Lord Venkateswara: తిరుమల శ్రీవారికి నైవేద్యం ఎలా పెడతారో తెలుసా..? ఏ విధంగా సమర్పిస్తారో తెలుసా..? అసలు శ్రీవారికి ఏ రోజు ఎలాంటి నైవేద్యం నివేదిస్తారో తెలుసా..? శ్రీవారికి పెట్టిన నైవేద్యం తర్వాత ఏం చేస్తారో తెలుసా..? ఇలాంటి తిరుమల శ్రీవారి గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
కలియుగ వైకుంఠం తిరుమల గిరిల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఎంత చెప్పుకున్నా ఎంత విన్నా తక్కువే అవుతుంది. కలియుగంలో ఆయన భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లుతున్నారు. పిలిస్తే పలికే దైవంగా ఆపద మొక్కులవాడిగా భక్త వల్లభుడిగా తిరుమల వెంకన్నస్వామిని పిలుచుకుంటారు. ఆలాంటి శ్రీవారికి రోజూ నివేదించే నైవేద్యం పగిలిన మట్టి కుండల్లోనే సమర్పిస్తారట. అయితే ఎందుకు మట్టి కుండల్లోనే సమర్పిస్తారు. ఎందుకు అలా నివేదిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుమల శ్రీనివాసుడు ఎంతటి అలంకార ప్రియుడో అంతటి నైవేద్య ప్రియుడట! ఎంతటి నైవేద్య ప్రియుడో అంతటి భక్త ప్రియుడట! అందుకే తాను ఆరగించినవన్నీ భక్తులు తింటేనే ఆయనకు ఆనందమట. తాను తిన్నవన్నీ భక్తులు తింటేనే ఆయనకు ఒక తృప్తి. అసలు భక్తులకు తినిపించడానికే శ్రీవేంకటేశ్వరుడు మంచి మంచి కమ్మనైన పిండి వంటల్ని అన్న ప్రసాదాల్ని ఆరగిస్తాడట. ప్రపంచంలో ఈ స్వామిని మించిన నైవేద్య ప్రియుడూ, భోజన ప్రియుడు మరొకరు లేరట. ఇలాంటి శ్రీవారు నిత్యమూ “తోమని పళ్లాల్లో ఆరగిస్తాడట.. ఆ స్వామి ఒకసారి ఆరగించిన పళ్లాన్ని మళ్లీ తోమకుండా పారవేస్తారు. మళ్లీ భోజనానికి మళ్లీ కొత్త పళ్ళెం, వినియోగిస్తారు. ఆ తోమని పళ్లాలే మట్టి కుండలట. అది కూడా సగం పగిలిన మట్టికుండట.. దాన్నే “ఓడు” అంటారు. భక్త ప్రియుడైన వేంకటేశ్వరుడు తాను పగిలిన మట్టి పెంకులో భోజనం చేస్తూ భక్తుల చేత విందారగింప చేస్తున్నాడు.
భక్తులపాలిటి కొంగుబంగారమయిన ఈ స్వామి చెంతన అనగా తిరుమలక్షేత్రంలో ప్రతి రోజూ పండగేనట ప్రతిపూటా పాయసాలేనట. ప్రస్తుతం తిరుమల స్వామివారికి సుప్రభాతం మొదలు ఏకాంతసేవ వరకు ఏ ఏ పదార్థాలు, పిండి వంటలు, అన్న ప్రసాదాలు నివేదనమవుతాయో క్లుప్తంగా పరిశీలిద్దాం.
ప్రతి రోజు తెల్లవారు జామున సుప్రభాతంలో శ్రీవారికి వెన్న పాలు, చక్కెర నివేదిస్తారు. ఆ తర్వాత కొలువు (దర్బార్) జరుగుతుంది. ఈ సందర్భంగా వేయించిన నువ్వులను బెల్లంతో కలిపి దంచిన ఈ పిండిని ప్రతిరోజూ స్వామి వారికి నివేదిస్తారట. తర్వాత మొదటి గంట అని పిలువబడే తాలి నైవేద్యంలో శ్రీవారికి ఎదురుగా పులిహోర, పొంగలి, దధ్యోజనం, చక్కెర పొంగలి, అన్న ప్రసాదాలు, లడ్డు, వడలు, అప్పాలు, వగైరా పిండి వంటలు కులశేఖర పడికి ఇవతలే ఉంచుతారట. ఇంతలో ప్రధాన వంటదారుడు ‘ఓడు’ అని పిలువబడేపగిలిన మట్టి కుండలో “మాత్ర” అనబదే మాతృదధ్యోదనాన్ని మాత్రమే ఆనందనిలయంలోనికి తీసుకెళ్ళి ఏర్పాటు చేస్తాడు. ఈ ఓడు ప్రసాదం తప్ప మిగిలిన ప్రసాదాలన్నీ శ్రీ స్వామివారికి ఎదురుగా గడప కివతలే నివేదన చెయ్యబడతాయి.
