Allu Arjun Case: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంధ్యా థియేటర్ ఘటన అల్లు అర్జున్ (Allu Arjun)కు తీరని సమస్యగా మారిపోయింది. మద్యంతర బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ ఎట్టకేలకు జనవరి 3వ తేదీన రెగ్యులర్ బెయిల్ పొందారు. కానీ కండిషన్స్ తో కూడిన బెయిల్ పొందడంతో అభిమానులు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని, పోలీసులు పెట్టిన కండిషన్స్ ఫాలో కావాలని, కేసును ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా మాట్లాడవద్దు అని నాంపల్లి హైకోర్టు సూచించింది.
విచారణకు హాజరైన అల్లు అర్జున్..
ఇకపోతే ఈరోజు ఆదివారం కావడంతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు అల్లు అర్జున్ హాజరైనట్లు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి విచారణ నిమిత్తం వెళ్ళనున్నారు. అందులో భాగంగానే ఈ ఆదివారం కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఇకపోతే విచారణ అనంతరం సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీ తేజ్ ని పరామర్శించడానికి అల్లు అర్జున్ కిమ్స్ కి వెళ్లే అవకాశం ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపించగా.. ఈ వార్తలు కాస్త పోలీసుల వరకు చేరడంతో వెంటనే అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి రామ్ గోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు.
శ్రీ తేజ్ ను పరామర్శిస్తారా..
అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించకూడదని, ఒకవేళ కాదని వెళ్ళినా అక్కడ ఏదైనా జరగరాని సంఘటన జరిగితే దానికి పూర్తి బాధ్యత అల్లు అర్జున్ వహించాలి అంటూ పోలీసులు కరాకండిగా చెప్పినట్లు సమాచారం. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం వల్లే అల్లు అర్జున్ మేనేజర్ కి నోటీసులు అందజేశారట. మరి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లిన అల్లు అర్జున్ అనంతరం కిమ్స్ హాస్పిటల్ కి వెళ్తాడా? లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
ఎన్నాళ్లో ఈ తిప్పలు..
ఇకపోతే ప్రతి ఆదివారం విచారణకు హాజరు కావాలని నాంపల్లి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేయడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్లు మా హీరోకి ఈ తిప్పలు అంటూ బాధపడుతున్నారు. మరి అల్లు అర్జున్ కి ఈ విషయంలో ఎప్పుడు ఊరట లభిస్తుందో చూడాలి.
బన్నీని సతమతం చేస్తున్న సంధ్యా థియేటర్ ఘటన.
అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా, సుకుమార్(Sukumar) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పుష్ప 2’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, డిసెంబర్ 4వ తేదీన బెనిఫిట్ షో వేశారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్ కి అల్లు అర్జున్ ఫ్యామిలీతో వెళ్లడం అక్కడ తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కొడుకు శ్రీ తేజ్ ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఏది ఏమైనా ఈ సమస్యతో సినిమా సూపర్ హిట్ విజయం అందుకున్నప్పటికీ, ఆ సంతోషాన్ని పొందలేకపోతున్నారు అల్లు అర్జున్.