Which Party is Meesala Geetha’s Return Gift Kolagatla VS Aditi: రాజ వంశీకులు ఇలాకా విజయనగరంలో ఎన్నికల సమరం ముగిసింది. విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచేదెవరన్నది అందరిలో ఉత్కంఠ రేపుతుంది. అశోక్‌గజపతిరాజుకు పెట్టని కోట లాంటి అక్కడ ఆయన కుమార్తె అదితి గజపతిరాజు రెండో సారి పోటీ చేశారు. పోటీ చేసిన మొదటి సారి ఓడిపోయిన అదితి ఈ సారి గెలుపు కిరీటం తనదే అన్న ధీమాతో కనిపిస్తున్నారు. పోటీకి దూరంగా ఉన్న అశోక్ గజపతి తన వారసురాలి విజయం కోసం ప్రచారంలో పెద్దగా కనిపించకపోయినా తెరవెనుక మంత్రాంగం గట్టిగానే నడిపారంట. మరో వైపు డిప్యూటీ స్పీకర్ , సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి కూడా ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాంతో అక్కడ గెలుపుగుర్రం ఎక్కేదెవరన్నది ఆసక్తికరంగా మారింది.
విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్లో గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్కంఠభరిత పోరు జరిగింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజుకి ఈ నియోజకవర్గం పెట్టని కోట లాంటిదని చెప్పవచ్చు. ఎంపీగా పోటీ చేసినా, ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నా ఆయన గెలుపు నల్లేరు మీద నడకలా సాగేది. కెరీర్ మొత్తమ్మీద ఆయన ఒకేఒక్క సారి స్వల్ప తేడాతో ఓడినప్పటికీ అక్కడి ప్రజలకు ఆయనంటే ఎనలేని అభిమానం. మా రాజు గారు అని గర్వంగా చెప్పుకుంటారు.
అయితే వారసురాలు అదితి గజపతిరాజు రంగంలో దిగిన తరువాత పరిస్థితులు మారాయి. పోటీ చేసిన మొదటిసారే అదితి ఓటమి చవిచూశారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆమెపై వైసీపీ నుంచి గెలుపొందిన కోలగట్ల వీరభద్రస్వామికి జగన్ డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టారు. ఈ సారి కూడా అదితి, కోలగట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఇరుపక్షాలూ విజయం కోసం సర్వశక్తులు ఒడ్డాయి.
Also Read: అద్దంకి ఎవరి కైవసం? గొట్టిపాటికి ఈసారి వైసీపీ చెక్ పెడుతుందా..
గత ఎన్నికల్లో కోలగట్ల చేతిలో ఓటమి చవిచూసిన అదితికి ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. అశోక్ గజపతిరాజు వయోభారం, ఆరోగ్య సమస్యలు దృష్ట్యా ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఎంపీగా కాకపోతే కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేయమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎంత ఒత్తిడి తెచ్చినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. అదితిని రెండో సారి ఎన్నికల బరిలో దింపి ఇక తన రాజకీయ వారసురాలు కుమార్తే అని స్పష్టం చేశారు. ఆరోగ్య కారణాలతో అశోక్ గజపతి ఎన్నికల ప్రచారంలో కూడా చురుగ్గా కనిపించలేదు. అయితే ఈ ఎన్నికలు అశోక్‌కు కూడా ప్రతిష్టాత్మకమే కావడంతో.. తెర వెనుక మంత్రాంగం గట్టిగానే నడిపించారంట.
గత ఎన్నికల్లో అదితి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. కోలగట్ల 6 వేల 400 ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆ ఎన్నికల్లో.. జనసేన 7 వేలకు పైగా ఓట్లు చీల్చుకోవడం టీడీపీకి మైనస్ అయింది. ఇప్పుడు కూడా ఫలితం ప్రతికూలమైతే వారసురాలు అదితి రాజకీయ భవితవ్యం ప్రశ్నర్థకంగా మారడంతో పాటు , నాలుగు దశాబ్దాలుగా ఒంటి చేత్తో శాసిస్తున్న జిల్లా పార్టీపై పట్టు సడలుతుంది. ఒకవేళ విజయం సాధిస్తే పూసపాటి గజపతిరాజు కోట పెత్తనానికి ఢోకా ఉండదు. అలాగే అదితి రాజకీయ పునాది పటిష్టం చేసుకునేందుకు వీలవుతుంది. అందుకే తెలుగు తమ్ముళ్ళు రాజ కుటుంబం కోసం విశేష కృషి చేసారంటున్నారు. మరోవైపు జనసైనికులు, వీరమహిళలు అదితి విజయానికి పాటు పడటంతో రాజుగారి శిబిరం ధీమాగా కనిపిస్తుంది
డిప్యూటీ స్పీకర్ కోలగట్లకు కూడా ఈ ఎన్నికలు లైఫ్ అండ్ డెత్ సమస్యే అంటున్నారు. ఫలితంలో తేడా వస్తే కొలగట్ల రాజకీయ కుటుంబ కథా చిత్రం ముగిసినట్లే.. ఆయన అనుచరులపై గత కొన్నేళ్లుగా వస్తున్న అవినీతి, భూ కబ్జా ఆరోపణలకు మూల్యం చెల్లించుకొక తప్పదు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన కోలగట్ల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన దగ్గర నుండి దూకుడు పెంచారు. అనుభవాన్ని రంగరించి ఏ చిన్న అవకాశాన్నీ విడిచిపెట్టలేదు. అన్ని వర్గాలతో మీటింగులు ఏర్పాటు చేసుకున్నారు. ఏం కావాలో కనుక్కుని మరీ వరాలు ప్రకటించారు.
Also Read: ఏపీ సీఎంని డిసైడ్ చేసే ఉరవకొండలో గెలుపెవరిదంటే..
ఇవే తనకి చివరి ఎన్నికలని కోలగట్ల సెంటిమెంట్ అస్త్రం కూడా ప్రయోగించారు. గెలుపుతో హుందాగా రాజకీయాల నుండి తప్పుకోవాలనుకుంటున్నానని వేడుకున్నారు. పట్టణపరిధిలో దూరమైన కొన్నివర్గాలను బుజ్జగింపులతో దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ప్రారంభంలో కోలగట్లకు వ్యతిరేకంగా టాక్ నడిచినా పోలింగ్ సమయానికి పరిస్థితుల్లో మార్పు కనిపించిందన్న అభిప్రాయం వ్యక్తం అయింది.. దాంతో ఇక్కడి ఫలితంపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఎవరు గెలిచినా స్వల్ప మార్జిన్‌తోనే అన్న చర్చ నడుస్తోంది.
ఇరు పార్టీల నాయకులు మాత్రం గెలుపు మాదంటే మాదేనంటూ జోరుగా బెట్టింగులు వేస్తున్నారు. గెలుపుపై పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అయితే టీడీపీ మాజీ ఎమ్మెల్యే , ఇండిపెండెంట్ అభ్యర్థి మీసాల గీత ప్రభావాన్ని బట్టి అదితి, కోలగట్లల గెలుపోటములు ఆధారపడి ఉంటాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆమె ఎన్ని ఓట్లు సాధిస్తుంది అనే దానిపై కూడా బెట్టింగులు సాగుతున్నాయంటే ప్రభావాన్ని ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.