Diwali Movies: తెలుగు పండగలంటే సినిమాల పండగే. మూవీ లవర్స్‌ను పండగ రోజు ఎంటర్‌టైన్ చేయడం మేకర్స్ ఆనవాయితీగా మార్చుకున్నారు. 2024 దీపావళికి కూడా నాలుగు సినిమాలు థియేటర్లలో పోటీకి సిద్ధమయ్యాయి. అందులో రెండు తెలుగు సినిమాలు ఉండగా.. ఒకటి కన్నడ, ఒక తమిళ చిత్రాలు ఉన్నాయి. ఇటీవల ఈ నాలుగు సినిమాల రన్ టైమ్, సెన్సార్ సర్టిఫికెట్స్ గురించి బయటికొచ్చింది. అయితే గురువారం దీపావళి పండుగ కాగా.. బుధవారం నుండే రెండు తెలుగు సినిమాల ప్రీమియర్ షోల హడావిడి మొదలుకానుంది.
క
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రమే ‘క’. ఇప్పటికే కిరణ్ అబ్బవరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా కూడా వాటి నుండి సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అయినా కూడా ‘క’ అనే ప్యాన్ ఇండియా మూవీతో పెద్ద రిస్కే తీసుకుంటున్నాడు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ మూవీ విడుదల కానుండగా.. ప్రమోషన్స్ కోసం కిరణ్ అబ్బవరం చాలా కష్టపడుతున్నాడు. అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ (U/A) సర్టిఫికెట్ ఇచ్చింది. ‘క’ (Ka) సినిమా రన్ టైమ్ 151 నిమిషాలు అంటే రెండున్నర గంటలు అని తెలుస్తోంది. అక్టోబర్ 30 నుండే ఈ మూవీ ప్రీమియర్స్ మొదలుకానున్నాయి.
లక్కీ భాస్కర్
‘క’తో పాటు థియేటర్లలో పోటీపడుతున్న మరొక తెలుగు సినిమా ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar). దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటించిన ఈ మూవీకి ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి కూడా మేకర్స్ గట్టిగానే ప్రమోషన్ చేశారు. ఇది కూడా తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఒకేరోజు విడుదలకు సిద్ధమయ్యింది. ‘లక్కీ భాస్కర్’కు సంబంధించిన ప్రీమియర్స్‌ను అక్టోబర్ 30న ప్లాన్ చేశారు. ఈ సినిమాకు (U/A) సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. దీనికి 150 నిమిషాలు అంటే రెండున్నర గంటల రన్ టైమ్ ఫిక్స్ అయ్యింది.
Also Read: క్లైమాక్స్‌లో కన్నీళ్లు… సాడ్‌గా ఎండ్ అయ్యే స్టోరీ..?
భగీర
‘కేజీఎఫ్’ తర్వాత కన్నడ సినిమాలకు కూడా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ అనే పేరు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. అలాంటి ప్రశాంత్ నీల్ రైటర్‌గా పనిచేసిన చిత్రమే ‘భగీర’ (Bagheera). ఈ సినిమా కన్నడతో పాటు తెలుగులో కూడా విడుదలకు సిద్ధమయ్యింది. అక్టోబర్ 31న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇందులో శ్రీ మురళి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు కూడా (U/A) అందించింది సెన్సార్ బోర్డ్. దీని రన్ టైమ్ 158 నిమిషాలుగా ఫిక్స్ అయ్యింది.
అమరన్
తెలుగు సినిమా కాకపోయినా తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన సినిమా ‘అమరన్’ (Amaran). శివ కార్తికేయన్ (Sivakarthikeyan), సాయి పల్లవి (Sai Pallavi) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ పెరియసామి డైరెక్ట్ చేశారు. మేకర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ముకుంద్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాత్రమే కాకుండా పర్సనల్ లైఫ్ గురించి కూడా చక్కగా చూపించాడు దర్శకుడు. ఈ దీపావళికి విడుదల కానున్న అన్ని చిత్రాలకంటే ‘అమరన్’ రన్ టైమే ఎక్కువ. దీని రన్ టైమ్ 169 నిమిషాలుగా ఫిక్స్ అయ్యింది. దీనికి సెన్సార్ బోర్డ్ (U/A) సర్టిఫికెట్ ఇచ్చింది.