Ground Zero: శ్రీనగర్, అనేక సంవత్సరాలుగా హింసకు వేదిక అయిన ఈ ప్రాంతం, ఇప్పుడు చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతోంది. 38 ఏళ్ల విరామం తర్వాత అక్కడ సినిమా స్క్రీనింగ్ జరగబోతోంది. అదే బాలీవుడ్ మూవీ గ్రౌండ్ జీరో. ఏప్రిల్ 18న శ్రీనగర్‌లో ప్రీమియర్ షో ప్లాన్ చేయడం కేవలం బాలీవుడ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది.
సినిమా కేవలం వినోదమే కాదు, అది భావోద్వేగాల వేదిక కూడా. దేశ సేవలో నిబద్ధత చూపిన వారికి అంకితమిస్తూ… ఇండియన్ ఆర్మీ మరియు బీఎస్‌ఎఫ్ హీరోలు చేసిన త్యాగాలకు గౌరవం తెలిపే గ్రౌండ్ జీరో చిత్రాన్ని, అంతగా సురక్షితంగా లేని ప్రాంతమైన జమ్మూ & కశ్మీర్లో స్క్రీన్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే ఇది మోస్ట్ హిస్టారికల్ మొమెంట్ అనే చెప్పాలి.
గ్రౌండ్ జీరో సినిమా కథ 2001లో జరిగిన పార్లమెంట్ దాడి తర్వాత జరిగిన ఓ కీలక ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కింది. బీఎస్‌ఎఫ్ అధికారిగా నరేంద్ర నాథ్ ధర్ దూబే లీడ్ చేసిన ఈ ఆపరేషన్‌లో, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ “ఘాజీ బాబా” అరెస్ట్ అయ్యాడు. వాస్తవ సంఘటనలతో పాటు, కొంత కల్పిత అంశాలతో కలిపి గ్రౌండ్ జీరో సినిమాని తెరక్కించారు. ఇక ఈ ప్రాజెక్ట్‌కు మొదట సల్మాన్ ఖాన్ను ఎంపిక చేయాలన్న ఆలోచన ఉండగా, ఇతర ప్రాజెక్టుల వల్ల అది కుదరలేదు. చివరకు ఇమ్రాన్ హష్మీ ఈ ఛాన్స్ దక్కించుకుని దూబే పాత్రలో నటించి ఆకట్టుకున్నారట.
శ్రీనగర్‌లో ఈ సినిమా ప్రీమియర్ చేయడమంటే, అది కేవలం స్క్రీనింగ్ మాత్రమే కాదు — దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు ఇది ఓ హృదయపూర్వక నివాళి అనే చెప్పాలి. ఈ ఈవెంట్‌కు ఆర్మీ ఉన్నతాధికారులు, సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 25న దేశవ్యాప్తంగా విడుదల కాబోతోన్న గ్రౌండ్ జీరో సినిమా ముందు శ్రీనగర్ స్క్రీనింగ్ ద్వారా కచ్చితంగా బజ్ పెరుగుతుంది. ఇంతకన్నా ముందు రిలీజ్ కానున్న గ్రౌండ్ జీరో ట్రైలర్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.