకు పోటీ ఇచ్చేలా.. కొత్త రకాల గాలిపటాలు అందుబాటులో ఉన్నాయంటూ మార్కెట్ నిర్వహకులు కూడా చెబుతున్నారు. దీనిలో భాగంగా.. యూపీ మాంజా, గుజరాత్ మాంజా ఇలా రకరకాల పతంగులను కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు.
హైదరాబాద్‌లో పతంగులు ఎగరవేసే సంప్రదాయం అనేది నిన్న మొన్నటిది కాదు. దీనికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం పాలన కాలంలోనే గాలిపటాల వేడుకలు నగరంలో ప్రాచుర్యం పొందాయి. అప్పట్లో ఈ ఆట సాధారణ ప్రజల వినోదం మాత్రమే కాదు.. రాజ కుటుంబీకుల ప్రత్యేక హాబీగా కూడా ఉండేది. ప్రత్యేకంగా 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో గాలిపటాల పండుగ అత్యంత వైభవంగా జరిగేదట. విదేశాల నుంచి తెప్పించిన కాగితాలు.. దారాలతో ప్రత్యేకంగా తయారు చేసిన పతంగులు ఆ కాలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి.
సంక్రాంతి వస్తుందంటే మొదట సందడి మొదలయ్యేది కూడా హైదరాబాద్‌లోనే. అంతేకాదు.. నిజాం పాలన కాలంలో కులమాతాలకు అతీతంగా నగరం మొత్తం ఒకేచోట చేరి, ఈ పండగను అంగరంగ వైభవంగా జరుకునేవారట. నేటికీ పాతబస్తీలో అప్పటి నైపుణ్యం, సంప్రదాయాన్ని కొనాసాగిస్తున్నారంటే చూడండి.. ఈ పతంగుల పండక్కి ఎంత ప్రాధాన్యత ఉందో. అలాగే సంక్రాంతి అంటే కుటుంబమంతా ఒకచోట చేరి సంతోషంగా గడిపే మధుర క్షణాలు. గాలిపటాల కోసం అందరూ మేడపైకి రావడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితుల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది.
భాగ్యనగర గాలిపటాల వేడుకలు స్థానికంగా మాత్రమే పరిమితం కావడం లేదు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ‘ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్’ ద్వారా ఈ పండుగకు ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వంటి ప్రదేశాల్లో జరిగే ఈ వేడుకలకు విదేశాల నుంచి కూడా కైట్ ఆర్టిస్టులు, పర్యాటకులు వస్తుంటారు. ఇకపోతే వింత వింత ఆకారాలు, భారీ పరిమాణాల్లోని గాలిపటాలు నింగిలో ఎగురుతుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. ఇది హైదరాబాద్ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే ఒక వేదికగా మారింది.
పల్లెవాసుల నుంచి పట్నం వరకూ అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పతంగుల వేడుకల్లో సంతోషమే కాదు.. తగిన జాగ్రత్తలు తీసుకోవడమూ ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ప్రమాదకరమైన చైనా మాంజా వంటి దారాలను వాడకుండా పూర్తిగా రద్దు చేయడం ఉత్తమం. ఈ మాంజాలు మనుషుల ప్రాణాలనే కాదు.. పర్యావరణానికి తీవ్రహాని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే మేడలపై గాలిపటాలు ఎగురవేసేటప్పుడు అంచుల వద్ద జాగ్రత్తగా ఉండాలి. మన ఆనందం వల్ల మనుషులకు గానీ, మూగజీవాలకు గానీ నష్టం కలగకుండా చూసుకోవాలి.
Also Read: మకర సంక్రాంతికి గాలిపటాలకు ఉన్న అనుబంధం ఏమిటి? దీని వెనుకున్న అసలు కథ ఇదే!