Pawan Kalyan.. సైబర్ నేరగాళ్లు ప్రజలను ఏ రూపంలోనైనా మోసం చేయడానికి వెనుకాడరు అనడానికి ఇప్పటికే ఎన్నో ఉదాహరణలు మనకు తారస పడుతున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ వచ్చిన తర్వాత సైబర్ నేరగాళ్లు మరింత విజృంభించిపోతున్నారు. ఆన్లైన్లో గిఫ్ట్ కార్డులు, వాట్సాప్ లో లింకులు, పార్సెల్ ఇలా ఎన్నో రకాలుగా ప్రజలను మోసం చేస్తూ.. భారీగా డబ్బు దోచుకుంటున్నారు. ముఖ్యంగా పోలీసులు వారి నేరాలను పసిగట్టినా సరే.. మళ్ళీ కొత్త మోసాలతో సామాన్యులను బోల్తా కొట్టించి లక్షల రూపాయలను దోచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సైబర్ నేరగాళ్లు మరింత శృతి మించిపోయారనే చెప్పాలి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా ప్రమోషన్ పేరుతో రూ .1.34కోట్లను ఒక ప్రైవేట్ ఉద్యోగి నుంచి తీసుకొని పరారవడంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Shruti Haasan Biopic: శృతిహాసన్ బయోపిక్.. పూర్తి వివరాలు ఇవే..!
పవన్ కళ్యాణ్ మూవీ ప్రమోషన్ పేరుతో కోట్ల రూపాయల బురిడీ..
అసలు విషయంలోకి వెళ్తే.. హైదరాబాదుకు చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగి తన ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కువగా గోవా వెళ్తుండేవారు.అక్టోబర్లో కూడా అక్కడ క్యాసినో కి వెళ్ళగా శ్రీలంకకు చెందిన ఉదయ్ రాజ్, వివేక్ లు ఆయనకు పరిచయమయ్యారు. అక్కడ వారు తాము కొత్తగా విడుదల అయ్యే తెలుగు సినిమాలకు ప్రమోషన్ ఈవెంట్స్ చేస్తున్నామంటూ.. ఈ ప్రైవేట్ ఉద్యోగిని నమ్మించారు. అదే నెలలో ఉదయ్ రాజ్ గచ్చిబౌలిలోని ఒక హోటల్ కి వస్తే.. బాధితుడు వెళ్లి అతడిని కలిశాడు కూడా.. త్వరలోనే డైరెక్టర్ సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ (OG)సినిమా విడుదల కాబోతోంది .ఈ చిత్రానికి ప్రమోషన్ చేసేందుకు మాకు అవకాశం వచ్చింది. అయితే ఈ సినిమా కంటే ముందే ‘అమరన్’సినిమా ప్రమోషన్ కి రూ.20 లక్షలు ఇస్తే వారం రోజుల్లోనే రెట్టింపు లాభాలు ఇస్తామని, ఆ ఉద్యోగిని బాగా నమ్మబలికారు. రెండు సార్లు ఆ ఇద్దరి బ్యాంకు ఖాతాల నుంచి అమరన్ సినిమాకి లాభాలు వచ్చాయి అంటూ రూ.25 లక్షలు ప్రైవేట్ ఉద్యోగి ఖాతాకి జమ చేయడం జరిగింది. అతడిని బాగా నమ్మించిన తర్వాత ‘పుష్ప2’, ‘కంగువ’, ‘గేమ్ ఛేంజర్ ‘ సినిమా ప్రమోషన్ పెట్టుబడి పేరిట ఆన్లైన్లో రూ.76 లక్షలు, మరొకసారి రూ.58 లక్షలు మోసగాళ్లు ఆ బాధితుడి నుండి తీసుకున్నారు. బాధితుడు తన ఇంటిని విక్రయించి, నగలు తాకట్టుపెట్టి, అప్పు చేసి మరీ మొత్తం రూ.1.34 కోట్లు వారికి చెల్లించారు. ఆ తర్వాత ఫోన్ చేస్తే మోసగాళ్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారైనట్లు గుర్తించారు. ఇక మోసపోయానని గ్రహించిన అతడు వెంటనే సీసీఎస్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..
ఏది ఏమైనా ఇలా ఎవరో వచ్చి ప్రమోషన్స్ చేస్తున్నామని చెప్పి లక్షల రూపాయలు మొదట ఎరగా వేసి, ఆ తర్వాత కోట్లల్లో ఎత్తుకుపోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇది విన్న నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. డబ్బు ఆశ చూపించి వీరిని బాగా బురిడీ కొట్టిస్తున్నారు అని, కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.