Vizag News: ఎట్టకేలకు విశాఖ సిటీలో పంచ గ్రామాల సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టేసింది చంద్రబాబు ప్రభుత్వం. దాదాపు 92 వేల కుటుంబాలకు ఊరట లభించేలా నిర్ణయం తీసుకుంది. ఆ ఐదు గ్రామాల్లోవున్న ఇళ్లను క్రమబద్దీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు రెవిన్యూమంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. దశాబ్దాల తర్వాత మా కల నెరవేరిందని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
విశాఖలోని పంచగ్రామాలపై కీలక ప్రకటన చేశారు రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. ఐదు గ్రామాల్లో 12 వేల పైచిలుకు ఇళ్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఏళ్ల తరబడి ఆ ప్రాంతంలో ప్రజలు నివసిస్తున్నారు. దాదాపు 420 ఎకరాల భూములు సింహాచలం దేవస్థానానికి సంబంధించినవి.
ప్రస్తుతం మార్కెట్లో వాటి విలువ అక్షరాలా 5,400 కోట్ల రూపాయలు. దీని గురించి ప్రభుత్వం నుంచి కొందరు మంత్రులు.. మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుతో మాట్లాడారు. ప్రత్యామ్నాయంగా 610 ఎకరాల ప్రభుత్వ భూములను సింహాచలం దేవస్థానానికి ఇవ్వనుంది.
అసలేం జరిగిందంటే 2008లో సింహాచలం దేవస్థానం, ఆలయానికి సంబంధించి భూములపై సర్వే చేపట్టింది. అందులో 12, 149 ఆక్రమణలు గుర్తించింది. అడవివరం, వేపగుంట, వెంకటాపురం, పురుషోత్తపురం, చీమాలపల్లి గ్రామాల్లో 420 ఎకరాల్లో వాటిని గుర్తించారు. వీటిని మాత్రమే క్రమబద్దీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ALSO READ: ఆ పసికూన చనిపోయాడని స్మశానానికి తీసుకొచ్చారు, ఖననం చేస్తుండగా.. ఊహించని ఘటన
సింహాచలం దేవస్థానానికి గాజువాక, పెదగంట్యాడ, ములగాడ మండలాల్లో ఇవ్వనున్నారు. ఇవన్నీ యారాడ కొండ సమీపంలోనే ఉన్నాయి. 2014-19 మధ్యకాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు రెండు జీవోలను జారీ చేసింది. ఈ జీవోల కింద విశాఖలో 70 వేల మంది క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు.
జీవోల ప్రకారం రెండేళ్లలో ఆ భూములపై లబ్ధిదారులకు సర్వ హక్కులు లభించేలా కన్వేయన్సు డీడ్ ఇవ్వాల్సి ఉంది. ఈలోగా ఏపీలో ప్రభుత్వం మారింది, ఆపై వైసీపీ రూలింగ్‌లోకి వచ్చింది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలను పట్టించుకోలేదు.
పిల్లల చదువులు, వివాహాలకు ఆస్తులను తనఖా పెట్టేందుకు వీలు ఉండేది కాదు. ఇప్పుడు ఆ గ్రామాల్లో నివసించేవారికి పూర్తిస్థాయి హక్కులు కల్పించేలా అడుగులు పడుతున్నాయి. గత ఎన్నికల ముందు కూటమి నేతలు దీనిపై హామీ ఇచ్చారు. ఆ మేరకు చర్యలు ప్రారంభమయ్యాయి.