Sankranti Kites Fly: కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టగానే జనవరిలో నెలలో వచ్చే అతి ముఖ్యమైన పండగ సంక్రాంతి. ఈ పేరు వినగానే తెగులు ప్రజల్లో ఓ ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నవాళ్లు చాలా ఆనందంగా ఈ పండగకు వారం రోజుల ముందే ఇంటి ముందు ముగ్గులు, వాకిట్లో గొబ్బెమ్మలు పెట్టడం, రకరకాల పిండి వంటలు చేయడం.. అబ్బో చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అంతేకాదు.. సంక్రాంతి పండగ వస్తోందంటే.. నగరవాసులు అంతా పల్లెబాట పడతారు. దీంతో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడిపోతాయి. అయితే తెలుగు ప్రజల అతిపెద్ద పండగ అయిన సంక్రాంతికి గాలిపటాలు లేకపోతే అసలు పండగ పూర్తయినట్టే అనిపించదు.
మకర సంక్రాంతికి చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ గాలిపటాలను ఎగరవేస్తుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆకాశం వైపు చూస్తూ పతంగులు ఎగరేస్తుంటే ఆ ఆనందమే వేరు. పిల్లలతో కలిసి పెద్దవాళ్లు కూడా తమ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఈ పండగను ఆస్వాదిస్తుంటారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండగకు గాలిపటాలకు ఉన్న సంబంధం ఏమిటని చాలామందికి సందేహం రావొచ్చు. ఆ సంగతేంటో ఇప్పుడీ కథనం ద్వారా తెలుసుకుందాం.
సాధారణంగా సంక్రాంతి పండగ శీతాకాలం ముగింపు దశలో వస్తుంది. పండగ రోజున సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పు మన భారతీయ సంస్కృతిలో చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఉత్తరాయణం ప్రారంభమవడం అంటే.. శుభకాలం మొదలైనట్లు భావిస్తారు. ఎందుకంటే.. సూర్యుడిని దేవుడిగా పూజించే భారతీయ సంప్రదాయంలో ఈ మకర సంక్రాంతి రోజుకు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే.. సూర్యుడికి కృతజ్ఞతలు చెబుతూ.. గాలిపటాలను ఎగరవేస్తారని పండితులు చెబుతారు.
Also Read: ఈ ఆలయానికి వెళ్తే.. వద్దన్నా జుట్టు పెరుగుతుందట, ఎక్కడంటే?
మన పురాణాల ప్రకారం.. దేవతలు 6 నెలలపాటు విశ్రాంతి స్థితిలో ఉంటారని, ఈ ఉత్తరాయణం ప్రారంభమైన రోజున దేవతలు మళ్లీ చైతన్యవంతులు అవుతారని చెబుతారు. అలాంటి సమయంలో పతంగులు ఎగరవేస్తే.. దేవతలను ఆహ్వానించినట్టు అవుతుందని పెద్దలు చెబుతున్నారు. ఇక ఈ సంప్రదాయం తరతరాలుగా నేటికీ కొనసాగుతూనే ఉంది.
మరికొన్ని కథనాల ప్రకారం.. శ్రీరామచంద్రుడు మకర సంక్రాంతి పండగ రోజున తన సోదరులు, హనుమంతుడితో కలిసి గాలిపటం ఎగరేశాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక ఆ సందర్భం నుంచి సంక్రాంతి పండగలో పంతంగులు ఒక భాగంగా మారాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథలు ప్రజల్లో ఈ సంప్రదాయానికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చాయి.
సంక్రాంతి రోజున పతంగులు ఎగరవేయడం అనేది కేవలం ఆనందం, సంప్రదాయం కోసం మాత్రమే కాదు. దీనివల్ల శరీరానికి కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయట. పండగ సమయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తక్కువగా ఉంటుంది. ఈ టైంలో బయట ఉంటే.. శరీరానికి అవసరమైన విటమిన్ డి సహజంగా దొరుకుతుంది. ఇది మన ఎముకల బలానికి ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే గాలిపటం ఎగరేయడం వల్ల చేతులు, భుజాలు, కాళ్లు కదలడంతో శరీరానికి తేలికపాటి వ్యాయామం లభిస్తుంది.
సంక్రాంతి పండగ చరిత్రను పరిశీలిస్తే.. గాలిపటాల ప్రయాణం సుమారు 2వేల ఏళ్ల క్రితమే ఉపయోగంలోకి వచ్చాయని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. మరికొన్ని కథనాల్లో అయితే.. చైనాలో తొలిసారి గాలిపటాలు ఉపయోగించారని చెబుతారు. అయితే భారత్‌లో కూడా ప్రాచీన కాలం నుంచే పతంగులు వినియోగం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు.
సంక్రాంతి తెగులు ప్రజల పండగ అయినప్పటికీ.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో గాలిపటాలను ఎగరవేస్తారు. ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో మకర సంక్రాంతి రోజున ఆకాశమంతా రంగురంగుల పంతంగులతో నిండిపోతుంది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో గాలిపటాల పోటీలు సైతం నిర్వహిస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే నగరాల్లో కంటే.. గ్రామాల్లోనే పండగ సందడి ఎక్కువగా కనిపిస్తుంటుంది.
Also Read: చేత్తో అన్నం తినడంలో ఇంత సైన్స్ ఉందా? అరచేతిలో దాగున్న పంచభూతాల రహస్యం ఇదే!