BigTV English
Advertisement

Guru pournami 2025: గురుపౌర్ణమి రోజున.. సాయిబాబానే ఎందుకు పూజిస్తారో తెలుసా..?

Guru pournami 2025: గురుపౌర్ణమి రోజున.. సాయిబాబానే ఎందుకు పూజిస్తారో తెలుసా..?

Guru pournami 2025: గురు పూర్ణిమ భారతీయ ఆధ్యాత్మికతలో ఎందుకంత ప్రత్యేకం. ఈ రోజున హిందువులు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? అసలు షిరిడీ సాయిబాబాకు గురు పూర్ణిమకూ ఉన్న సంబంధమేంటి? గురు పూర్ణిమ రోజు షిరిడీ దర్శించుకోవాలని అంటారు ఎందుకని? గురు పూర్ణిమ రోజున షిరిడీలో ఏం చేస్తారు? ఆ వివరాలేంటి ఇప్పుడు చూద్దాం.


ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గురు పౌర్ణమి వేడుకలు

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర.. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః అంటూ గురువును ఆరాధించడం మన సంప్రదాయం. ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున భారత దేశమంతటా గురు పౌర్ణమి వేడుకలు జరుకుంటారు. ఈ రోజున గురువులను స్మరించుకోవడం ఒక ఆనవాయితీ. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం ఎలా జరుపుకుంటారో.. సరిగ్గా అలాగే ఇదీ తిథుల ప్రకారం జరుపుకునే టీచర్స్ డే తో సమానం. ఈ సమయంలో తమ జీవితంలో అత్యంత ప్రభావ శీలురైన వ్యక్తులను, గురువులుగా భావించేవారిని దర్శించుకుని వారికి వివిధ రకాల కానుకలు సమర్పించి, సత్కరించుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది.


గురు పూర్ణిమ నాడు వ్యాసముని పుట్టిన రోజు

దానికి తోడు గురు పూర్ణిమ నాడు వ్యాసముని పుట్టిన రోజు కాబట్టి.. ఈ రోజుకు మరింత ప్రత్యేకత వచ్చింది. వ్యాసుడు భారత జాతికి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్లినట్టు భావిస్తారు. దీంతో ఆయన్ను గురువుగా భావించి.. ఈ రోజు ఇతర గురువులను కూడా స్మరించుకుంటారు. వేదవ్యాసుడి అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతి మొత్తాన్ని నాలుగు వేదాల్లో ఆయన ఈ జాతికి అందించడం వల్ల ఆయన్ను వేద వ్యాసుడిగా పిలవడం ప్రారంభిచారు. ఆనాటి నుంచి వ్యాసుడు పుట్టిన ఆషాడ పూర్ణిమను గురు పూర్ణిమిగా భావించి గురు ధ్యానం చేస్తారు.

గురు పౌర్ణమినాడు షిరిడీలో ఘనంగా వేడుకలు

గురుపూర్ణిమనాడు షిరిడీ సాయిబాబా ఆలయంలో అత్యంత ఘనంగా వేడుకలు జరుగుతాయి. సాయి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూర్ణిమను జరుపుకుంటారు. ఈ సందర్భంగా భక్తులు సాయిబాబాను దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు చేస్తారు. గురు పౌర్ణమి సాయిబాబాకు ఎంతో ఇష్టమైన పండుగగా భావిస్తారు. ఈ రోజున సాయి బాబా దర్శనం చేసుకోవడం వల్ల ఆయన సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. ఈ సందర్బంగా దేశ నలుమూలల నుంచి షిరిడీ వస్తారు.

సాయిబాబాకు ఎంతో ఇష్టమైన పండుగ

గురు పూర్ణిమ అంటే సాయిబాబాకు ఎందుకంత ఇష్టమంటే.. ఈ రోజు గురువును పూజించే పరమ పవిత్రమైన రోజు కాబట్టి. సరిగ్గా అదే సమయంలో సాయి బాబా తన భక్తులకు ఒక గురువుగా భావిస్తుంటారు. సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై అంటూ ఆయన్ను ఎక్కువగా గురు శబ్ధంతో ఆరాధిస్తుంటారు.. కాబట్టి ఈ రోజు షిరిడీ సాయి సందర్శన ఎంతో మేలు చేస్తుందని భావిస్తారు. అందుకే గురు పూర్ణిమ నాడు.. షిరిడీకి పోటెత్తుతారు భక్తులు.

