Big Stories

Social Media Campaign: నయా ట్రెండ్.. ఇక అంతా సోషల్ మీడియానే!

Social Media Campaign: ఎన్నికల్లో గెలవాలంటే.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి. వారిని పోలింగ్‌ బూత్‌లకు రప్పించాలి. ఓటు వేసేలా చేయాలి.. ఇవన్ని జరగాలంటే ముమ్మరంగా ప్రచారం చేయాలి. రోడ్‌ షోలు, బహిరంగసభలు, ర్యాలీలు, కార్నర్‌ మీటింగ్‌లు.. ఇలా నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారిని పలకరిస్తూ విజ్ఞప్తి చేస్తూ ముందుకు సాగాలి. ఈసారి కూడా ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్‌ విడుదల చేసింది మొదలు నేతలు రోడ్లపై పడ్డారు. కానీ ఈసారి గతం కంటే కాస్త డిఫరెంట్‌గా ఉంది సీన్.

- Advertisement -

ఎన్నికల ప్రచారం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. ఒకప్పుడు సభలు సమావేశాలకే పరిమితమైన ప్రచారం, ఇప్పుడు సోషల్ మీడియాకు కూడా విస్తరించింది. ఎందుకంటే విషయం ఏదైనా ప్రజలను చాలా ఫాస్ట్‌గా రీచ్ అవ్వాలంటే సోషల్ మీడియాను మించినది లేదు. అందుకే అఫిషియల్‌గానైనా.. అనఫిషియల్‌గానైనా.. తమను తాము ప్రమోట్ చేసుకునే పనిలో ఉన్నాయి పార్టీలు. ఇప్పుడు ప్రతి పార్టీ కూడా సోషల్ మీడియా వింగ్‌ను ఏర్పాటు చేసుకుంటుంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో జోరుగా ప్రచారం చేస్తున్నాయి పార్టీలు.

- Advertisement -

అయితే బహిరంగసభల్లో ఉన్నట్టుగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఉంటే సోషల్ మీడియాలో నడవదు. కొడితే ఏనుగు కుంభస్థలం అన్నట్టుగా.. మనం చెప్పాలనుకున్నది ఏంటో సూటిగా.. సుత్తి లేకుండా.. 30 నుంచి 60 సెకండ్లలో చెప్పేయాలి. రీల్స్‌తో పాటు మీమ్స్.. స్పెషల్ సాంగ్స్.. సీరియస్ ఇంటర్వ్యూస్.. సెటైరికల్ ఇంటర్వ్యూస్.. ఇలా రకరకాలుగా పార్టీలు ప్రజలను తమవైపు తిప్పుకోవడానికో లేదా ప్రత్యర్థి పార్టీని బదనాం చేయడానికో పనిచేస్తున్నాయి పార్టీల సోషల్ మీడియా వింగ్స్.

నేతలు తమ పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్‌, పార్టీల అఫిషియల్ అకౌంట్స్‌తో పాటు ఆర్మీస్‌, ఫ్యాన్ మేడ్ హ్యాండిల్స్ అంటూ ఇంకా చాలానే మెయింటేన్ చేస్తున్నాయి. మీరు కాస్త కీన్‌గా అబ్జర్వ్ చేస్తే.. ఎప్పుడు మూవీ డైలాగ్స్‌, ఫన్నీ సీన్ల ఫొటోలతో మీమ్స్‌ వేసే అకౌంట్స్ కూడా కొన్ని రోజులుగా పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ఫలానా పేజీ ఫలానా రాజకీయ పార్టీకి.. వకాల్తా పుచ్చుకుని మరీ పోస్టింగ్‌లు చేస్తున్నాయి. పార్టీల మేనిఫెస్టోలను కూడా సోషల్‌ మీడియా పేజీల్లో కనిపిస్తున్నాయి.

అయితే పార్టీలు సోషల్ మీడియా ప్రమోషన్ కోసం చాలా పెద్ద నెట్‌వర్క్‌నే కనిపిస్తున్నాయి. కంటెంట్ క్రియేషన్, కంటెంట్ ప్రమోషన్‌ అండ్ ట్రెండింగ్, సోషల్ మీడియా సెంటిమెంట్ అనాలసిస్.. ఇలా రకరకాలుగా మెయింటేన్ చేస్తున్నారు. అందుకే ఓటర్స్‌ను ఆకట్టుకునేలా.. ఆలోచింపజేసి తమకు అనుకూలంగా మార్చేలా కంటెంట్‌ను క్రియేట్ చేయడం, వాటిని సక్సెస్‌ఫుల్‌గా ప్రజలకు రీచ్‌ అయ్యేలా చేస్తున్నారు.

