Case Against Posani: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా, కమెడియన్ గా, విలన్ గా కూడా నటించి మంచి పేరు అందుకున్నారు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali). ముఖ్యంగా సినిమాలలోనే కాదు రాజకీయంగా కూడా అడుగులు వేసి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. గత ప్రభుత్వం వైసీపీ హయాంలో.. టీడీపీ పార్టీ అధినేత అప్పటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)ని అవమానిస్తూ.. పోసాని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు టిడిపి అధికారంలోకి వచ్చింది.100ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధిష్టించారు. ఈ నేపథ్యంలోనే గతంలో తమపై విమర్శలు చేసిన వారిని ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తూ ఇప్పుడు వారిపై రివేంజ్ తీర్చుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
పోసాని కృష్ణ మురళి పై సీఐడీ కేస్ ఫైల్..
ఈ నేపథ్యంలోనే తాజాగా పోసాని కృష్ణమురళి పై సోమవారం నవంబర్ 18న సీఐడీ కేసు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పోసాని తప్పుడు ప్రచారం చేశారని, టిడిపి నాయకులు బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఏడాది సెప్టెంబర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పోసాని చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన తన ఫిర్యాదులో తెలిపారు. ఇక ఈ మేరకు సిఐడి పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు..
ఇకపోతే పోసాని కృష్ణ మురళి వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో చంద్రబాబు, లోకేష్,పవన్ కళ్యాణ్ పై కూడా పోసాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినట్లు ఇప్పుడు టిడిపి, జనసేన నాయకులు గుర్తు చేస్తున్నారు. ఇకపోతే ఈనెల 12వ తేదీన పోసాని మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లపై తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడడంతో రాష్ట్రంలో ప్రకంపనలు కలిగాయి. దీంతో టీడీపీ, జనసేన నాయకులు రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో పోసానిపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పోసాని కృష్ణమురళి కెరియర్..
టాలీవుడ్ సినీ రంగంలో రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా వందకి పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసిన ఈయన కమర్షియల్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక 2009లో చిలకలూరిపేట నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఇకపోతే ఎదుటి వ్యక్తి పేరు ఏదైనా సరే రాజా అంటూ అతడిని సంబోధిస్తూ.. తన మేనరిజాన్ని సినిమాల్లో ప్రవేశపెట్టి దానికి కొత్త ప్రాచుర్యం తీసుకొచ్చారు. అంతేకాదు రాజా అనే పేరుకి సర్వనామంగా ప్రాచుర్యం తెచ్చాడు పోసాని కృష్ణమురళి. ఇకపోతే తెలుగులో స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ దక్కించుకున్న ఈయన ఇప్పుడు రాజకీయాల కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక సిఐడి కేసు ఫైల్ చేసిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారా? లేక ఈయనను అరెస్టు చేస్తారా? అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.