12Th Fail : ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు అనుకోకుండా ఇండస్ట్రీకి దూరం అవుతూ అభిమానులకు నిరాశ మిగులుస్తున్నారు. ముఖ్యంగా అవకాశాలు రావడం లేదా అంటే కొంతమందికి అవునని చెప్పాలి.. మరి కొంతమంది వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే సడన్గా ఇండస్ట్రీకి దూరం అవుతారు. కారణాలు అడిగితే మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాస్సే(Vikranth Massey) కూడా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. 12త్ ఫెయిల్ సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ తన నటనకు తాత్కాలిక రిటైర్మెంట్ ఇస్తున్నట్లు తెలిపారు.
వచ్చే ఏడాది నుంచి ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక పోస్ట్ కూడా షేర్ చేశారు విక్రాంత్. 2025 తర్వాత నటన నుంచి విశ్రాంతి తీసుకుంటానని ప్రకటించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో నాకు మంచి విజయాలు దక్కాయి. ఇక నా కెరియర్ కు, నా సక్సెస్ కి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ విక్రాంత్ తెలిపారు. ఇకపోతే సినిమాల నుంచి తాత్కాలికంగా రిటైర్మెంట్ తీసుకోవడంపై ఇండస్ట్రీతో పాటు అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు విక్రాంత్ షేర్ చేసిన పోస్ట్ చదివి చాలామంది అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
పోస్ట్ తో అభిమానులను ఆశ్చర్యపరిచిన విక్రాంత్..
ఇకపోతే తన పోస్టులో తనకు చివరి రెండు సినిమాలు ఉన్నాయని, అవి చాలా జ్ఞాపకాలు మిగిల్చాయని తెలిపారు. ఇకపోతే తాజా ప్రాజెక్టు ది సబర్మతి రిపోర్ట్ విడుదలైన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI -2024) లో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకోవడం జరిగింది. ఇకపోతే ఇంస్టాగ్రామ్ లో.. “హలో.. అందరూ నా విన్నపం మన్నిస్తారని కోరుకుంటున్నాను. గత కొన్ని సంవత్సరాలు అంతకుమించి అద్భుతంగా సాగాయి. చెరగని మద్దతు నాకోసం ఇచ్చినందుకు మీలో ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కానీ నేను ముందుకు సాగుతున్నప్పుడు ఇది రీకాలిబ్రేట్ చేసి, ఇంటికి తిరిగి వెళ్ళవలసిన సమయం అని నేను గ్రహించాను” అంటూ తన పోస్టులో తెలిపారు.
విక్రాంత్ మాస్సే కెరియర్..
నటుడు విక్రాంత్ మాస్సే విషయానికి వస్తే.. 12 త్ ఫెయిల్ లో దర్శకుడు విధు వినోద్ చోప్రా తో కలిసి గత ఏడాది భారీ విజయాన్ని అందుకున్నారు. ఇందులో విక్రాంత్ ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా, ది సబర్మతి రిపోర్టు విడుదల అవ్వగా సబర్మతి రిపోర్ట్ సినిమా తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా నుండి కూడా ప్రశంసలు అందుకున్నారు. గోద్రా రైలు ఘటనలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించడం జరిగింది. మొత్తానికైతే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన విక్రాంత్ సడన్ గా ఇండస్ట్రీకి దూరం అవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి ఎందుకు ఈ సడన్ నిర్ణయం తీసుకున్నారో తెలియాల్సి ఉంది.