Janasena Party Glass Symbol: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ జయకేతనం ఎగురవేసింది. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొంది రికార్డు సృష్టించింది. 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో తిరుగులేని విజయం సాధించింది. టీడీపీ,బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి విజయ దుందుభి ఎగురవేసింది. ఇక్కడినుంచి పోటీ చేసిన అభ్యర్థులకు భారీ మెజార్టీ వరించింది. పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70వేల మెజార్టీతో గెలుపొంది సూపర్ హిట్ అయ్యారు. ఇక, మచిలీపట్నం నుంచి బాలశౌరి 2.2లక్షలు..కాకినాడ నుంచి ఉదయ్ శ్రీరామ్ 2.29లక్షల మెజార్టీతో గెలుపొందారు.
మరోసారి తెరపైకి..
ఎన్నికల్లో జనసేనకు వందశాతం గెలుపు రావడంతో పార్టీ గుర్తు ‘గాజు గ్లాసు’ మరోసారి తెరపైకి వచ్చింది. త్వరలో ‘గాజు గ్లాసు’ గుర్తుపై ఈసీ గుడ్ న్యూస్ చెప్పనుంది. జనసేన పార్టీకి ‘గాజు గ్లాసు’ గుర్తును శాశ్వతంగా కేటాయించనుంది. అయితే శాశ్వతంగా ఏ పార్టీకైనా గుర్తు రావాలంటే.. అసెంబ్లీతోపాటు పార్లమెంట్ ఎన్నికల్లో 6 శాతం ఓట్లు రావాల్సి ఉంటుంది. అదే విధంగా ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక్క ఎంపీ సీటు కూడా గెలవాల్సి ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలు దక్కించుకోవడంతో ‘గాజు గ్లాసు’ గుర్తు టెన్షన్ ఉండదని తేలింది. దీంతో జనసేన అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా, త్వరలోనే ఈసీ ఈ గుర్తుపై ప్రకటన చేసే అవకాశం ఉంది.
Also Read: కేఏపాల్ కొత్త పలుకులు, జగన్, పవన్ ఇంకా షాక్‌లోనే
అసలేం జరిగింది..?
జనసేన పార్టీ గత ఎన్నికల్లో ‘గాజు గ్లాసు’ గుర్తుపై పోటీ చేసి అంతగా ప్రభావం చచూపలేకపోయింది. దీంతో ఈసీ ‘గాజు గ్లాసు’ను జనరల్ కేటగిరీలో ఉంచింది. ఈ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేయని స్థానాల్లో ‘గాజు గ్లాసు’ గుర్తును ఫ్రీ సింబల్ చేసింది. అయితే జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడంతో సింబల్‌కు సంబంధించిన ఇబ్బందులు తొలగనున్నాయి. ఈ ఎన్నికల్లో 28,76,208 ఓట్లను జనసేన పార్టీ సొంతం చేసుకోవడంతో 8.53 శాతం ఓట్లను దక్కించుకుంది. దీంతో జనసేన పార్టీకి ఈసీ ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయించడం ఖాయమని తెలుస్తోంది. అయితే జనసేన పార్టీ స్థాపించి పదేళ్లు అయినప్పటికీ.. రిజస్టర్ రాజకీయ పార్టీ హోదాలో ఉండేది. కానీ ఇప్పుడు అఖండ విజయంతో జనసేన పార్టీ..ఈసీ గుర్తింపు స్థాయికి చేరింది.