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉండే షిరిడీ

ఇంతకీ ఈ షిరిడీ ఎక్కడ ఉంటుందని చూస్తే.. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉంటుంది. ఇది అహ్మద్ నగర్ నుంచి సుమారు 83 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1858లో చాంద్ పాటిల్ కుటుంబానికి సంబంధించిన పెళ్లి వారితో కలసి.. షిరిడీ వచ్చారు బాబా. ఈ సమయంలో ఖండోబా మందిరం దగ్గర బాబా బండి దిగినపుడు ఆ ఆలయ పూజారి.. మహల్సాపతి.. ఆవో సాయీ అని పిలిచారు. సా అంటే సాక్షాత్తూ, యీ అంటే ఈశ్వరుడని అర్ధమొచ్చేలా ఆయన పిలవడంతో.. బాబాకు సాయి నామం స్థిరపడింది. తర్వాతి కాలంలో ఆయన సాయిబాబాగా స్థిరపడ్డారిక్కడ.

1918లో సమాధి అయ్యే వరకూ షిరిడీలోనే సాయి

1918 లో సమాధి అయ్యే వరకూ సాయిబాబా షిరిడీలోనే జీవించారు. ఒక పాత మసీదును తన నివాసం చేసుకున్నారు. ఈ మసీదులో ఒక ధుని వెలిగించి.. అందులోంచి విభూతి తీసి తనను చూడటానికి వచ్చేవారికి ఇచ్చేవారు. అది వారికి రక్షణ ఇస్తుందని నమ్మేవారు. అంతే కాదు తనను దర్శించడానికి వచ్చిన వారికి ఉపదేశాలు చేసేవారు. ఎన్నో మహత్తులు చూపేవారు. అంతే కాదు తన చేతులతో స్వయంగా వండిన ప్రసాదాన్ని భక్తులందరికీ పంచేవారు.

షిరిడీలో అడుగు పెట్టిన వారి కష్టాలు తీరినట్టే

షిరిడీ సాయిబాబా ఏకాదశ సూత్రాలు ఎంతో ప్రసిద్ధమైనవి. షిరిడీలో అడుగు పెట్టిన వారి కష్టాలు తీరినట్టే. మసీదు మెట్లు ఎక్కగానే సంతోషం వెల్లివిరిస్తుంది. నేనీ భౌతిక దేహం విడిచాక కూడా చేతనంగానే ఉంటాను. నా సమాధి సైతం నా భక్తులను దీవిస్తుంది. వారి ప్రశ్నలకు జవాబు సమాధి వద్దే లభిస్తుంది. నా సమాధి నుంచే నేను మీకు దర్శనమిస్తాను నన్ను శరణు కోరిన వారికి తప్పక సాయం చేస్తాను. మీరు నా వంక చూడండి- నేను మీ వంక చూస్తాను. మీ భారాలను నాకిస్తే నేను తప్పక మోస్తాను. నా సాయం కోరిన వారికి వెంటనే అది లభిస్తుంది.. నా భక్తుల ఇంట లేమి అనేది ఉండదు.. అంటూ సాయిబాబా చేసిన బోధనల కారణంగా భక్తుల్లో ఒక నమ్మకం ఏర్పడింది. దీంతో సాయిబాబా దర్శనానికి భారీ ఎత్తున జనసందోహం వచ్చేవారు.

మహల్సాపతి తొలి భక్తుడు

ఖండోబా ఆలయ పూజారి మహల్సాపతి సాయిబాబాకు తొలి భక్తుడు కాగా.. ఆయన ఖ్యాతిని దేశ వ్యాప్తం చేసింది మాత్రం.. దాసగణు. తన కీర్తనల ద్వారా బాబా మహిమలు నలుదిశలా చాటాడు. నాటినుంచి సాయిబాబాకు హిందూ ముస్లిం తేడా లేకుండా భక్తులు ఏర్పడ్డారు. ఒక సమయంలో క్రైస్తవ, పార్సీ భక్తులు సైతం సాయి దర్శనానికి వచ్చేవారు.