నిజానికి సోషల్‌ మీడియా అనేది బయటికి కనిపించని డిజిటల్‌ ప్రపంచం.. అందులో మనం పోస్ట్‌ చేస్తున్న, వైరల్‌ చేస్తున్న కంటెంట్‌ ఎంత వరకు టార్గెట్‌ ఓటర్లకు చేరుతుంది? ఒకవేళ చేరకపోతే ఎందుకు చేరడం లేదు? అనే విషయాలను అనాలసిస్ చేసే వారిని సోషల్‌ మీడియా సెంటిమెంట్‌ అనలిస్ట్‌గా చెప్పొచ్చు. ఇలా ప్రతి పార్టీ ఇలాంటి సెటప్‌ను ఏర్పాటు చేసుకొని ప్రస్తుతం ప్రచారాలు చేస్తున్నాయి. ఇలా రెడీ చేసిన కంటెంట్‌ను గూగుల్‌ యాడ్‌ సెన్స్‌లోనూ డబ్బులు చెల్లించి ఫేస్‌బుక్‌ లింక్, యూట్యూబ్‌ లింక్, ఇన్‌స్ట్రాగామ్‌ లింక్‌ అందులో షేర్‌ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పలానా పార్టీ గురించి మనం సెర్చ్‌ చేయాలనుకున్నప్పుడు.. ఆ వర్డ్ టైప్ చేయగానే.. ప్రమోట్‌ చేయాలనుకున్న లింక్‌లు హైలెట్‌ అవుతాయి. దీన్నే గూగుల్‌ యాడ్‌ సెన్స్‌ అంటారు. ఇప్పుడీ ట్రెండ్‌ కూడా నడుస్తుంది. ఇలా పర్సనల్‌గా.. యాడ్స్‌ ద్వారా సోషల్ మీడియాలో ప్రచారాన్ని దుమ్ము దులుపుతున్నాయి పార్టీలు.

ప్రస్తుతం ప్రచారం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు జోరు పెంచాయి. బహిరంగసభలు, రోడ్‌షోలను పెంచాయి. ఎట్ ది సేమ్ టైమ్.. సోషల్ మీడియాలో కూడా ప్రచార ఊపు పెరిగినట్టు కనిపిస్తుంది. కావాలంటే చూడండి.. మీకు కూడా సోషల్ మీడియాలో నోటిఫికేషన్స్‌తో పాటు చత్తీస్‌గఢ్‌, ఛండీఘర్‌ కేంద్రంగా ఉన్న నెంబర్లు ద్వారా ఎక్కువగా ఫోన్స్ వస్తుంటాయి.

Also Read: వైసీపీ కి గొట్టిపాటి గట్టి షాక్!

నిజానికి మీడియా మానిటిరింగ్‌ కమిటీ పేరుతో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌మీడియాపై అనేక ఆంక్షలు అమలు చేస్తుంది ఎలక్షన్ కమిషన్ కానీ సోషల్‌ మీడియాపై ఎలాంటి కంట్రోల్‌ లేదు.. అందుకే అభ్యర్థులు తమ ప్రచారం అంతా సోషల్‌ మీడియాలో ఎక్కువగా చేసుకుంటున్నారు. ఇందుకోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు కూడా అంతేకాదు మీడియాలో ఎడ్వటెజ్‌మెంట్లపై ఆంక్షలు విధించించిన ఎన్నికల కమిషన్‌, సోషల్‌ మీడియాలో కుప్పలు కుప్పలుగా ఎడ్వటెజ్‌మెంట్లు వేస్తున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఓవరాల్‌గా చూస్తే ఈసారి ఎన్నికలను మలుపు తిప్పేది సోషల్ మీడియానే అనేది క్లియర్‌ కట్‌గా అర్థమవుతుంది. భాష ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు అనేది సినిమా డైలాగ్.. కానీ నేతలు ఒక్కసారి మాట్లాడితే.. వందసార్లు చూపించడం అనేది సోషల్‌ మీడియా మనకు చెప్పకనే చెబుతున్న డైలాగ్.. అందుకే పార్టీలు బహిరంగంగానే కాదు.. ఈ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా భీకర యుద్ధం చేస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News