Nargis Fakhri.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri) రహస్యంగా పెళ్లి చేసుకొని, అందరిని ఆశ్చర్యపరిచింది. గత కొన్నాళ్లుగా వ్యాపారవేత్త టోనీ బేగ్ (Tony bag ) తో రిలేషన్ లో ఉన్న ఈమె తాజాగా అతనితో ఏడడుగులు వేసింది. లాస్ ఏంజిల్స్ లో ఉన్న బేవర్లీ హిల్స్ లో ఉన్న ఒక ప్రైవేట్ హోటల్ లో వీరి వివాహం జరిగినట్లు సమాచారం. పెళ్లి తర్వాత అమెరికా నుంచి స్విట్జర్లాండ్ కు వెళ్లిపోయింది ఈ కొత్త జంట. ప్రస్తుతం అక్కడ ఉన్న ఫోటోలు , వీడియోలు షేర్ చేయడంతో ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే నర్గీస్ ఇలా ఎవరికీ చెప్పకుండా సడన్గా పెళ్లి చేసుకుని కనిపించేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంత రహస్యంగా వివాహం చేసుకోవడం వెనుక అసలు కారణం ఏంటి? అని కూడా ఆరా తీస్తూ ఉండడం గమనార్హం.
నర్గీస్ ఫక్రీ భర్త వివరాలివే..
నర్గీస్ ఫక్రీ వివాహం చేసుకున్న వరుడి విషయానికి వస్తే.. టోనీ బేగ్ కాశ్మీర్ కుటుంబానికి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త అని తెలుస్తోంది. చాలా కాలం క్రితమే వారి కుటుంబం అమెరికాలో స్థిరపడిందట. ఇక నర్గీస్ తో పరిచయం ఏర్పడిన ఆయన 2022 నుండే డేటింగ్ లో ఉన్నట్లు సమాచారం. అయితే తాను డేటింగ్ లో ఉన్న విషయాన్ని పరోక్షంగా చెప్పిన ఈమె.. ఇప్పుడు వివాహం చేసుకుంది. అయితే వివాహం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు కానీ స్విట్జర్లాండ్ టూర్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో అసలు విషయం వైరల్ గా మారింది.
నర్గీస్ సినిమా కెరియర్..
నర్గీస్ ఫక్రీ కెరీర్ విషయానికొస్తే.. ‘రాక్ స్టార్’ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. ఆ తర్వాత డిష్యుం, హౌజ్ ఫుల్ 3, కేఫ్ వంటి చిత్రాలలో నటించింది. ఆ తర్వాత ‘అమావాస్య’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.
నటి మాత్రమే కాదు సింగర్ కూడా..
నర్గీస్ విషయానికి వస్తే 1979 అక్టోబర్ 20న క్వీన్స్, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ లో జన్మించింది. మోడల్గా కెరియర్ ఆరంభించిన ఈమె.. 2011లో హిందీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన నటనతో అబ్బురపరిచిన నర్గీస్.. మొదటి సినిమాతో ఉత్తమ మహిళా నటిగా ఫిలింఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఇక తెలుగు, హిందీ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. పలు మ్యూజిక్ వీడియోలను కూడా క్రియేట్ చేసింది అంతేకాదు ఈమె మంచి సింగర్ కూడా.. 2017లో ఊ ఫర్, హబిటాన్ విగాడ్ ది వంటి పాటలు పాడి ఆకట్టుకుంది. ఇక ఈమెకు 2014లో మద్రాస్ కేఫ్ సినిమా కోసం బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డులకు ఎంపిక చేయబడింది. ఇక 2015లో మై తేరా హీరో సినిమాకి గాను ఫిలిం ఫేర్ గ్లామర్, స్టైల్ అవార్డు సొంతం చేసుకుంది. అంతేకాదు పలు చిత్రాలకు ఉత్తమ హాస్య నటిగా కూడా నామినేట్ చేయబడ్డ విషయం తెలిసిందే.