24 క్లెమోర్ మైన్స్ పేలినా తాను ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బతికి బయటపడ్డానని, తనకు తిరుమల వెంకటేశ్వర స్వామే ప్రాణ భిక్ష పెట్టారని అన్నారు సీఎం చంద్రబాబు. మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాలు వడ్డించారు. మనవడితో కలసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేరుగా భక్తులకు అన్నం వడ్డిస్తే కలిగే తృప్తి వెలకట్టలేనిది అని అన్నారు చంద్రబాబు.
టీటీడీ అన్నదాన పథకానికి 2200 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఉందని చాలామంది భక్తులు అన్నదానం ట్రస్ట్ కి ప్రతి రోజూ విరాళాలు ఇస్తున్నారని చెప్పారు సీఎం చంద్రబాబు. ఇది ఓ బృహత్తర కార్యక్రమం అన్నారు. దాతలే భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాలు వడ్డిస్తే వచ్చే తృప్తి వెలకట్టలేనిదన్నారు. సమాజ హితం కోసం అందరూ కలసి పనిచేయాలన్నారు. తిరుమల ప్రాముఖ్యత, ఈ కార్యక్రమాల ప్రాముఖ్యతను భావి తరాలకు తెలియజేసేందుకే వారసులతో కలసి తాను అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిపారు చంద్రబాబు.
తిరుమల శ్రీవారి దర్శన అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలసి భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించి, సేవించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, కుటుంబ సభ్యులు. మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కుటుంబం టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.44లక్షలు… pic.twitter.com/KGbrTe3Axm
— Telugu Desam Party (@JaiTDP) March 21, 2025
అప్పుడు అపవిత్రం..
గడిచిన ఐదేళ్లలో తిరుమలను అపవిత్రం చేశారని ధ్వజమెత్తారు సీఎం చంద్రబాబు. తమ హయాంలో ప్రక్షాళణ మొదలు పెట్టామని, ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు చేపట్టామని, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని అన్నారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం ముంతాజ్ హోటల్ కి ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నట్టు తెలిపారాయన. మొత్తం 35.32 ఎకరాల కేటాయింపుల్ని క్యాన్సిల్ చేస్తున్నామన్నారు. అవసరమైతే రోడ్డుకి మరోవైపు వారికి స్థలం కేటాయించే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. తిరుమలను ఎవ్వరూ అపవిత్రం చేయకూడదన్నారు.
ఆస్తుల పరిరక్షణ..
దేశ వ్యాప్తంగా ఉన్న స్వామి వారి ఆస్తుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం చంద్రబాబు. టీటీడీలో ఉన్న అన్యమత ఉద్యోగులను.. వారి మనోభావాలు దెబ్బతినకుండా ఇతర డిపార్ట్ మెంట్లకు పంపిస్తున్నట్టు తెలిపారు. ఏడు కొండలు, శ్రీ వెంకటేశ్వర స్వామి సొంతం అని, ఏడు కొండల్లో ఎక్కడ ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదన్నారు. తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించానని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వేంకటేశ్వరస్వామి ఆలయాలను కట్టించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. విదేశాల్లో కూడా చాల మంది హిందువులు ఉన్నారని, వారి కోసం కూడా తిరుమల నమూనా ఆలయాలు నిర్మిస్తామన్నారు. స్వామి వారి ఆలయాల నిర్మాణ నిధిని ఏర్పాటు చేసి త్వరలో దానికి ఓ పేరు పెడతామన్నారు. స్వామి వారి ఆస్తులు కబ్జాలకు గురికాకుండా చూస్తామన్నారు.
ఏడు కొండల్లో ఎక్కడా వ్యాపార ధోరణి లేకుండా ఉండాలని చెప్పారు సీఎం చంద్రబాబు. ప్రజా హితం కోసమే తమ ప్రభుత్వం పాటుపడుతోందని, తిరుమలలో కూడా అదే ధోరణితో టీటీడీ పనులు చేస్తోందన్నారు. ఎక్కడా వ్యాపార ధోరణి కనపడదన్నారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రతినిత్యం టీటీడీ ప్రయత్నిస్తోందన్నారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వ హయాంలో తిరుమలలో వచ్చిన మార్పు ఇప్పటికే భక్తులకు స్పష్టంగా కనపడుతోందని, మరిన్ని మార్పులకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.