శ్రీకాళహస్తి, స్వేచ్ఛ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్‌పై వేటు పడింది. ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఈవో గురుప్రసాద్ ప్రకటించారు. ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉన్న గణేశ్ గురుకుల్‌ను ఇంచార్జీ ప్రధాన అర్చకుడిగా నియమిస్తూ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. అర్చకుడిగా ఉద్యోగం పొందే సమయంలో సరైన ధృవపత్రాలు ఇవ్వకపోవడం, ఆ తర్వాత జరిగిన ప్రమోషన్లపై దేవాదాయ శాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ విషయంపై రవికుమార్ అనే లాయర్ కోర్టులో దావా వేశారు. ఈ క్రమంలో ఈవోగా వచ్చిన గురుప్రసాద్ విచారణ జరిపి, నిజమేనని తేల్చారు. నాడు ఆలయ ధర్మకర్తల మండలి అండతో ఎన్నిసార్లు ఫిర్యాదులు ఈవో, ఉన్నతాధికారులు పట్టించుకోలేదు.
వీళ్ల సంగతేంటి?
కాణిపాకం ఆలయ చరిత్రలో ప్రధాన అర్చకుడిని ఇలాంటి ఆరోపణలతో సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి. వైసీపీ హయాంలో పాలకమండలి సిఫార్సులో ఆయన తప్పుడు పత్రాలు సమర్పించి, ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు స్వీకరించినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు అర్హతలేని 24 మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అప్పట్లో కట్టబెట్టినట్లుగా కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఈవో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వీరిపై కూడా వేటు ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. పెరిగిన శ్రీవారి ఆదాయం.. దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?