Priyadarshan: బాలీవుడ్ అంతా ఓ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. అదే అక్షయ్ కుమార్ నిర్మాతగా, నటుడిగా చేస్తున్న హేరా ఫేరీ. ప్రియదర్శన్ దర్శకత్వంలో విడుదలైన ఓ కామెడీ చిత్రం. 2000లో పార్ట్ 1రిలీజ్ అయింది. ఈ మూవీలో అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, సురేష్ రావెల్, ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం మలయాళ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. ఈ చిత్రం అప్పట్లో కల్ట్ క్లాసికల్ మూవీగా బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకుంది. ఆ తర్వాత 2006లో రెండవ భాగం రిలీజ్ అయి సక్సెస్ అయింది. ఇక మూడవ భాగం 2025 లో రిలీజ్ చేయడానికి అక్షయ్ కుమార్ సన్నాహాలు చేశారు. అయితే తాజాగా ఈ మూవీ నుండి పరేష్ రావేల్ తప్పుకోవడంతో వివాదం నెలకొంది. అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ కేఫ్ ఆఫ్ గుడ్ ఫిలిం బ్యానర్ లో ఈ చిత్రం రూపొందుతుంది. తాజాగా ఈ వివాదం పై దర్శకుడు ప్రియదర్శన్ స్పందిస్తూ అక్షయ్ కుమార్ పై, పరేష్ రవెల్ పై కామెంట్స్ చేశారు. ఆ వివరాలు చూద్దాం..
పరేష్ నిర్ణయం..
హేరా ఫేరీ 3 మూవీ నుండి పరేష్ రావేల్ తప్పుకోవడంతో బాలీవుడ్ లో వివాదం చెలరేగింది. అక్షయ్ కుమార్ 25 కోట్ల నష్టపరిహారాన్ని కోరుతూ లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ చిత్రం కోసం అక్షయ్ కుమార్, ఫిరోజ్ నదియాద్ వాలా నుండి హక్కులను కొనుగోలు చేశారు. పరేష్ మొదట ఈ మూవీని ఒప్పుకుంటున్నట్లు కాంట్రాక్ట్ మీద సంతకం చేసి, ఆ తర్వాత అమౌంట్ తీసుకొని, ఇప్పుడు తప్పుకోవడంతో.. అతనిపై నష్టపరిహారాన్ని కోరుతూ లీగల్ నోటీసులు అక్షయ్ కుమార్ జారీ చేశారు. ఈ విషయంపై పరేష్ రావెల్ స్పందిస్తూ.. నేను ఈ చిత్రం నుండి తప్పుకోవడానికి సృజనాత్మకమైన విభేదాలు కారణం కాదు, నాకు డైరెక్టర్ ప్రియదర్శిన్ పై అపారమైన గౌరవం, ప్రేమ, నమ్మకం ఉన్నాయి. ఇది నా సొంత నిర్ణయం అని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. తాజాగా ఇక ఈ వివాదం పై డైరెక్టర్ ప్రియదర్శన్ స్పందించారు.
అక్షయ్ బోరున ఏడ్చేశాడు..
తాజాగా ప్రియదర్శన్ ఈ వివాదం పై మాట్లాడుతూ.. పరేష్ రావెల్ నిర్ణయంతో నేను షాక్ కి గురయ్యాను. ఆయన ఈ నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకోలేదు. పరేష్ నిర్ణయం గురించి ఎప్పుడు మాకు సమాచారం అందించలేదు. ఈ విషయంపై నేను అతనితో మాట్లాడదామని ఫోన్ చేస్తే, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎన్నో సంవత్సరాలుగా మేము స్నేహితులుగా ఉన్నాం. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోగా, నాకు ఒక మెసేజ్ ని పంపాడు. అందులో ప్రియదర్శన్ సార్ మీపై నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు, నాకు మీపై చాలా గౌరవం ఉంది. కానీ సినిమా చేయకపోవడానికి నాకు చాలా కారణాలు ఉన్నాయి. ఇది నా సొంత నిర్ణయం. మీరు నాకు ఎప్పుడు కాల్ చేయొద్దు. నా నిర్ణయానికి మీకు ఎటువంటి సంబంధం లేదు అని మెసేజ్ చేశాడు. ఇంతేకాక అతను మళ్లీ మనం తిరిగి వేరే ప్రాజెక్టులో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాను అని పరేష్ తెలపడం నాకు చాలా బాధనిపించింది. ఈ విషయం గురించి నేను అక్షయ్ తో మాట్లాడినప్పుడు అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పరేష్ అకస్మాత్తుగా బయటికి వెళ్లినందుకు అక్షయ్ కు ఎంతో నష్టం వచ్చింది. ఆయన నష్టపరిహారం కోరడంలో న్యాయం ఉంది అంటూ ప్రియదర్శిన్ చెప్పుకొచ్చారు.