Sanam Shetty.. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి భయపడి కొంతమంది ఇండస్ట్రీకి దూరమైతే.. మరి కొంతమంది ధైర్యంగా ఎదుర్కొని, ఉన్నత స్థాయికి చేరుకున్నారు. మరి కొంతమంది దీని బారినపడి ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వారు కూడా లేకపోలేదు. ఇకపోతే మీ టూ ఉద్యమం వచ్చిన తర్వాత చాలామంది ఆడవారు ధైర్యంగా తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బయట పెడుతూ.. అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా తమకు జరిగిన అన్యాయాన్ని అందరితో చెబుతూ.. ఇంకొకరికి ఇలా కాకుండా సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రముఖ బిగ్ బాస్ ఫేమ్, కోలీవుడ్ నటి సనమ్ శెట్టి (Sanam Shetty) కూడా నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి.
నిర్మాతలపై సనమ్ శెట్టి కామెంట్స్..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సనమ్ శెట్టి మాట్లాడుతూ.. తమిళ సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కొంతమంది నిర్మాతలను సినిమాలలో అవకాశం కోసం సంప్రదిస్తే, తమతో బెడ్ షేర్ చేసుకోవాలని వేధిస్తున్నారంటూ కామెంట్ చేసింది. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో లింగ వివక్షత విపరీతంగా ఉందని తెలిపిన ఆమె, హీరోయిన్లకు ఒక పారితోషకం, హీరోలకు మరో పారితోషకం ఇస్తున్నారని సమానత్వం అనేది కేవలం మాటల్లో మాత్రమే ఉందని, దానిని ఎవరూ పాటించడం లేదు అంటూ కూడా తెలిపింది. నిర్మాతలు కాల్స్ చేసి మరీ పిలుస్తారు. అయితే వారేదో సినిమాలలో అవకాశం ఇస్తారు అని వెళ్తే.. తమతో మొదట గడపాలని, పడక పంచుకుంటేనే అవకాశం ఇస్తామన్నట్లు వ్యవహరిస్తున్నారని సనమ్ శెట్టి ఇండస్ట్రీలో జరిగే అన్యాయాల గురించి మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తానికి అయితే సినీ ఇండస్ట్రీ నిర్మాతలపై సనమ్ శెట్టి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సనమ్ శెట్టి కెరియర్..
సనమ్ శెట్టి విషయానికి వస్తే.. మహేష్ బాబు(Maheshbabu) ‘శ్రీమంతుడు’ సినిమాలో మేఘనా పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత సంపూర్ణేష్ బాబు (sampoornesh babu) హీరోగా నటించిన ‘ సింగం 1 2 3’ సినిమాల్లో సహాయక పాత్ర పోషించిన ఈ అమ్మడు.. 2019 తమిళ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొని మెప్పించింది. ముఖ్యంగా తమిళంలో అనేక చిత్రాలలో నటించిన సనమ్ శెట్టి.. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొని బయటకు వచ్చిన తర్వాత పాపులారిటీ మరింత పెరిగిపోయింది. ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ రోజుకొక గ్లామర్ ఫోటో షేర్ చేస్తూ యాక్టివ్ గా కనిపించే ఈమె, మానస్ నాగులపల్లి హీరోగా తెరకెక్కిన ‘ ప్రేమికుడు’ సినిమాలో కూడా నటించింది. అప్పుడప్పుడు సినీ ఇండస్ట్రీలో జరిగే అంశాలపై స్పందించే సనమ్ శెట్టి ఇప్పుడు ఏకంగా క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతూ కొంతమంది నిర్మాతలను టార్గెట్ చేసి కామెంట్లు చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఆ నిర్మాతలు ఎవరు అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు సనమ్ శెట్టి. మొత్తానికైతే ఈ అమ్మడు చేసిన కామెంట్లు ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపుతున్నాయని చెప్పవచ్చు.