Narayana on Chiranjeevi: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా స్పందించారు. చేతినిండా అవకాశాలు ఉన్నవాళ్లు కూడా ఈ తప్పుడు పనులతో డబ్బు సంపాదించిడం ఎందుకు అంటూ ఫైర్ అయ్యారు.
కళామతల్లి ఇచ్చే గుర్తింపును బెట్టింగ్ వంటి తప్పుడు పనులకు దుర్వినియోగం చేయవద్దని సీపీఐ నారాయణ అన్నారు. సినీ నటులను ప్రజలు అనుసరిస్తూ ఉంటారు. ఆ విషయం వాళ్లు గమనించాలి. గుట్కా విషయంలో ఒక పనికిమాలిన తీర్పు వచ్చిందని.. దాన్ని ఆసరాగా చేసుకుని పాన్ పరాగ్ పేరుతో అనైతిక వ్యాపారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
సినీ నటులు చేతినిండా సంపాదిస్తున్నారు. సినిమాలు కాకపోతే ఓటీటీ సహా ఎన్నోరకాల అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ పాడు సంపాదన దేనికి అంటూ సీపీఐ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో గతంలో మెగస్టార్ చిరంజీవికి తాను లేఖ రాసిన సందర్బాన్ని ఆయన నారాయణ గుర్తు చేశారు.
కోకో కోలా కంపెనీ కోసం చిరంజీవి గతంలో ప్రకటనలు ఇచ్చారు. అప్పుడు నేను ఆయనకు ఒక లేఖ రాశాను. ఓ వైపు రక్తదానం చేస్తూ.. మరోవైపు రక్తాన్ని దెబ్బతీసే డ్రింక్స్ లను ఎలా ప్రమోట్ చేస్తారని ప్రశ్నించా.. చిరంజీవి దీనికి స్పందించి కాంట్రాక్టు గడువు ముగిసిన తర్వాత.. మళ్లీ ఆ ప్రకటనలు చేయనని చెప్పారు. అలాగే ఉన్నారని సీపీఐ నారాయణ తెలిపారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.. గతంలో డ్రగ్స్ కేసులో పెద్ద పెద్ద టాలీవుడ్ సెలబ్రిటీలంతా దర్యాప్తు సంస్థల ముందు విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి మరో తప్పు చేశారంటూ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే పలువురికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు.
విష్ణు ప్రియ,రీతూ చౌదరి ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. ఆరుగురు ప్రముఖ యాక్టర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు సహా మొత్తం 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్‌పై తాజాగా కేసు నమోదు చేశారు. శ్యామల, శ్రీముఖి, రీతూ చౌదరి, విష్ణుప్రియ, వర్షిణి, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, వసంతికృష్ణన్,శోభాశెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్‌ఖాన్, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీతపై కేసు పెట్టారు. మియాపూర్ వాసి ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు.
Also Read: అరెస్ట్ భయం.. కోర్టు మెట్లెక్కిన శ్యామల.. నేడే విచారణ
బెట్టింగ్ అంటే ఏమిటో కూడా తెలియనోడికి.. ఆన్‌లైన్ గేమ్స్ మీద అసలే ఇంట్రస్ట్ లేనోడికి.. గ్యాంబ్లింగ్ గురించి ఇంచు కూడా అవగాహన లేనోడికి.. డబ్బుల మీద ఆశ కల్పించి.. ఈజీ మనీపై ఇంట్రస్ట్ పుట్టించినవే.. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు. సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్ల మాటల్ని గుడ్డిగా నమ్మి.. అడ్డంగా బుక్కైపోయిన వాళ్ల లెక్కలెన్నో ఉన్నాయి. వాళ్లు పోగొట్టుకున్న డబ్బులకు లెక్కే లేదు. వాళ్లు కోల్పోయిన జీవితాలకు.. విలువ కట్టగలమా? వాళ్ల నష్టాన్ని.. ఈ సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు పూడ్చగలరా?