Chiranjeevi : కృష్ణ మృతి పట్ల మొత్తం టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కృష్ణ మృతి వార్త తెలియగానే మెగాస్టార్ షాక్‌కు గురయ్యారు. తన ఆవేదనను సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. చిరంజీవి ట్విట్టర్‌లో “మాటలకు అందని విషాదం ఇది.. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయ పదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం.. వీటి కలబోత కృష్ణ గారు.
అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు.. భారత సినీ పరిశ్రమలోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నా సోదరుడు మహేశ్ బాబుకు, ఆయన కటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేసుకుంటున్నాను” అని బాధను వ్యక్తం చేశారు.