E-Paper
Advertisement

Tiger: వనం వదిలి జనం వైపు.. పులి అడుగుల వెనుక అసలు కథ!

Tiger: వనం వదిలి జనం వైపు.. పులి అడుగుల వెనుక అసలు కథ!

Tiger: నిన్నటిదాకా అడవికే పరిమితమైన పులిరాజు.. ఇప్పుడు ఊళ్ల మీద పడుతున్నాడు. సరిహద్దులు చెరిపేసి, జనావాసాల్లోకి అడుగు పెడుతున్నాడు. పొలాల్లో నక్కి.. పొంచి చూస్తూ.. అదును చూసి అటాక్ చేస్తున్నాడు. నిశ్శబ్దంగా వస్తూ… నిలువునా చీల్చేస్తున్నాడు. డ్రాగన్ టైగర్ దాడులతో పల్లె ప్రజల కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. అసలు వనం వదిలి జనం వైపు పెద్దపులి ఎందుకు అడుగులు వేస్తోంది? ఆ కరకు చూపుల వెనుక ఉన్న ఆకలి కథేంటి? …ఈ రోజు వీక్షణంలో చూద్దాం…

అదిగో పులి.. ఇదిగో తోక.. తెలుగు రాష్ట్రాల్లో ‘బెబ్బులి’ కలకలం!

అదిగో పులి..ఇదిగో పులి…తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. ఎక్కడ విన్నా ఒకటే భయం. అడవికి పరిమితం కావాల్సిన అడవి రాజు, ఇప్పుడు ఊరి పొలిమేరల్లో తిష్ట వేశాడు. తెలంగాణలోని పల్లెలు, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాలు, పట్టణాలు ఇప్పుడు పులి పంజాతో బిక్కుబిక్కుమంటున్నాయి. పొలాల్లో పాదముద్రలు.. పశువుల పాకల్లో రక్తపు మరకలు.. సీసీ కెమెరాల్లో కనిపిస్తున్న మెరుపు కళ్లు.. వెరసి రెండు రాష్ట్రాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

యాదాద్రి గడ్డపై పులి అడుగు!

మహారాష్ట్ర అడవుల నుంచి మొదలైన ఆ వేటగాడి ప్రయాణం.. ఇప్పుడు తెలంగాణ గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. అసాధారణ తెలివితేటలు, అంతుచిక్కని వ్యూహాలతో అటవీ శాఖనే ముప్పుతిప్పలు పెడుతోంది. తెలంగాణలోని జిల్లాల్లో ప్రయాణిస్తున్న పులి.. సాదాసీదా పులి కాదు.. వేల కిలోమీటర్ల దూరాన్ని లెక్కచేయకుండా..ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి బయలుదేరి, ఏకంగా 2500 కిలోమీటర్లు ప్రయాణించి యాదాద్రి గడ్డపై అడుగుపెట్టిన ఆ అడవి రాజు తీరు ఇప్పుడు నిపుణులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

యాదాద్రి టు జనగామ.. రూటు మార్చిన పులి

రెండు రోజుల క్రితం వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపింది. ఇప్పుడు తన రూట్‌ను మార్చి సిద్దిపేట మీదుగా జనగామ జిల్లాలోకి ప్రవేశించింది. జనగామ జిల్లా శామీర్‌పేటలోని సుశీలమ్మ వృద్ధాశ్రమం వద్ద పులి దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవ్వడం స్థానికులను భీతావహానికి గురిచేస్తోంది. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు, సారాజిపేట గ్రామాల్లో ఒక ఆవులపై పులి దాడి చేసి హతమార్చడంతో రైతులు పొలాలకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు.

25 కిలోమీటర్ల ప్రయాణం.. దొరకని ఆనవాళ్లు!

సాధారణంగా పులి ఒక జంతువును వేటాడితే, సగం తిని మిగిలిన సగం కోసం మరుసటి రోజు అదే చోటుకు వస్తుంది. కానీ, ఈ పులి శైలి పూర్తిగా భిన్నంగా ఉంది. ఒక్కసారి వేటాడిన చోటికి ఈ పులి మళ్లీ రావడం లేదు. ఆకలి తీరగానే ఆ ప్రాంతాన్ని వదిలి మాయమైపోతోంది. రాత్రివేళల్లో నిశ్శబ్దంగా 18 నుంచి 25 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ తన స్థావరాన్ని మారుస్తోంది. మనుషుల అలికిడిని, వాసనను కిలోమీటర్ల దూరం నుంచే పసిగడుతున్న ఈ క్రూర మృగం.. జన సంచారం ఉన్న వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పగలు గుట్టలు, పొదల్లో రక్షణ పొందుతూ.. నిశీధి వేళల్లో మాత్రమే వేట సాగిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ రాజమండ్రి పట్టణంతో పాటు..రాయవరం మండలం కూర్మాపురం వరకు పులి స్వైరవిహారం చేస్తూ, ఏకంగా ఒక ఇంట్లోకి దూరి కలకలం సృష్టించింది. గత ఆరు రోజుల్లో పదికి పైగా మూగజీవాలను బలితీసుకున్న ఈ మృగరాజు దెబ్బకు తూర్పుగోదావరి జిల్లా లంక గ్రామాల ప్రజలు వణికిపోయారు.

