అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన క్షణాల్లోనే మెడికల్ కాలేజీ మీద కూలిపోయింది. ఈ ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో కలిపి 241 మంది చనిపోయారు. అయితే, 60 ఏళ్ల క్రితం కూడా గుజరాత్ ముఖ్యమంత్రి గాలిలోనే గల్లంతయ్యాడు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో కాదు. పాకిస్తాన్ ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చి వేసింది. ఈ ఘటన 1965 భారత-పాకిస్తాన్ యుద్ధం సమయంలో జరిగింది.
ఇంతకీ ఏం జరిగిందంటే?
1965లో భారత-పాకిస్తాన్ యుద్ధం తారా స్థాయిలో జరుగుతోంది. 25 ఏళ్ల పాకిస్తాన్ ఫ్లయింగ్ ఆఫీసర్ ఖైస్ హుస్సేన్ సాబర్ జెట్‌ను నడుపుతూ భుజ్, తూర్పు సింధ్ సమీపంలో ఆకాశంలో గస్తీ తిరుగుతున్నాడు. ఆయన ఓ పౌర విమానాన్ని గుర్తించాడు. వాళ్ల ఆర్మీ అనుమతితో తన ఫైటర్ జెట్ తో బీచ్ క్రాఫ్ట్ పై ఎటాక్ చేశాడు. శత్రువు నిఘా ఆపరేషన్ ను తాను విఫలం చేశానంటూ హుస్సేన్ కరాచీలోని తన స్థావరానికి తిరిగి వెళ్లాడు. కొన్ని గంటల తర్వాత, గుజరాత్ సీఎం బల్వంత్రాయ్ మెహతా, ఏడుగురు పౌరులతో ప్రయాణిస్తున్న విమానాన్ని పాకిస్తాన్ కూల్చివేసిందని ఆల్ ఇండియా రేడియో ప్రకటించింది. హుస్సేన్ ఒక్కసారిగా షాకయ్యాడు. పంచాయతీ రాజ్ పితామహుడిగా పిలువబడే బల్వంత్రాయ్ మెహతా విమాన ప్రమాదంలో మరణించిన దాదాపు 60 సంవత్సరాల తర్వాత.. ఇప్పుడు ఆ రాష్ట్ర మాజీ సీఎం విజయ్ రూపానీ చనిపోయాడు. 2016- 2021 మధ్య గుజరాత్ సీఎంగా పని చేశారు విజయ్ రూపానీ.
బల్వంత్రాయ్ మెహతా విమాన కూల్చివేత గురించి..
1965 ఆగస్టులో ప్రారంభమైన భారత్- పాక్ యుద్ధం సెప్టెంబర్ నాటికి కీలక దశకు చేరుకుంది. సెప్టెంబర్ 22న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కాల్పుల విరమణకు పిలుపునిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మన దేశం దానిని వెంటనే అంగీకరించింది. పాకిస్తాన్ తన ప్రతి స్పందనను ఆలస్యం చేసింది. ఒక రోజు తర్వాత, సెప్టెంబర్ 23న దానికి అంగీకరించింది. అదే రోజు మధ్యాహ్నం, గుజరాత్ ముఖ్యమంత్రి బల్వంత్రాయ్ మెహతా, తన భార్య సరోజ్ బెన్, ముగ్గురు సహాయకులు, ఇద్దరు జర్నలిస్టులతో కలిసి మొత్తం 8 మంది కచ్ గల్ఫ్ సమీపంలోని మిథాపూర్‌కు వెళ్తున్నారు. ఎనిమిది సీట్ల బీచ్‌క్రాఫ్ట్ విమానాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన పైలట్, భారత వైమానిక దళం, రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో అనుభవజ్ఞుడైన జహంగీర్ ఇంజనీర్ నడిపారు. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఫ్లయింగ్ ఆఫీసర్ ఖైస్ హుస్సేన్, యుఎస్ నిర్మిత F-86 సాబర్ ఫైటర్ జెట్ లో ఫ్లైట్ లెఫ్టినెంట్ బుఖారీతో పాటు కరాచీ సమీపంలోని మౌరిపూర్ ఎయిర్‌బేస్ నుండి బయల్దేరారు. ఇంధన సమస్యల కారణంగా బుఖారీ తిరిగి రావలసి వచ్చినప్పటికీ, పాకిస్తాన్ వైమానిక ప్రాంతం సమీపంలో గుర్తు తెలియని విమానం ఎగురుతున్నట్లు గ్రౌండ్ కంట్రోల్ నుంచి సమాచారం అందింది. ఆ తర్వాత హుస్సేన్ సరిహద్దు వైపు కొనసాగాడు. బీచ్ క్రాఫ్ట్ పాకిస్తానీ సాబర్‌ను సమీపిస్తున్నట్లు గమనించి, దాని రెక్కలను ఊపుతూ పైకి లేవడం ప్రారంభించింది. ఇది వైమానిక యుద్ధంలో క్షమాపణకు గుర్తు. భారత విమానం డిస్ట్రెస్ సిగ్నల్ ఉన్నప్పటికీ, హుస్సేన్ కాల్పులు జరిపాడు. కొన్ని క్షణాల తర్వాత, ఆ విమానం కచ్ ప్రాంతంలోని ఇండో- పాక్ సరిహద్దులో కూలిపోయింది. విమానంలోని అందరూ చనిపోయారు.
46 సంవత్సరాల తర్వాత హుస్సేన్ క్షమాపణ
దాదాపు 46 సంవత్సరాల తరువాత, 2011లో ఆయన ఈఘటన పట్ల క్షమాపణలు కోరాడు. ఒక ఉన్నత స్థాయి రాజకీయ నాయకుడితో సహా 8 మంది పౌరుల మరణానికి కారణం కావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు. హుస్సేన్ ముంబైలో పైలట్ జహంగీర్ ఇంజనీర్ కుమార్తె ఫరీదా సింగ్‌ను గుర్తించి క్షమాపణ కోరుతూ ఆమెకు ఇమెయిల్ రాశాడు. ఈ మెయిల్ లో, హుస్సేన్ తన చర్యకు విచారం వ్యక్తం చేశాడు. ఒక క్షణం, తాను కాల్పులు జరపకుండా తిరిగి వచ్చి ఉంటే బాగుండేదన్నాడు. కానీ, యుద్ధ సమయంలో తాను ఆదేశాలను పాటించినట్లు చెప్పుకొచ్చాడు.