HBD Brahmanandam : ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న హాస్యబ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam) పుట్టినరోజు నేడు. ఈరోజు ఆయన 69వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో జన్మించిన బ్రహ్మానందం, టాలీవుడ్ లో 1200కు పైగా సినిమాలు చేసి ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును క్రియేట్ చేశారు. ఆయనకు హాస్యబ్రహ్మ అనే బిరుదు కూడా ఉందన్న సంగతి తెలిసిందే. అయితే ఇండస్ట్రీలో బ్రహ్మానందం సూపర్ సక్సెస్ అయ్యారు. కానీ ఆయన తనయుడు గౌతమ్ (Raja Gautham) మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తవుతున్న ఇంకా హీరోగా మంచి గుర్తింపును దక్కించుకోలేకపోయారు. అయితే కొడుకు ఫెయిల్యూర్ కు గల కారణం ఏంటో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బ్రహ్మానందం వెల్లడించారు.
తండ్రి సక్సెస్, కొడుకు ఫెయిల్
సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల లిస్ట్ చెప్పుకుంటే దాదాపు 80 శాతం స్టార్ హీరోల వారసులే కనిపిస్తారు. అయితే లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) తనయుడు (Raja Gautham) మాత్రం ఇండస్ట్రీలో ఇప్పటిదాకా హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. మరి బ్రహ్మానందం తన ఇన్ఫ్లూయెన్స్ ని ఉపయోగించి ఎందుకు వారసుడిని స్టార్ ని చేయలేకపోయాడు అనేది ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్.
రీసెంట్ గా ఇదే ప్రశ్నని బ్రహ్మానందం తన కొడుకు రాజా గౌతమ్ తో కలిసి నటించిన ‘బ్రహ్మానందం’ అనే మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా అడిగారు. దానికి బ్రహ్మానందం స్పందిస్తూ “నా కొడుకు కోసం ఇండస్ట్రీని ఎందుకు వాడుకోలేదు అని మీరు నన్ను అడుగుతున్నారు. ఆ విషయానికి వస్తే నన్ను నేనే సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాను అని భావిస్తాను. ఇన్నేళ్ల కెరీర్లో నేను ఎవ్వరినీ ఒక పాత్ర కావాలని అడగలేదు. అలాగని అది నా గొప్పతనం అని చెప్తే అహంకారం అవుతుంది. అలా అడగాల్సిన అవసరం రాని సిచువేషన్ లో నేను ఉండడం అదృష్టంగా భావిస్తాను. ముఖ్యంగా నేను విధిని ఎక్కువగా నమ్ముతాను. ఎవరికి ఏం జరగాలి అనేది ముందుగానే రాసిపెట్టి ఉంటుంది. జరగాలంటే జరుగుతుంది లేదంటే లేదు. మనం కేవలం నిమిత్త మాత్రులం.
గౌతమ్ విషయానికొస్తే ‘గోదావరి’ సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. శేఖర్ కమ్ముల మా ఆవిడకు మేనల్లుడే. కానీ గౌతమ్ అది లేడీ ఓరియంటెడ్ సినిమా అని పక్కన పెట్టాడు. కానీ ఎవరికైనా ఈ మాట చెప్తే శేఖర్ కమ్ముల స్టోరీ చెప్తే రిజెక్ట్ చేశాడతా అనే మాట వస్తుంది. అందుకే ఏదైనా సరే రాసి పెట్టినట్టే జరుగుతుందని నేను నమ్ముతాను” అంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే బ్రహ్మానందం తన వారసుడిగా వెన్నెల కిషోర్ ను ప్రకటించారు. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ బాగుంటుందని ఈ లెజెండరీ కమెడియన్ ప్రశంసల వర్షం కురిపించారు. కాగా ‘బ్రహ్మానందం’ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతోంది.