తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. అల్లు అర్జున్ (Allu Arjun) కి నాంపల్లి కోర్టులో పెద్ద ఊరట కలిగింది అని తెలుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయిన బన్నీ.. తాజాగా రెగ్యులర్ బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసింది. కానీ కండిషన్స్ తో కూడిన బెయిల్ ఆయనకు లభించింది. కానీ ఇప్పుడు నాంపల్లి కోర్టులో ఈయనకు ఊరట లభించింది. విదేశాలకు వెళ్లడానికి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. అంతేకాదు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలనే నిబంధన నుంచి కోర్టు మినహాయించింది. ఇక ఈ విషయం తెలిసి అటు బన్నీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ కి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
సంధ్య థియేటర్ ఘటనలో జైలుకెళ్లిన బన్నీ..
అసలు విషయంలోకి వెళితే.. అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప 2. గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన సినిమా విడుదల అయ్యింది. అయితే ఒకరోజు ముందుగానే అనగా డిసెంబర్ 4న బెనిఫిట్ షో వేశారు. హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్ కి బన్నీ కూడా తన ఫ్యామిలీతో కలిసి సినిమా చూడ్డానికి వచ్చారు. దాంతో అభిమానులు ఆయనను చూడడానికి ఎగబడగా, తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది. అంతేకాదు ఆమె కొడుకు శ్రీ తేజ్ ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక పోలీసుల అనుమతి నిరాకరించిన బన్నీ ర్యాలీ నిర్వహించుకుంటూ వెళ్లడం వల్లే అక్కడ ఒక మృతికి కారణమయ్యారంటూ ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరు పరచగా.. 14 రోజులపాటు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. వెంటనే హై కోర్ట్ లో క్వాష్ పిటీషన్ వేయగా.. 4వారాల మధ్యంతర బెయిల్ లభించింది. కానీ ఉత్తర్వులు సాయంత్రం ఐదున్నర తర్వాత అందడంతో ఆరోజు రాత్రంతా చంచల్గూడా జైల్లోనే గడిపారు. అయితే ఇటీవలే షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ లభించింది.
షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్..
ముఖ్యంగా బాధితులను ప్రభావితం చేసేలా మాట్లాడకూడదు అని, ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని, పోలీసులు చెప్పిన విషయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు అని, కొన్ని షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ అందించారు. అయితే ఇప్పుడు తాజాగా వాటి నుండి విముక్తి కల్పించింది నాంపల్లి కోర్టు. ఇక అందులో భాగంగానే విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇచ్చి, ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిన అవసరం లేదని కూడా తెలిపింది.
పుష్ప 2 సినిమా విశేషాలు..
అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం పుష్ప 2. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా.. శ్రీ లీల తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది. ఇందులో అనసూయ, సునీల్, ఫహద్ ఫాసిల్, జగపతిబాబు, అజయ్ ఘోస్ లాంటి భారీతారాగణం భాగం అయింది. ఇక ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రూ. 1900 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా.