Big Stories

Hit 2 Movie Review : హిట్-2 మూవీ రివ్యూ

Hit 2 Movie Review : సినిమా: హిట్ ది సెకెండ్ కేస్
విడుదల: 2 డిసెంబర్ 2022
నటీనటులు : అడివి శేష్‌, మీనాక్షి చౌద‌రి, రావు ర‌మేష్‌, పోసాని కృష్ణ ముర‌ళి, త‌నికెళ్ల భ‌ర‌ణి, శ్రీనాథ్ మాగంటి, కోమ‌లి ప్ర‌సాద్ త‌దిత‌రులు
ఛాయాగ్రహణం : మ‌ణి కంద‌న్‌ ఎస్‌
నేపథ్య సంగీతం : జాన్ స్టీవార్ట్ ఏడూరి
స్వరాలు : ఎం.ఎం. శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి
సమర్పణ : నాని
నిర్మాత : ప్రశాంతి త్రిపిర్‌నేని
రచన, దర్శకత్వం : శైలేష్ కొలను

- Advertisement -

విశ్వక్ సేన్ హీరోగా గతంలో వచ్చిన ‘హిట్ ది ఫస్ట్ కేస్’ మూవీతో డైరెక్టర్ శైలేష్ కొలను థ్రిల్లర్ ప్రేమికులందరినీ తనవైపు తిప్పుకున్నారు. హిట్(హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్) అనే యూనివర్స్‌ను క్రియేట్ చేసి మరింత ఆసక్తిని పెంచారు. ఫస్ట్ కేస్ ఇన్వెస్టిగేషన్‌ను విశ్వక్ సేన్ ఎంతో సక్సెస్‌ఫుల్‌గా చేయడంతో.. సెకెండ్ కేస్‌ను డీల్ చేసేది ఎవరు? అనే ఇంట్రెస్ట్ ప్రేక్షకుల్లో నెలకొంది. ఆ ఇంట్రెస్ట్‌ను మరింత పెంచుతూ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అడివి శేష్‌ను హిట్ సెకెండ్ కేస్‌ను డీల్ చేసే ఆఫీసర్‌గా ప్రకటించి డైరెక్టర్ శైలేష్ అక్కడే తన తొలి విజయాన్ని సాధించారు.

- Advertisement -

ఇక హిట్-1 కన్నా హిట్-2పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణం నాని అండ్ టీమ్ చేసిన ప్రమోషన్స్ అని చెప్పాలి. సినిమా రిలీజ్‌కు ముందు రోజు రాత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి తన కాన్ఫిడెన్స్ గురించి చెబుతూ సినిమాలోని సస్పెన్స్ విషయాలను రివీల్ చేసి ఆ థ్రిల్‌ను స్పాయిల్ చేయొద్దని రిక్వెస్ట్ చేశారంటే వాళ్ల ప్రమోషన్స్ అండ్ సినిమాపై వాళ్లు పెట్టుకున్న హోప్స్ ఎంతలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి వాళ్ల హోప్స్‌ను ‘హిట్ ది సెకెండ్ కేస్’ సినిమా నిలబెట్టిందో లేదో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్దాం…

కథ

వైజాగ్‌లో హోమిసైడ్ ఇంట‌ర్‌వెన్ష‌న్ టీమ్‌(హిట్)కి ఎస్పీగా కృష్ణ దేవ్ అలియాస్ కేడీ (అడివి శేష్‌) పని చేస్తుంటారు. అతనికి వెట‌కారం ఎక్కువ‌. ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్ క‌దా అని సీరియ‌స్‌గా ఉండ‌డు. కాస్త కూల్‌గా ఉంటూ త‌న ప‌ని తాను చేసుకుంటూ ఉంటాడు. అలా అతను ఓ మర్డర్ కేసును క్షణాల్లో సాల్వ్ చేసేస్తాడు. క్రిమినల్స్‌వి కోడి బుర్రలు అని, వాళ్లను పట్టుకోవడం చాలా తేలిక అని ఎగతాళి చేస్తాడు. ఇక ఆర్యా (మీనాక్షి చౌదరి) చేనేత కార్మికులు, మహిళా సంఘాలు అంటూ తిరుగుతుంటుంది. ఆర్యా, కేడీ కలిసి లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటారు. అలా సాఫీగా సాగడుతున్న కేడీ జీవితంలోకి ఓ సీరియల్ కిల్లర్ ఎంట్రీ ఇస్తాడు.

ఓ పబ్‌లో పని చేసే సంజన అనే అమ్మాయి అతి కిరాతకంగా హత్యకు గురవుతుంది. అక్కడ త‌ల‌, కాళ్లు, మొండెం ముక్కలుగా ఉంటాయి. ఆ కేసుని ఇన్వెస్టిగేష‌న్ చేసే క్ర‌మంలో త‌ల మాత్ర‌మే సంజ‌నద‌ని, మిగిలిన బాడీ పార్ట్ మ‌రో ముగ్గురు అమ్మాయిల‌ద‌నే నిజం తెలిసి కేడీ షాక్ అవుతాడు. నాలుగు హ‌త్య‌ల‌ను చేసిన ఆ సైకో కిల్ల‌ర్‌ను ప‌ట్టుకోవ‌టానికి ఆధారాలు కూడా ఏవీ దొర‌క‌వు. ఉన్న ఆధారాలు మిస్ లీడ్ అవడంతో ఓ అమాయ‌కుడు చ‌నిపోతాడు. దాంతో కేడీ ఇంకా టెన్ష‌న్ ప‌డిపోతాడు. ఈ కేసును చేధించేందుకు కేడీ చేసిన ప్రయత్నాలు ఏంటి? ఈ క్రమంలో రామ్ దాస్ (హర్ష వర్దన్) గురించి తెలుసుకున్నది ఏంటి? కుమార్ (సుహాస్‌) పాత్ర ఏంటి? సీరియల్ కిల్లర్ కన్ను ఆర్యా మీద ఎందుకు పడుతుంది? ఆర్యాను చివరకు కేడీ కాపాడుకుంటాడా? ఈ కథలో విలన్ ఎవరు అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు థ్రిల్లర్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందులోనూ ట్విస్టులతో కూడిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీలకు ఇంకొంతమంది ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. ఈ విషయాన్ని గమనించిన యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను రెండేళ్ల క్రితం ‘హిట్’ సినిమాను తీసి తన స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు దానికి కొనసాగింపు అని కాకుండా ఫ్రాంఛైజీతో కొత్త కేసును టేకప్ చేశాడు. అడవి శేష్ లాంటి హీరోను పెట్టి కేసుపై ఇంట్రస్ట్ క్రియేట్ చేశాడు. హిట్ ది సెకెండ్ కేస్ విశాఖ సిటీలో జరుగుతుంది. పబ్‌లో పని చేసే అమ్మాయి హత్యకు గురవడంతో హిట్ సెకెండ్ కేస్ స్టార్ట్ అవుతుంది. అక్క‌డ ఒక అమ్మాయి కాదు, న‌లుగుర‌మ్మాయిలు హ‌త్య‌కి గుర‌య్యార‌ని తెలిశాక.. అది మ‌రింత లోతుగా ఉంద‌నే విష‌యం అర్థ‌మ‌వుతుంది.

ఇన్వెస్టిగేషన్ స్టార్ అవడం.. ఈ హత్యలు ఎవరు చేసేశారనే అనుమానాలు వ్య‌క్తం అవ‌డం, నిందితుడు ఇత‌డే అనేలా అవి ముందుకు సాగ‌డం, అంత‌లోనే ఊహించ‌ని మ‌లుపు చోటు చేసుకుని అస‌లు నిందితుడు ఇంకొకరు ఉన్నార‌ని తేల‌డం… ఇలా క్లైమాక్స్ ముందు వరకు సినిమా చాలా ఆసక్తిగా సాగుతుంది. అయితే విలన్‌ను రివీల్ చేసే విషయంలో డైరెక్టర్ మరింత గ్రిప్పింగ్‌గా స్క్రీన్ ప్లేను రాసుకుంటే బాగుండేదనిపిస్తుంది. ఎంత సీరియల్ కిల్లర్ అయితే మాత్రం ఒక్కడే అన్నిచోట్లా ఉండి.. అంత నైపుణ్యం ఉన్న ఆఫీసర్‌కే సవాల్ విసురుతున్నాడంతో అతని బ్యాక్‌గ్రౌండ్ మరింత బలంగా ఉండేలా చూపించాలి. ఇక విలన్‌ను రివీల్ చేశాక అతను ఎందుకలా అమ్మాయిలను చంపుతున్నాడో తెలియజెప్పే సన్నివేశం ప్రేక్షకులకు సులభంగా అర్థమవుతుంది. అందుకు ఓపెనింగ్ సీనే కారణం.

ఓపెనింగ్ సీన్‌ను విలన్ బ్యాక్‌గ్రౌండ్ రివీల్ చేసేటప్పుడు చూపించుంటే ఇంకొంచెం ఆసక్తి పెరిగేది. అయితే దర్శకుడు తాను అనుకున్నదాంట్లో ప్రేక్షకుడికి సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా బోర్ కొట్టకుండా చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. సినిమా ఇంత త్వరగా అయిపోయిందా అనే ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటులు, సాంకేతిక సిబ్బంది పనితీరు

ఎస్పీ కృష్ణదేవ్ పాత్ర‌లో అడివి శేష్ ఒదిగిపోయాడు. తనకు అలవాటైన ఇన్వెస్టిగేషన్‌‌ను చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్లాడు. అయితే ఈ సారి వయలెన్స్‌తో పాటు కాస్త రొమాంటిక్ టచ్ కూడా ఇచ్చాడు. అలాగే అక్క‌డ‌క్క‌డా భావోద్వేగాల‌ను కూడా పండించాడు. హీరో గ‌ర్ల్‌ఫ్రెండ్ ఆర్య పాత్ర‌లో మీనాక్షి చౌద‌రి ఆకట్టుకుంది. తోటి అధికారుల పాత్ర‌ల్లో కోమ‌లి ప్ర‌సాద్‌, శ్రీనాథ్ మాగంటి త‌దిత‌రులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. రావు ర‌మేష్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ల భ‌ర‌ణి త‌దిత‌రులు చిన్న పాత్ర‌ల్లోనే కనిపించినా హుందాగా నటించారు.

ఇక సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను హిట్ యూనివర్స్‌ను క్రియేట్ చేస్తున్న తీరును అభినందించాలి. సైకో పాత్ర‌నీ, అత‌డు ఎందుక‌లా మారాడ‌నే అంశాన్ని మ‌రింత ప్ర‌భావ‌వంతంగా తీర్చిదిద్ద‌డంలోనే కొంచెం అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించిన‌ట్టు అనిపిస్తుంది త‌ప్ప‌, మిగ‌తా క‌థ‌ని చాలా బాగా రాసుకున్నాడు. వాల్ పోస్టర్ సినిమా నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. కెమెరా, సంగీతం, ఎడిటింగ్ విభాగాలు మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి.

హిట్-2ను ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు ప్రెజెంట్ చేసిన డైరెక్టర్ శైలేష్ కొలను హిట్-3 విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరిస్తున్నట్లు క్లైమాక్స్‌లో హింట్ ఇచ్చారు. హిట్-3లో కనిపించబోయే హీరోను రివీల్ చేసి థర్డ్ కేస్‌పై కూడా ఇప్పుడే అంచనాలు పెంచాడు.

థ్రిల్లర్ సినిమాల ప్రేమికులను నిజంగా థ్రిల్‌కు గురి చేసే ‘హిట్ ది సెకెండ్ కేస్’

రేటింగ్: 3.25/5

-బిల్లా గంగాధర్

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News