Proddatur Assembly Constituency updates(Andhra politics news): సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసి.. రిజల్ట్స్ డేట్ దగ్గరపడింది. వైసీపీ, ఎన్డీయే కూటమి మధ్య యుద్ధంలా సాగిన ఈ ఎన్నికల్లో కడప జిల్లాలో చెదురుమదురు ఘటనల మధ్య పోలింగ్ ముగిసింది. గత ఎన్నికల్లోఉమ్మడి జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో మాత్రం వైసీపీకి ఎదురుగాలి తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కనీసం ఐదుచోట్ల వైసీపీకి భంగపాటు తప్పదని అంటున్నారు విశ్లేషకులు ఇందులో ప్రొద్దుటూరు ముందువరుసలో ఉందని పోలింగ్ సరళిని బట్టి అంచనాలు వేస్తున్నారు.
ప్రొద్దుటూరులో టీడీపీ అభ్యర్ధిని ప్రకటించక ముందునుంచే పెద్దాయన వరదరాజులరెడ్డికి టిక్కెట్టు వస్తే గెలుపు ఖాయం అనే ప్రచారం పెద్దఎత్తున జరిగింది. అందులో భాగంగా చంద్రబాబునాయుడు కూడా ప్రొద్దుటూరులో టీడీపీ టికెట్టు రేసులో నలుగురు ఉన్నప్పటికీ సర్వేల ఆధారంగా పెద్దాయనకే టికెట్టు ప్రకటించారు. టికెట్టు ప్రకటించక ముందునుంచే ఆయన పార్టీ కార్యక్రమాలను చురుకుగా ముందుకు తీసుకువెళ్లారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీతో పాటు ఇతర పార్టీ కార్యక్రమాలను చేపట్టారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అక్రమాలపై కూడా ప్రత్యక్ష పోరాటం చేశారు. దీంతో రాచమల్లుకు పెద్దాయనే సాటి అని.. శిష్యుడి దూకుడుకు గురువే ముకుతాడు వేయగలరన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమైంది.
ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ఆయన కుటుంబ సభ్యులు గత ఐదేళ్లలో సాగించిన అరాచకాలు, దౌర్జన్యాలు, భూదందాలపై ఆరోపణలు పెద్దఎత్తున్న వినిపిస్తున్నాయి. ఫ్యాక్షన్ సద్దుమణిగి దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న ప్రొద్దుటూరులో తిరిగి పాత రోజులు రావడం.. ఎవరూ ధైర్యం చేసి వారి అరాచకాలను ప్రశ్నించలేని వాతావరణం ఏర్పడిందంటున్నారు. దీంతో పెద్దాయన వరదరాజులరెడ్డి రావాలని రాచమల్లును దీటుగా ఎదుర్కోగల సత్తా ఆయనకే ఉందని టిడిపి అధిష్టానం భావించింది. పదేళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డిపై సహజంగానే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది… అయితే మొదటిసారి ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు వైసీపీ అధికారంలో లేదు. అందువల్ల ఆయన అభివృద్ధి చేయలేక పోయారని ప్రజలు భావించారు.
అయితే రెండోసారి భారీ మెజార్టీతో రాచమల్లుకు ప్రజలు పట్టం కట్టారు. ఆయన గెలిచి, వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ క్రమంలో బీసీ వార్డుల్లో ముఖ్యంగా చేనేతల వార్డులలో ఆ సామాజిక వర్గాలు ఓట్లు వేయలేదని రాచమల్లు వారిని వేధించారంట. బీసీలు, చేనేతలు ఓట్లు వేయకుంటే అంత మెజార్టీతో ఆయన గెలిచేవాడా అని ప్రజలు అప్పట్లో చర్చించుకున్నారు. రాచమల్లు రెండవ సారి తనను గెలిపిస్తే.. జగన్ మంత్రి పదవి ఇచ్చినా త్యాగం చేసి ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం ఏడాదికి500 కోట్ల వంతున ఐదేళ్లలో 2500 కోట్ల నిధులు తెచ్చి ప్రొద్దుటూరు రూపురేఖలే మార్చుతానని లేకుంటే వచ్చే ఎన్నికల్లో ముఖం చూపించనని అప్పట్లో హామీ ఇచ్చారు.
Also Read: విజయనగరంలో ఉత్కంఠపోరు.. మీసాల గీత రిటర్న్ గిఫ్ట్ ఏ పార్టీకి?
కానీ ఐదేళ్లలో ఆయన చేసింది శూన్యమన్న విమర్శలున్నాయి. అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన చేసినా.. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. పేదలకు రెండు సెంట్ల స్థలం, ఉచితంగా ఇల్లు నిర్మించి ఇచ్చే హమీని కూడా రాచమల్లు నెరవేర్చలేకపోయారు. నివాసానికి పనికిరాని భూములలో సెంటు స్థలం ఇచ్చి అదే గొప్ప అనే రీతిలో ప్రచారం చేసుకున్నారు. ఆయన ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదని ఆ నియోజకవర్గ ప్రజలు గుర్రుగా ఉన్నారట. కేవలం గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు అయిన అమృత్ స్కీం ఈ ప్రభుత్వంలో పూర్తయింది. దీంతో ఈ పర్యాయం రాచమల్లుకు భంగపాటు తప్పదనే ప్రచారం పెద్దగానే సాగుతోంది.
హ్యాట్రిక్ విజయం సాధించాలన్న పట్టుదలతో రాచమల్లు సర్వశక్తులు ఒడ్డి పోరాడారు. కులాల వారీగా ఆత్మీయ సమావేశాలు, భారీగా విందు భోజనాలు పెట్టి హామీలను గుప్పించారు. పకడ్బందీగా ప్రచారంతో పాటు ఎలక్షన్లో డబ్బుల ను విచ్చలవిడిగా ఖర్చుచేశారు. ఓట్లకు ప్రతిపక్షాల కంటే అధికంగా డబ్బులు పంచారు. ఆ పంపకాలే గెలిపిస్తాయని ఆయన ధీమాతో ఉన్నారంట .. మహిళలు అధికంగా ఓటింగ్లో పాల్గొనడంతో.. జగన్ పథకాల వల్లే పడ్డాయని భావిస్తున్నారట. అయితే గతంలో లా మోజారిటీపై కాకుండా గెలుపుపై మాత్రమే కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారంట.
వరద వర్గం మాత్రం గెలుపుపై పూర్తి స్థాయి ధీమాతో కనిపిస్తుంది. స్వల్ప మెజారిటీతో అయినా గట్టెక్కుతామని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. 2019 ఎన్నికల కంటే రెండు శాతం ఓటింగ్ పెరగడం, మహిళా ఓటర్లు పురుషులకంటే ఏడువేల మంది అధికంగా ఓటింగ్లో పాల్గొనడంతో పోలింగ్ సరళిపై పెద్ద చర్చే జరుగుతుంది. మహిళా ఓటర్లు చంద్రబాబు పథకాలకు స్పందించారని అంటున్నారు. రూ.4వేలకు పెన్షన్ పెంపు, 18ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1500 చేస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలపై మహిళలు ఆసక్తిగా ఉన్నారని చెప్తున్నారు. గ్రామాల్లో ఓటింగ్ శాతం పెరగటం.. టీడీపీకి పలు గ్రామాల్లో పట్టు ఉండటంతో అది తమకే లాభిస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి చూడాలి అక్కడ గెలుపెవరిదో?