CM Revanth :సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy)ని సినీ పెద్దలు కలిశారు. ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు (Dil Raju) నేతృత్వంలో మొత్తం 36 మంది సభ్యుల బృందం నేడు సమావేశం అయ్యింది. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలు తమ ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంచగా.. అందులో కొన్నింటికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ కూడా ఇచ్చారు. అయితే సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం అండగా నిలబడాలి అంటే సెలబ్రిటీలు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా కొన్నింటిని పాటించాల్సి ఉంటుంది అంటూ కూడా తెలిపారు.
సినీ ఇండస్ట్రీకి సపోర్టుగా ప్రభుత్వం.. కానీ..
సినీ పెద్దలు తెలిపిన ప్రతిపాదనలు విన్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “ఎక్కడైనా సరే శాంతి భద్రత విషయంలో రాజీ పడబోము. ముఖ్యంగా సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ఇకనుంచి అటు సినీ సెలబ్రిటీలు నియమించుకునే బౌన్సర్ల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉంటుంది. ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా సెలబ్రిటీలదే. లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వం ఎప్పుడు సీరియస్ గా ఉంటుంది. తెలంగాణ రైసింగ్ లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీ తో ఉండాలి. డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి సెలబ్రిటీలు ప్రభుత్వానికి సహకరించాలి. ప్రచార కార్యక్రమాలలో కూడా సినీ హీరోలు తప్పక పాల్గొనాలి. హీరో, హీరోయిన్లతో ఖచ్చితంగా డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి యాడ్స్ చేయించాలి. సినిమా రిలీజ్ కి ముందు థియేటర్లలో ఈ యాడ్స్ ను ప్లే చేయాలి. అంతేకాదు డ్రగ్స్ క్యాంపెయిన్ , మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు సినీ ఇండస్ట్రీ సహాయం చేయాలి” అంటూ సినీ సెలబ్రిటీలకు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కండిషన్స్ ని పెట్టారు. ఇక ఇవన్నీ కూడా న్యాయపరమైనవే కాబట్టి సినీ సెలెబ్రిటీలు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అనుమతులు నిరాకరించడం పై సీరియస్ అయిన డీజీపీ..
సంధ్య థియేటర్ కి ర్యాలీ నిర్వహించుకుంటూ వచ్చిన అల్లు అర్జున్ కి.. రోడ్ షో నిర్వహించడానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అనుమతి ఇవ్వకపోయినా అక్కడికి ర్యాలీతో రావడం వల్ల ఈ ఘటన జరిగిందని.. అసలు పోలీసులు ఎందుకు అనుమతి ఇవ్వలేదు అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించాలని కూడా పోలీసులు కామెంట్లు చేసినట్లు సమాచారం. ఇక ఈ విషయంపై సినిమా ప్రమోషన్స్ సమయంలో పోలీసులు అనుమతి నిరాకరిస్తే దానిని పాటించాలి అని, పోలీసులు అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటారని, అటు పోలీసుల నిర్ణయాన్ని గౌరవించాలని కూడా డీజీపీ కోరారు. ఇక బౌన్సర్లను నియమించుకున్నప్పుడు న్యాయ సమ్మతం ఉండాలి. ఇటీవల వారి ప్రవర్తన బాగోలేదని, ఏ ఈవెంట్ కి అయినా ముందస్తు అనుమతులు తీసుకోవాలని, అన్నీ పరిశీలించిన తర్వాతే పోలీసుల నిర్ణయం తీసుకుంటారని, వారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కూడా పోలీసులు ఈ సమావేశంలో కోరారు.