Akkineni Amala : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswar Rao) వారసత్వాన్ని కొనసాగిస్తూ అక్కినేని నాగార్జున (Akkineni) మంచి హీరోగా సెటిల్ అయిపోయారు. సీనియర్ స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న ఈయన, ప్రస్తుతం బిగ్ బాస్ వంటి రియాల్టీ షోలకి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు ఒకవైపు వ్యాపార రంగాలలో పెట్టుబడులు పెడితూ.. మరొకవైపు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ తమ ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు. ఇదిలా ఉండగా అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) త్వరలో మరోసారి ఏడడుగులు వేయబోతున్నారు.
సమంతతో బ్రేకప్.. శోభితతో డేటింగ్..
‘ఏ మాయ చేసావే’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సమంత (Samantha) తో ప్రేమలో పడ్డారు నాగచైతన్య. ఆమెతో దాదాపు ఏడేళ్లపాటు ప్రేమాయణం సాగించారు. 2017లో పెద్దలను ఒప్పించి వివాహం కూడా చేసుకున్నారు. టాలీవుడ్ లో క్యూట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న వీరు, జంటగా సినిమాలు కూడా చేశారు. అయితే అనూహ్యంగా 2021 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇకపోతే నాగచైతన్య, శోభితా ధూళిపాళ్లతో 2022లో ప్రేమలో పడి, ఈ ఏడాది ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్ 4వ తేదీన ఈ జంట పెళ్లి పేరుతో ఒక్కటి కాబోతోంది.
పెళ్లికి సిద్ధమైన నాగచైతన్య – శోభిత..
ఇప్పటికే పెళ్లి పనులు దాదాపు ప్రారంభం అయిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా శోభిత ఇంట్లో సాంప్రదాయంగా పెళ్లికి ముందు జరిగే గోధుమ రాయి, పసుపు దంచడం వంటి కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అంతేకాదు అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేసి అటు నాగచైతన్య, ఇటు శోభిత ఇద్దరికీ కూడా ఘనంగా మంగళ స్నానాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తమ ఇంటికి రాబోయే కొత్త కోడలు గురించి చెబుతూ అందరిని ఆశ్చర్యపరిచారు అక్కినేని అమల (Akkineni Amala).
కాబోయే కోడలిపై అక్కినేని అమల ప్రశంస..
ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో పాల్గొన్న అక్కినేని అమల, తాజాగా ఒక ప్రముఖ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాబోయే కోడలు గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంటర్వ్యూలో భాగంగా మీరు మీ కొత్త కోడలికి ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అమల మాట్లాడుతూ.. “శోభిత చాలా టాలెంటెడ్. చాలా మెచ్యూర్డ్ మహిళ. ఆ అమ్మాయికి నేను సలహా అంటూ ప్రత్యేకంగా ఏమీ ఇవ్వాల్సిన పనిలేదు. ఆమె తప్పకుండా ఒక మంచి భార్యగా మంచి జీవితాన్ని ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీ పాఠకులు కూడా కొత్త జంట భవిష్యత్తు బాగుండాలని ఆశీస్సులు ఇవ్వాలని కోరుతున్నాను” అంటూ అమల కోరింది. ఇలా కాబోయే కోడలిపై ప్రశంసలు కురిపించిన ఈమె, గతంలో ఎందుకు సమంతకు ఇలాంటి సపోర్టు ఇవ్వలేదని సమంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మీ ఇంటికి కోడలిగా రాకుండానే, ఆ అమ్మాయిపై ప్రేమ వొలకబోస్తున్నారే, ఇదే ప్రేమ సమంతపై ఎందుకు చూపించలేకపోయారు అంటూ కూడా సమంత అభిమానులు ఫైర్ అవుతూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే అమల శోభిత గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.