హిందూ సంప్రదాయాల్లో ఒక మనిషి మరణించాక అంత్యక్రియలు ఎంతో ముఖ్యమైనవి. మరణించిన వ్యక్తి దేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లి దహనం చేసే ప్రక్రియను పవిత్రంగా భావిస్తారు. అయితే చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ మహిళలు శ్మశానానికి వెళ్లకూడదనే ఒక నమ్మకం ఉంది. ఇది చాలా మందిలో సందేహాలను కలిగిస్తుంది. అసలు ఈ ఆచారం ఎందుకు వచ్చింది? దానికి గరుడ పురాణం వంటి ధార్మిక గ్రంథాలు ఏమి చెబుతున్నాయి? అనే విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. కొన్ని చోట్ల కాటి కాపరులుగా కూడా పనిచేస్తున్నారు. మరి వారిని అంత్యక్రియలలో ఎందుకు పాల్గొనకూడదు.
మహిళలు ఎందుకు వద్దు?
పాతకాలంలో మహిళలు భావోద్వేగాలకు ఎక్కువగా లోనవుతారనే ఒక అభిప్రాయం ఉండేది. కుటుంబంలో ఎవరో మరణిస్తే వారు ఎక్కువగా బాధపడటం, ఏడవడం చేస్తుంటేవారు. గరుడ పురాణం ప్రకారం శ్మశానంలో ఎక్కువగా ఏడవడం వల్ల మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి కలగదని నమ్ముతారు. అంటే ఆత్మ తన కుటుంబంపై మమకారం పెంచుకుని ముందుకు వెళ్లకుండా ఉండిపోతుందని అనుకునేవారు. అందుకే మహిళలను అంత్యక్రియలకు దూరంగా ఉంచడం మంచిదని పెద్దలు భావించారు. అలా అప్పట్నించి అదే సాంప్రదాయంగా వస్తోంది.
Also read: Orange Jelly: కేవలం 3 పదార్థాలతో ఇంట్లోనే టేస్టీ ఆరెంజ్ జెల్లీ చేసేయండి, రెసిపీ ఇదిగో
మరో కారణం శ్మశానం వాతావరణానికి సంబంధించినది. పూర్వం శ్మశాన ప్రాంతాన్ని నెగటివ్ ఎనర్జీ ఉన్న ప్రదేశంగా భావించేవారు. అక్కడ ఉండే వాతావరణం, శబ్దాలు, దృశ్యాలు భయాన్ని కలిగించేలా ఉంటాయని.. మహిళలు ఆ ప్రభావానికి త్వరగా లోనవుతారని భావించేవారు. అందుకే అక్కడికి వెళ్లనివ్వకుండా అడ్డుకునేవారు. అలాగే రాత్రి వేళల్లో అంత్యక్రియలు జరిగే సందర్భాల్లో మహిళల భద్రత గురించి కూడా పెద్దలు ఆలోచించి ఈ సంప్రదాయాన్ని పాటించేవారు.
ఆచారాలు పాటించడం కోసం
ఇంకో ముఖ్యమైన కారణం కుటుంబ బాధ్యతలతో సంబంధం ఉంది. పాతకాలంలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత కొంతకాలం ఆత్మ ఇంటి చుట్టూ తిరుగుతుందని నమ్మకం ఉండేది. అందువల్ల ఇంటిని ఖాళీగా వదిలిపెట్టకుండా మహిళలు ఇంట్లోనే ఉండాలని చెప్పేవారు. అదే సమయంలో శ్మశానానికి వెళ్లే పురుషులు కొన్ని ఆచారాలు పాటించాలి. ఉదాహరణకు తల వెంట్రుకలు గీయించుకోవడం వంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈ ఆచారాలు మహిళలకు సరైనవి కాదు. ఇలా చూస్తే ఈ నమ్మకాలు ఆ కాలానికి అనుగుణంగా ఏర్పడినవనే చెప్పుకోవాలి.
Also read: Idly Fry: ఇడ్లీ ఫ్రై రెసిపీ.. ఇలా ఇడ్లీలతో చేస్తే బ్రేక్ ఫాస్ట్ అదిరిపోతుంది
హిందూ శాస్త్రాల్లో మహిళలు శ్మశానానికి వెళ్లకూడదని ఎక్కడా స్పష్టంగా రాసి లేదు. ఇష్టముంటే మహిళలు కూడా అంత్యక్రియల్లో పాల్గొనవచ్చు. కుటుంబంలో పురుషులు లేని సందర్భాల్లో భార్య లేదా కుమార్తె కూడా చివరి సంస్కారాలు చేయవచ్చు అని కొన్ని గ్రంథాలు సూచిస్తున్నాయి. నేటి కాలంలో చాలా కుటుంబాలు ఈ విషయాన్ని సమానత్వ దృష్టితో చూస్తున్నాయి. మహిళలు కూడా శ్మశానానికి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొనడం సాధారణంగా మారుతోంది.
మొత్తానికి, మహిళలు శ్మశానానికి వెళ్లకూడదనే ఆచారం వెనుక భావోద్వేగాలు, భద్రత, సంప్రదాయాలు వంటి కారణాలు ఉన్నాయి. కానీ ఇవి కేవలం పాతకాలపు నమ్మకాలే అని ఇప్పుడు చాలా మంది భావిస్తున్నారు. కాలం మారుతున్న కొద్దీ ఆలోచనలు కూడా మారుతున్నాయి. నేటి సమాజంలో మహిళలకు కూడా సమాన హక్కులు ఉన్న నేపథ్యంలో, ఈ విషయాన్ని వ్యక్తిగత నిర్ణయం మరియు కుటుంబ అనుమతిపై ఆధారపడి తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.