రాజ్యం కోల్పోయిన రాజు.. పులి మనుగడ ప్రశ్నార్థకం

పులికి అడవి అంటే కేవలం ఒక ప్రాంతం కాదు, అది దాని రాజ్యం. కానీ మానవ అవసరాల కోసం అడవులను నరికివేయడం, గనులు, రహదారుల నిర్మాణం వల్ల పులుల ఆవాసం కుంచించుకుపోతోంది. ఒకప్పుడు వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవి ఇప్పుడు ముక్కలు ముక్కలుగా మారుతోంది. దీనివల్ల తన సరిహద్దును వెతుక్కునే క్రమంలో పులి దారి తప్పి జనావాసాల్లోకి వస్తోంది. అడవిలో పులి వేటాడేందుకు దుప్పులు, అడవి పందులు, కారుపోతులు ప్రధాన ఆహారం. అయితే వేటగాళ్ల వల్ల లేదా వ్యాధుల వల్ల అడవిలో ఈ జంతువుల సంఖ్య తగ్గిపోతోంది. అడవిలో ఆకలి తీరకపోవడంతో, సులువుగా దొరికే ఆవులు, గేదెల కోసం పులులు గ్రామాలను ఆశ్రయిస్తున్నాయి. ఒకసారి పశువుల మాంసానికి అలవాటు పడితే, అవి పదే పదే గ్రామాల వైపు రావడానికి ఆసక్తి చూపిస్తాయి.

పెరుగుతున్న పులుల సంఖ్య – తరుగుతున్న అడవి విస్తీర్ణం

పులులు అత్యంత స్వతంత్ర భావం గలవి. ఒక్కో మగ పులికి సుమారు 60 నుండి 100 చదరపు కిలోమీటర్ల సామ్రాజ్యం కావాలి. ప్రస్తుతం అడవుల్లో పులుల సంఖ్య పెరుగుతుండటంతో స్థలం కోసం వాటి మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. బలమైన పులి చేతిలో ఓడిపోయిన ముసలి పులులు, యువ పులులు ప్రాణరక్షణ కోసం అడవిని వదిలి బయటకు వచ్చేస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చిన పులి విషయంలో కూడా ఇదే జరిగి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

అడవి దాటి వస్తున్న పులి.. తప్పెవరిది?

వేసవి కాలం సమీపిస్తున్న వేళ అడవుల్లో వాగులు, వంకలు ఎండిపోతున్నాయి. నీటి కోసం వెతుకులాటలో భాగంగా పులులు అడవి అంచున ఉన్న వ్యవసాయ బావుల వద్దకు, కాలవల వద్దకు చేరుతున్నాయి. నీరు ఉన్న చోట పశువులు కూడా ఉంటాయనే ఉద్దేశంతో అవి అక్కడే తిష్ట వేస్తున్నాయి. అడవికి ఆనుకుని ఉన్న భూముల్లో రైతులు పంటలు వేయడం, జనాభా పెరగడం వల్ల అడవికి, గ్రామానికి మధ్య ఉండాల్సిన బఫర్ జోన్ కనుమరుగైపోతోంది. పొలాల్లో పెరిగే పత్తి, చెరకు తోటలు పులికి అడవిలోని పొదల్లాగే భ్రమ కలిగిస్తున్నాయి. అక్కడ దొరికే నీరు, ఆహారం కారణంగా అవి అక్కడే ఉండటానికి మొగ్గు చూపుతున్నాయి. పులి జనావాసాల్లోకి రావడం అంటే అది మనుషులపై దాడి చేయడానికో, యుద్ధానికో రావడం లేదు.. కేవలం ఆహారం, తన మనుగడ కోసమే పోరాడుతోంది. అడవుల్లో కృత్రిమ నీటి కుంటలు ఏర్పాటు చేయడం, అడవి జంతువుల సంఖ్యను పెంచడం ద్వారా పులులు బయటకు రాకుండా చేసే అవకాశం ఉంది.

