HBD Lokesh Kanagaraj..ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు (Lokesh kanagaraj) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విభిన్నమైన కథాంశంతో.. యాక్షన్ పర్ఫామెన్స్ తో సినిమాలు తెరకెక్కిస్తూ.. భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అంతేకాదు సినిమాటిక్ యూనివర్స్ లు క్రియేట్ చేస్తూ ఒక సినిమా నుండి ఇంకొక సినిమాను కొనసాగింపుగా.. వరుసగా ఒకే కథతో మూడు నాలుగు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఆ కథలతో భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రేక్షకుల నాడీ పట్టుకున్న లోకేష్ కనగరాజ్.. సినిమాటిక్ యూనివర్స్ చిత్రాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఇదిలా వుండగా లోకేష్ కనగరాజు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
బ్యాంకు ఉద్యోగిగా కెరియర్ ఆరంభించిన లోకేష్..
1986 మార్చి 14న తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా కినాతుకడవు అనే ప్రాంతంలో జన్మించారు. వివేక్ విద్యాలయ మెట్రిక్యులేషన్ పాఠశాలలో స్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన లోకేష్, పీ ఎస్ జి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ పట్టా అందుకొని, ఆ తర్వాత ఎంబీఏ కూడా పూర్తి చేశారు. ఇక ఇండస్ట్రీలోకి రాకముందు బ్యాంకులో దాదాపు నాలుగున్నర సంవత్సరాల పాటు పని చేసిన ఈయన.. సినిమాలపై మక్కువతో 2014లో ‘కస్టమర్ డిలైట్’ అనే షార్ట్ ఫిలిం తీసి.. ఒక కార్పొరేట్ ఫిలిం కాంపిటీషన్లో ఈ షార్ట్ ఫిలిం తో పోటీపడి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. అంతేకాదు ఈ కాంపిటీషన్ కి న్యాయ నిర్ణేతగా సినీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) వ్యవహరించారు. అలా ఆయనతో పరిచయం ఏర్పడగా .. 2016లో కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన ‘అవియల్’ అనే ఇండిపెండెంట్ ఆంతాలజీ సినిమాలో ఒక భాగమైన ‘కాలం’ అనే షార్ట్ ఫిలింకి దర్శకత్వం వహించి, కార్తీక్ సుబ్బరాజు సహాయంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
లోకేష్ కనగరాజు ఆస్తుల వివరాలు..
ఇక రూ .5లక్షల పారితోషకంతో మొదలైన ఆయన కెరియర్ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అంతేకాదు కోలీవుడ్లో అత్యధిక పారితోషకం తీసుకునే దర్శకులలో ఒకరిగా నిలిచారు. ఇక వరుస హిట్లతో దూసుకుపోతున్న లోకేష్ నికర సంపద దాదాపు రూ.120 కోట్లకు పైమాటే. అంతేకాదు లెక్సస్, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు కూడా ఈయన కలిగి ఉన్నారు. ఒక మొత్తానికైతే తీసింది ఐదు చిత్రాలే అయినా.. దాదాపు రూ.100 కోట్లకు పైగా ఆస్తి కలిగి ఉండడం పై అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
లోకేష్ సినిమాలు..
ఇక 2017లో ‘మానగరం’అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆ తర్వాత కార్తీ(Karthi)తో ‘ఖైదీ’, విజయ్ దళపతి (Vijay Thalapathy) తో ‘మాస్టర్’, కమలహాసన్ (Kamal Haasan) తో ‘విక్రమ్’ సినిమాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక తర్వాత మళ్లీ విజయ్ తో ‘లియో’ సినిమా చేయగా.. ఈ సినిమా దాదాపు రూ.600 కోట్ల కలెక్షన్స్ వసూలు సాధించిన చిత్రంగా విజయ్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఇక ఇప్పుడు విజయ్ తో రెండు విజయవంతమైన చిత్రాలు తర్వాత లోకేష్ రజనీకాంత్ (Rajinikanth)తో ‘కూలీ’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే కార్తీతో ఖైదీ 2, కమలహాసన్ తో విక్రం 2 చిత్రాలతో పాటు రోలెక్స్, ఇరుంబుకై మాయావి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించనున్నారు.