హేమండ్ పంత్ రచించిన సాయి సచ్చరిత్ర

షిరిడీ సాయి మహత్యం సాయి సచ్చరిత్ర అనే హేమండ్ పంత్ రచించిన గ్రంధంలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. దీర్ఘ కాలిక రోగాలను నయం చేయడం, భక్తుల మనసులో ఉన్న విషయాలను తెలుసుకోగలగడం, దూర ప్రాంతాల్లోని భక్తులకు తన సందేశం ఏదో ఒక రూపంలో తెలియ చేయడం.. ఇలా సాయిబాబా తనభక్తుల్లో నమ్మకాన్ని విశేషంగా పెంచుకుంటూ వచ్చారు. ఒక సమయంలో ఆయన మండించిన ధుని నుంచి తీసిన విభూతి సర్వ రోగ నివారిణిగా విశ్వసించేవారు. సాయిని నమ్ముకుంటే ఎంతటి కష్టసాధ్యమైన పనైనా సులభంగా జరిగిపోతుందని విశ్వసించేవారు.

1910 నాటి నుంచి మారు మోగిన సాయి నామం

1910 నాటి నుంచి సాయిబాబా పేరు దేశ మంతటా మారు మోగటం ప్రారంభించింది. సాయి బాబాను నడిచే దైవంగా భావించి ఆరాధించడం మొదలు పెట్టారు. 1918, అక్టోబర్ 15న మంగళవారం, మధ్యాహ్నం 2. 30 గంటలకు బాబా భక్తుడు పాటిల్ ఒడిలో సమాధి స్థితికి చేరారు సాయిబాబా. సాయి దేహం బూటివాడలో ఖననం చేయగా.. అక్కడే సమాధి మందిరం నిర్మించారు. ఇపుడా సమాధి మందిరాన్నే దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు దర్శించి ఆయన ఆశీస్సులు కోరుతుంటారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీగా సాయి కల్చర్

ఒక సమయంలో సాయి కల్చర్ అన్నది దేశ వ్యాప్తంగా విస్తృతమైంది. మరీ ముఖ్యంగా మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోనూ షిరిడీ సాయి మందిరాలు ఏర్పడ్డాయి. అశేష భక్తజన వాహిని సాయి శిష్య పరమాణువులుగా తయారయ్యారు. ఎందరో సాధవులు సాయి బాబా మీద పుస్తకాలు రచించారు. సాయి తత్వాన్ని విడమరచి చెప్పారు. అంతేనా 1986, 2012లో తెలుగులో శిరిడి సాయి బాబా మీద సినిమాలు వచ్చాయి. దీంతో సాయిబాబా మహత్యం తెలుగు వారిలో మరింతగా ఫరిడవిల్లింది. సాయి శరణం బాబా శరణం అంటూ ఊగి పోయింది తెలుగు భక్తజన సమాజం.

హిందూ దర్శనీయ స్థలాల్లో ఒకటిగా భాసిల్లుతోన్న షిరిడీ

ప్రస్తుతం షిరిడీ హిందూ భక్తజనం సందర్శించాల్సిన ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. అంతేనా దేశంలోని అత్యంత సంపన్న ఆలయాల్లోనూ ప్రముఖమైనదిగా ఫరిడవిల్లుతోంది. శ్రీ సాయిబాబా సంస్థాన్ పేరిట ప్రస్తుతం ఒక ట్రస్టు సాయిబాబా భక్తులను అనుసంధానం చేస్తుంటుంది. ఆన్ లైన్ సేవలు విరాళాలు వసతి సౌకర్యాల వంటివి నిర్వహిస్తుంటుంది. అధికారిక వెబ్ సైట్ https://sai.org.in కాగా.. అధికారిక యాప్- Shree Saibaba Sansthan Shirdi. ఎవరైనా షిరిడీ సంస్థాన్ వారిని సంప్రదించాలనుకుంటే ఆ నెంబర్ 02423-258500కి ఫోన్ చేసి మరిన్ని వివరాలను కనుక్కోవచ్చు.

