Aishwarya Rajesh:ఇండస్ట్రీలో అవకాశాలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయి అనే విషయం ఎవరికీ తెలియదు. ఒక్కోసారి వరుస పరాజయాలు ఎదురైనా కూడా అవకాశాలు వస్తూనే ఉంటాయి. కానీ, కొన్నిసార్లు హిట్ పడినా కూడా వారికి అవకాశాలు అందవు. తాజాగా రెండో క్యాటగిరీలోకి చేరింది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. తెలుగువారి ఆడబిడ్డ అయినా సరే కోలీవుడ్లో కెరీర్ ను ప్రారంభించిన ఐశ్వర్య అక్కడ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇంట గెలవకుండానే రచ్చ గెలిచి చూపించింది.
ఏ నటుడుకైనా, నటికైనా కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ అంటే ఎన్నేళ్లు అయినా ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక చిత్రం ఉంటుంది. అలాంటి సినిమాల్లో ఐశ్వర్య రాజేష్ కెరీర్ లో సంక్రాంతికి వస్తున్నాం ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. భాగ్యం క్యారెక్టర్ లో ఐశ్వర్యను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేం అని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్లుగా ఐశ్వర్య తెలుగులో పాతుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
తమిళ్ లో ఆమె స్టార్ హీరోయిన్ కొనసాగుతున్నా తెలుగులో మాత్రం అంతగా గుర్తింపును తెచ్చుకోలేకపోయింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అమ్మడు ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా.. అందులో నటించిన నటీనటులందరికీ పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ఐశ్వర్య రాజేష్ కు అవకాశాలు వెల్లువెత్తుతాయి అని అనుకున్నారు. కానీ, అదేమీ జరగకపోవడం బాధాకరం. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తమిళ్ లో మూడు సినిమాలను లైన్లో పెట్టింది. ఇది కాకుండా ఒక కన్నడ సినిమాలో నటిస్తుంది. మిగతా భాషల్లో బిజీగా ఉన్న ఐశ్వర్యకు తెలుగులో మాత్రం ఇంకో అవకాశం వచ్చింది లేద.
అయితే దీనికి కారణం కూడా లేకపోలేదని చెప్పొచ్చు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నలుగురు పిల్లలకు తల్లిగా చేయడం అనేది ఆమెకు మైనస్ గా మారిందని అంటున్నారు. మొదట అనిల్ రావిపూడి ఈ పాత్ర కోసం నలుగురు స్టార్ హీరోయిన్లను కలిశానని, వారెవరు ఈ పాత్రకు ఓకే చెప్పలేదని.. చివరగా ఐశ్వర్య రాజేష్ దగ్గరకు వెళితే తనకు పాత్ర బాగా నచ్చిందని, తన కెరీర్ కు ఈ సినిమా ఎంతో ఉపయోగపడుతుందని నమ్మి భాగ్యం పాత్ర చేసినట్లు చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు అదే పాత్ర ఆమెకు అవకాశాలు రాకుండా చేస్తుందని మాట వినిపిస్తుంది.
నలుగురు పిల్లల తల్లిగా చేసిన తర్వాత హీరోలతో రొమాన్స్ చేసిన కూడా ప్రేక్షకులు ఆమెను భాగ్యం పాత్రలోనే చూస్తారని, అందుకే గ్లామర్ పాత్రలను ఇవ్వడానికి నిర్మాతలు భయపడుతున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు ఐశ్వర్య తెలుగులో మరో సినిమాను ప్రకటించింది లేదు. దీంతో ఇండస్ట్రీ హిట్ పడినా కూడా ఐశ్వర్య కు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. మరి ముందు ముందు ఐశ్వర్య కు తెలుగులో అవకాశాలు వస్తాయా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.