Anadala Rakshasi: డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi)దర్శకత్వంలో నవీన్ చంద్ర, (Naveen Chandra)రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) నటించిన అందమైన ప్రేమ కథ చిత్రం అందాల రాక్షసి(Anadala Rakshasi). ఈ సినిమా 2012 ఆగస్టు 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పట్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్క డైలాగ్, పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటాయి. ఇలా ఎంతో అద్భుతమైన సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అయితే అప్పట్లో ఈ సినిమాని థియేటర్లో చూడటం మిస్సయిన వారి కోసం తాజాగా ఈ సినిమాని తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
హౌస్ ఫుల్ బోర్డులు…
అందాల రాక్షసి సినిమా జూన్ 13వ తేదీ రీ రిలీజ్ కాగా ఎంతో మంచి ఆదరణ లభించింది. ఇక ఈ సినిమా రీ రిలీజ్ థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులతో కనిపించటం విశేషం. అలాగే ఈ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో హీరోలు నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్ ఇద్దరూ కూడా సంధ్య థియేటర్ కి వెళ్లి అభిమానులతో కలిసి కూర్చొని సినిమా చూడటమే కాకుండా పెద్ద ఎత్తున డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇక ఈ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇలా ఈ సినిమాకు రీ రిలీజ్ సమయంలో కూడా ఎంతో మంచి ఆదరణ లభించిందని చెప్పాలి.
కోట్లలో కలెక్షన్లు..
ఏకంగా 13 సంవత్సరాల తర్వాత ఈ అందమైన ప్రేమకథాచిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చూడటానికి అంతే ఆసక్తి చూపించారు. జూన్ 13వ తేదీ తిరిగి విడుదలైన ఈ సినిమా మొదటి రోజు ఎంత మేర కలెక్షన్లను రాబట్టిందనే విషయాలను చిత్ర బృందం అధికారక పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమా రీ రిలీజ్ అయిన నేపథ్యంలో మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 1.12 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్టు చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు. ఇలా రీ రిలీజ్ సమయంలో కూడా మొదటి రోజు ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికీ కూడా అభిమానులు ఎంతలా ఈ సినిమాని ప్రేమిస్తున్నారో స్పష్టం అవుతుంది.
#AndalaRakshasi re-release crossed 1.12 CRORES+ GROSS on DAY 1 ✨#AndalaRakshasiRerelease #LavanyaTripathi #Tollywood pic.twitter.com/fGPcAQxoEz
— TeluguOne (@Theteluguone) June 14, 2025
ఇక ఈ సినిమా ద్వారా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న లావణ్య ఇందులో నా పెళ్ళికి చిరంజీవి వస్తారా, నాకు పెళ్లి చేసేయండి నాన్న అంటూ చెప్పిన డైలాగులు అప్పట్లో ఫేమస్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో చెప్పినట్టుగా లావణ్య త్రిపాఠి పెళ్లికి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి రావడమే కాకుండా, మెగాస్టార్ చిరంజీవి ఇంటికే ఈమె కోడలుగా వెళ్ళటం విశేషం. ఇక లావణ్య త్రిపాఠి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకొని మెగా ఇంటి కోడలుగా అడుగు పెట్టారు. ఇక పెళ్లి తర్వాత లావణ్య పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.