మధ్యాహ్నం గంట నివేదనలో శుద్దాన్నంతోపాటు, పైన పేర్కోన్న అన్నప్రసాదాలు, లడ్లు వగైరాలతో పాటు, భక్తులు తాము సమర్పించదలచిన ప్రసాదాలు ఇప్పుడే నివేదింపబడతాయట. రెండవ గంట అయిన వెంటనే శ్రీ స్వామివారు ఉభయదేవేరులతో కల్యాణోత్సవానికి వచ్చేస్తారు. నిత్య కల్యాణోత్సవంలో లడ్డు, వడలు, దోసెలు, అప్పాలు, చక్కెర పొంగలి, పులిహోర, పొంగలి, దధ్యోజనం నివేదింపబడతాయట.
తర్వాత శ్రీ స్వామివారు వసంతోత్సవంలో పాల్గొంటారు. పై మాదిరే దోసెలు, అన్నప్రసాదాలు నివేదింపబడతాయి. ఇక స్వామివారికి అద్దాల మహల్లో డోలోత్సవంలోనూ, సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవలోను పంచకజ్ఞాయం అనే ప్రసాదం నివేదింపబడుతుందట. (పంచకజ్ఞాయం అంటే చక్కెర, గసగసాలు, కలకండ ముక్కలు, ఎండుద్రాక్ష గోడంబి, బాదం పలుకులు అన్నీ కలిపి తయారు చేసిన పొడి ప్రసాదం)
ఇక సాయంత్రం నివేదనలో తోమాలదోసెపడి అనే నెయ్యి దోసెలు, మొళహోర, కదంబం నివేదిస్తారట. తర్వాత మళ్ళీ తిరువీసంగంట అనే ప్రత్యేక నివేదనలో చకెరపొంగలిని శ్రీ స్వామివారికి నివేదిస్తారట. తర్వాత రాత్రి ఏకాంతసేవలో శ్రీ వేంకటేశ్వరునికి బాగా కాగిన, గోరువెచ్చని పాలు, చక్కెర, పండు, పంచకజ్ఞాయంతోపాటు “మేవా” అనబడే పంచామృత ప్రసాదం నివేదింపబడుతుందట.
ఇవి కాక ప్రతి సోమవారం విశేషపూజలో పెద్ద వడలు, లడ్లు నివేదింపబడతాయి. బుధవారం ప్రత్యేకంగా క్షీరాన్నం అనబడే పాయసం నివేదించబడుతుంది. ఇక ప్రతి గురువారం “తిరుప్పావడ” అనే నివేదనలో 420 కిలోల బియ్యంతో తయారుచేసిన ‘పులిహోర శ్రీ స్వామివారి మూలవిరాట్టుకు ఎదురుగా బంగారు వాకిలి దగ్గర ఏర్పాటు చేయబడి నివేదింపబడుతుందట. దీనితో పాటు ప్రత్యేకంగా జిలేబీలు, తేనెతొళ అనే పెద్ద మురుకులు కూడా గురువారంనాడు నివేదింపబడతాయట. ఇక శుక్రవారంనాడు శ్రీ స్వామివారికి హోళీలు లేదా పోళీలు, నివేదింపబడతాయట. దీనితోపాటు “సుఖియ” అనబడే ఉండ్రాళ్ళు ప్రతి శుక్రవారం నివేదిస్తారట.
ప్రతి ఆదివారం “ఆదివారం ప్రసాదం” అనబడే “చలిపిండి ” ప్రత్యేకంగా శ్రీ స్వామికి నివేదింపబడిన తర్వాత దీన్నే బంగారు వాకిలి ఎదురుగా ఉన్న గరుడాళ్వారుకు నివేదిస్తారు. దీన్నే “అమృతకలశం” అంటారు. ఇవిగాక ఏకాదశి మున్నగు సందర్భాల్లో దోసెలతోపాటు, శనగపప్పుతో తయారుచేసి “శుండలు (గుగ్గుళ్ళు) నివేదిస్తారట. ఇవేగాక, “పానకం వడపప్పు” అనబడే పెసరపప్పు పణ్ఞారం నివేదింపబడతాయట. ధనుర్మాస సమయంలో “బెల్లపుదోసె” ప్రత్యేకంగా నివేదింపబడుతుందట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.