సబ్ కా మాలిక్ ఏక్ హై- సాయి నినాదం

శ్రద్ధ, సబూరీ.. సబ్ కా మాలిక్ ఏక్ హై అన్నది షిరిడీ సాయిబాబా సూచించే ప్రధాన సూక్తి. ఇక్కడ జరిగే ప్రధానమైన పండగలలో రామనవమి, సాయిబాబా పుణ్య తిథితో పాటు గురు పూర్ణిమ అత్యంత శ్రేష్టమైనది. మాములుగా అయితే షిరిడీని ప్రతి రోజూ సగటున 20 వేల నుంచి యాభై వేల మంది సందర్శిస్తుంటారు. అదే గురు పూర్ణిమలాంటి పర్వదినాలపుడు లక్ష మంది వరకూ సందర్శిస్తారు. దేశం వెలుపల అంటే అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్ వంటి చోట్ల కూడా షిరిడీ ఆరాధనా కార్యక్రమాలు జరుగుతుంటాయి.

గురు పౌర్ణమి వంటి పర్వ దినాల్లో లక్ష మంది వరకూ దర్శనం

ఇక దేశ నలుమూలల నుంచి షిరిడా బస్సులు, ట్రైన్లు, ఇతర టూరిస్టు ప్యాకేజీలు నడుస్తుంటాయి. ఆర్టీసీతో పాటు ప్రైవేటు ట్రావెల్స్ డైలీ సర్వీసులు నడుపుతుంటాయి. రైళ్లు కూడా హైదరాబాద్ నుంచి విరివిగానే నడుస్తుంటాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ వంటి విమానయాన సంస్థలు హైదరాబాద్ నుండి షిరిడీకి విత్ నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ.. నాన్‌స్టాప్ విమానాలను నడుపుతున్నాయి. ఈ ధరలు రూ. 4500 నుంచి రూ. 7500 వరకూ ఉంటాయి. ఇక ట్రైన్లలో రూ. 400 నుంచి రూ. 1500 వరకూ ఆయా క్లాసులను బట్టీ టికెట్టు ధరలుంటాయి. ఇక ప్రైవేటు బస్సు టికెట్టు ధలు రూ. 700 నుంచి 11వందల వరకూ ఉంటాయి. హైదరాబాద్ నుంచి షిరిడీ కి బస్సు ప్రయాణం ఎంతో సౌకర్యవంతం. కొందరు ఆపరేటర్లు.. అక్కడ వసతి కూడా ఉచితంగా ఇస్తారు. ఒక రాత్రి ప్రయాణించి ఆ మర్నాడు సాయి దర్శనం చేసుకుని.. తిరిగి అదే బస్సులో సాయంత్రం రిటర్న్ అయిపోవచ్చు.

Related News

Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి తేదీ, పూజా సమయం.. పాటించాల్సిన నియమాలు ఏమిటి ?

Brahma Muhurtham: బ్రహ్మ ముహూర్తంలో ఈ నాలుగు పనులు చేయడం పూర్తిగా నిషేధం

Palmistry: అరచేతుల్లో ఈ మూడు గుర్తులు ఉంటే చాలు, జీవితంలో డబ్బుకు లోటే ఉండదు

Karthika Masam 2025 : కార్తీక మాసంలో.. ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు

Karthika Masam 2025: కార్తీక మాసంలో.. ఉసిరి దీపం ఎందుకు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఇవి దానం చేస్తే.. జన్మజన్మల పుణ్యం

God Photos: మీ మొబైల్ స్క్రీన్ పై దేవుని ఫోటోలు పెట్టవచ్చా? ఎలాంటివి పెట్టకూడదు?

Good Luck: మీకు అదృష్టం కలిసొచ్చే ముందు కనిపించే నాలుగు శుభ సంకేతాలు ఇవే

Big Stories

×