అగ్నిదేవునికి ధాన్యాలు, పువ్వులు, నెయ్యి వంటివి సమర్పించినప్పుడు స్వాహా అని జపిస్తారు. స్వాహా అనే పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. స్వాహా అంటే ‘నేను సమర్పిస్తున్నాను’ అని అర్థం. స్వాహా అనేది దేవునికి ఆవాహన వంటిది. మీరు స్వాహా అని జపిస్తే పవిత్రమైన అగ్నిదేవుడు మీ నైవేద్యాన్ని అంగీకరించి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని నమ్ముతారు.
మరొక నమ్మకం ప్రకారం స్వాహా అంటే శరణాగతి అని కూడా అర్థం. ఆధ్యాత్మిక ఆచారాలలో శరణాగతి అంటే మీ కోరికలను వదులుకోవడం అని అర్థం. స్వాహా అని జపించి నైవేద్యాన్ని సమర్పిస్తున్నప్పుడు భౌతిక అనుబంధాలను, అహంకారాలను, కోరికలను విడిచిపెడుతున్నట్టే భావిస్తారు. స్వాహా అంటే ‘దీనిని నేను దైవానికి ఇస్తున్నాను’ అని చెప్పే అర్థం కూడా వస్తుంది.
స్వాహా అని చెప్పి ఒక పదార్థాన్ని అగ్నిలో వేస్తే దానితో ఉన్న అనుబంధాలన్నీ తెంచుకుంటున్నట్టే లెక్క అని కూడా అంటారు. ప్రజలు యజ్ఞంలో అధికంగా నెయ్యి, నూనె, పువ్వులు, కర్పూరం, ధాన్యాలు, మూలికలు వంటివి వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మానవుల రోజు వారి జీవితంలో ఉపయోగించేవే. వాటిని అగ్నిదేవునికి అర్పించినప్పుడు ఈ వస్తువులతో అనుబంధాలను తొలగించుకున్నట్టే అని కూడా చెప్పుకుంటారు.
మరొక వాదన ప్రకారం అగ్నిదేవునికి ఏదైనా అర్పించేటప్పుడు స్వాహా అని చెప్పడానికి మరొక ముఖ్య కారణం కూడా ఉంది. అగ్నిదేవుని భార్య స్వాహా దేవి అని అంటారు. అగ్నిదేవుని కరుణ కోసం అతని భార్య పేరును పదేపదే తలుచుకుంటారని చెబుతారు. ప్రతిఫలంగా వరాలు, ఆశీర్వాదాలు అందుతాయని అంటారు.