మౌనమే దాని ఆయుధం, రాజసమే దాని వ్యక్తిత్వం

అడవికి అది రారాజు.. దాని అడుగు పడితే భూమి పులకరిస్తుంది.. దాని గర్జన వినిపిస్తే ప్రాణం గాలిలో కలిసిపోతుంది. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న పెద్దపులి సంచారం నేపథ్యంలో, అసలు పులి మనస్తత్వం ఏంటి? అది నిజంగానే ప్రాణాలు తీసే క్రూర మృగమా? ఒకవేళ ఎదురైతే చావు నోటి నుంచి ఎలా తప్పించుకోవాలి?

అడవికి అలంకారం, రాజసానికి చిరునామా.. పెద్దపులి. దట్టమైన అరణ్యాల్లో ఏకాకిగా సంచరిస్తూ, తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకునే ఈ మృగరాజు మనస్తత్వం అత్యంత విలక్షణమైంది. పులి సహజంగా తన ఆలోచనలు, భావాలను లోలోపలే ఉంచుకుంటుంది. అది మనుషులపై దాడి చేయాలని ఎప్పుడూ అనుకోదు. ఎక్కడైనా పులి మనిషిపై దాడి చేసిందంటే, అది అనుకోకుండా ఎదురుపడినప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్ లాంటిదే తప్ప.. కావాలని చేసే వేట కాదు. పులి తనకంటూ ఒక సరైన ఆవాసం దొరికే వరకు నిరంతరం కదులుతూనే ఉంటుంది. ఆ ప్రయాణంలో భాగంగా అడవి అంచులకు వచ్చినప్పుడు, అక్కడ సులువుగా లభించే బర్రెలు, ఆవులపై దాడి చేస్తుంది. పులికి ఆహారం ఎక్కువగా కావాలి కాబట్టి, అది చిన్న వాటి జోలికి వెళ్లకుండా పెద్ద జంతువులనే లక్ష్యంగా చేసుకుంటుంది.

పులి వేట.. ప్రకృతి వింతలు – ఆశ్చర్యపరిచే నిజాలు

పులి అసలైన వేటగాడు. అది పగలు విశ్రాంతి తీసుకుని, రాత్రి వేళల్లోనే వేటాడుతుంది. దీనికి కారణం లేకపోలేదు.. రాత్రి పూట పులి దృష్టి సామర్థ్యం మనిషి కంటే పది రెట్లు ఎక్కువగా ఉంటుంది. చీకటిలో కూడా స్పష్టంగా చూడగలగడం, వాసన ద్వారా ఎర ఎక్కడుందో కిలోమీటర్ల దూరం నుంచే పసిగట్టడం దీనికి వెన్నతో పెట్టిన విద్య. ఒక్కసారి వేటాడి కడుపు నిండా ఆహారం తిన్న తర్వాత, పులి మళ్లీ మూడు రోజుల వరకు వేట జోలికి వెళ్లదు. ఆ సమయాన్ని విశ్రాంతికే కేటాయిస్తుంది.

తనకంటూ ఓ ప్రత్యేక పరిధి

పులికి తనకంటూ ఒక ప్రత్యేకమైన పరిధి ఉండాలి. దాని కోసం అది మూత్రం, మలవిసర్జన ద్వారా తన సరిహద్దులను గుర్తులుగా మార్చుకుంటుంది. ఆ వాసనను బట్టి ఇతర జంతువులకు అది నో ఎంట్రీ బోర్డు లాంటిది. తన సామ్రాజ్యంలో మరే ఇతర జంతువు, మనిషి జోక్యాన్ని సహించదు. ఒక పులి మరొక పులి సరిహద్దులోకి ప్రవేశించడం యుద్ధానికి దారితీస్తుంది. అయితే కేవలం సంభోగ సమయంలో మాత్రమే పులులు జంటగా కనిపిస్తాయి. ఆ సమయంలో అవి అత్యంత దూకుడుగా, ఆవేశంగా ఉంటాయి.

