Star Hero : హాలీవుడ్ నుంచి వచ్చే కొన్ని సర్వైవల్ థ్రిల్లర్స్ వణుకు పుట్టిస్తాయి. అలాంటి రియల్ సీన్ చోటు చేసుకుంది తాజాగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో (Los Angeles Wild Fire). ఎక్కడ చూసినా కార్చిచ్చు వల్ల చెలరేగిన మంటలు, పొగతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పలువురు హాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్ళు, సంపద కళ్ల ముందే కాలి బూడిద అయిపోయాయి.
ప్రముఖ నటుడి ఇల్లు దగ్ధం
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ (Los Angeles Wild Fire) ను కార్చిచ్చు చుట్టుముట్టడంతో వేలాది ఇళ్ళు అగ్నికి ఆహుతి అయినట్టుగా తెలుస్తోంది. సంపన్న వర్గాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ కార్చిచ్చు చెలరేగడంతో దాదాపు 3 ఎకరాలకు పైగా దగ్ధం కాగా, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి, 30 వేల మందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారని సమాచారం. ఈ కార్చిచ్చు ఎలా అంటుకుంది అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. అలాగే ఈ ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదని తెలుస్తోంది. కానీ ఇప్పటికే అక్కడ వాహనాలు, విలువైన వస్తువులతో పాటు ఇళ్లన్నీ కాలిపోయాయి. తాజా సమాచారం ప్రకారం అమెరికాలో ఉండే పలువురు హాలీవుడ్ స్టార్ల నివాసాలు కూడా ఈ మంటల్లో కాలి బూడిద అయ్యాయి. ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ వుడ్స్ (James Woods) తన ఇంటికి సమీపంలోని కొండపై అంటుకున్న మంటలు, అందులో ఇల్లు తగలబడిపోతున్న ఫోటోను షేర్ చేస్తూ ఆవేదనను వ్యక్తం చేశారు.
To all the wonderful people who’ve reached out to us, thank you for being so concerned. Just letting you know that we were able to evacuate successfully. I do not know at this moment if our home is still standing, but sadly houses on our little street are not. pic.twitter.com/xZjvsIg6Fg
— James Woods (@RealJamesWoods) January 7, 2025
ఇక ఈ కార్చిచ్చు కారణంగా హాలీవుడ్ నటులైన టామ్ హాంక్స్, రీస్ విథర్స్పూన్, స్పెన్సర్ ప్రాట్, స్టీవ్ గుట్టెన్‌బర్గ్ వంటి ప్రముఖుల ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వీళ్ళ ఇల్లు మాత్రమే కాదు లాస్ ఏంజిల్స్ లో సెలబ్రిటీలు, సంపన్నులు నివాసం ఉండే ది పాలిసాడ్స్ ప్రాంతంలో ఉన్న వేలాది ఇళ్ళు కాలిపోయాయి. అందమైన బీచ్ లతో చూడడానికి ముగ్ధ మనోహరంగా కనిపించే లాస్ ఏంజెల్స్ లోని ఈ ప్రాంతం ప్రస్తుతం కమ్మేసిన కార్చిచ్చుతో చూడడానికే భయంకరంగా మారి వణికిస్తోంది. అక్కడ అగ్నిమాపక దళాలు ప్రస్తుతం హెలికాప్టర్లు, విమానాలతో మంటలను ఆపేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వీధిలో ఎక్కడ చూసినా పొగ కమ్మేయడంతో కళ్ళ ముందు ఏముందో కూడా కనిపించే పరిస్థితి లేదు. ఆ ప్రాంతంలో ఉన్న చాలా మంది తమ వాహనాలను, సామాగ్రిని అక్కడే పెట్టి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని, అక్కడి నుంచి తరలి వెళ్ళినట్టు తెలుస్తోంది. గాలులు వేగంగా వీస్తుండడం వల్ల ఈ మంటల తీవ్రతను కట్టడి చేయలేకపోతున్నారు. ఇక ఈ మంటలు ఇలాగే కంటిన్యూ అయితే బేవర్లి హిల్స్, హాలీవుడ్ హిల్స్, షాన్ ఫెర్నాండో, మలిబు వంటి ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం లేకపోలేదు. అందుకే ముందు జాగ్రత్తగా ఆయా ప్రాంతాల్లో అధికారులు ఫైర్ అలర్ట్ ను జారీ చేసినట్టు తెలుస్తోంది.
ఆగిపోయిన సినిమాలు
ప్రస్తుతానికి 13వేల నిర్మాణాలకు కార్చించు ముప్పు ఉందని లాస్ ఏంజెల్స్ అగ్నిమాపక అధికారి వెల్లడించారు. ఇక ఈ కార్చిచ్చు కారణంగా దాదాపు 62,000 మంది ప్రజలు కొన్ని గంటలుగా అక్కడ విద్యుత్తు లేకుండా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అగ్ని, గాలులతో కూడిన వాతావరణం కారణంగా జెన్నిఫర్ లోపెజ్ కొత్త చిత్రంతో సహా మరో రెండు సినిమాల ప్రీమియర్‌లను రద్దు చేశారు.