పులుల గురించి ఆసక్తికరమైన విషయాలు

పులుల గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వాటి వీపుపై ఉండే నల్లటి చారలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది పులులలో ఏ రెండు పులుల చారలు ఒకేలా ఉండవు. మనుషులకు ఫింగర్ ప్రింట్స్ ఎంత విలక్షణమో, పులులకు వాటి చారలు అంత ప్రత్యేకం. అటవీ శాఖ అధికారులు కూడా ఈ చారల ఆధారంగానే పులుల సంఖ్యను గుర్తిస్తారు. పులి కదలడం అంటే అది దేనికో వెతుకులాట ప్రారంభించినట్లే. అది తావు కోసమో, తోడు కోసమో, వేట కోసమో కావచ్చు. మన పరిసరాల్లోకి పులి వచ్చిందంటే అది మనపై దాడి చేయడానికి కాదు.. తన దారిని తాను వెతుక్కునే క్రమంలో ఎదురైన ఆటంకం మాత్రమే. పులి స్వభావాన్ని అర్థం చేసుకుంటే, భయం కంటే అప్రమత్తతే మనల్ని కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.

పులి అంత డేంజర్ ఏం కాదు..

పులి అంత డేంజర్ కాదు …నిజం చెప్పాలంటే, పులి మనిషి కంటే కూడా తను వేటాడే అడవి పందికో, దుప్పికో ఎక్కువ భయపడుతుంది. అయితే పులి మనుషులపై దాడి చేయడం చాలా అరుదు. అది కూడా ప్రమాదంగా భావిస్తేనే మనుషులపై దాడి చేసే అవకాశం ఉంటుంది. కానీ, సాధారణంగా పులి మనుషులను చూసి తప్పించుకునే ప్రయత్నమే చేస్తుంది. అయితే పులికి విపరీతమైన ఆకలి వేసినప్పుడు, ముసలితనం వల్ల వేగంగా పరుగెత్తలేనప్పుడు, శరీరానికి గాయమై అడవి జంతువులను వేటాడలేనప్పుడు మాత్రమే అది గ్రామాలపై పడి పశువులను, మనుషులను లక్ష్యం చేసుకుంటుంది. తన పిల్లలతో ఉన్నప్పుడు ఆడపులి అత్యంత ప్రమాదకారి. పిల్లల రక్షణ కోసం అది దేన్నైనా ఎదిరిస్తుంది.

ఏంటి పులి చూపి పరుగులు తీయకూడదా..

చాలామంది పులిని చూడగానే భయంతో పరుగెత్తుతారు. నిజానికి పులి నుంచి తప్పించుకోవడానికి పరుగుపెట్టొద్దు. పరుగెత్తితే పులి మిమ్మల్ని ఒక ఎరగా భావించి వేటాడుతుంది. పులి కంటే వేగంగా మనిషి పరుగెత్తలేడు. పులి కళ్లలోకి నేరుగా చూడటం దానికి సవాలు విసిరినట్లు అవుతుంది. చూపు తగ్గించి, నెమ్మదిగా వెనక్కి అడుగులు వేయాలి. పులి కనిపించినప్పుడు చేతులను పైకెత్తి, దుప్పటి లాంటిది ఉంటే దాన్ని వెడల్పుగా చాపి పులి కంటే పెద్దగా ఉన్నట్లు భ్రమ కలిగించాలి.పులికి మానవ స్వరం నచ్చదు. గట్టిగా అరిచినా, చప్పట్లు కొట్టినా అది వెనుకంజ వేసే అవకాశం ఉంది.

పులి వెనుక నుంచి ఎందుకు దాడి చేస్తుంది..

పులి ఎప్పుడూ వెనుక నుంచి మాత్రమే దాడి చేస్తుంది. తల వెనుక భాగంలో మనిషి ముఖంలా ఉండే ముసుగును ధరిస్తే, పులి తననుగమనిస్తున్నారని భ్రమపడి దాడి చేయదు. పులి నేరుగా గొంతుపై పంజా విసురుతుంది. మెడకు మందపాటి గుడ్డ, రక్షణ కవచం లాంటిది ఉంటే ప్రాణాపాయం తప్పుతుంది. ఒంటరిగా ఉన్నవారినే పులి టార్గెట్ చేస్తుంది. నలుగురు కలిసి ఉంటే పులి దరి చేరదు. పులి ఒక అద్భుతమైన సృష్టి. అది రాక్షసి కాదు.. అడవిని కాపాడే కాపలాదారి. మనం దానికి ఇవ్వాల్సిన గౌరవం, దూరం ఇస్తే.. అది మన దరి చేరదు. భయం వద్దు.. కానీ అప్రమత్తత అవసరమని నిపుణులు చెబుతున్నారు.

Story by: Anup, Big Tv

Also Read: ప్రజాపాలన – ప్రగతి బాట.. తెలంగాణా పునర్నిర్మాణంలో సీఎం రేవంత్ స్పీడ్!

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×